Eternal life
-
సాధన అంటే ఇలా ఉండాలి!
ఆత్మీయం దక్షిణదేశంలో ‘తిరువళ్లువార్’ అనే పేరును విననివారు అరుదు. అతడు మహాభక్తుడు, జ్ఞాని. నేత నేసి తన సంసారాన్ని నిర్వహించేవాడు. వారంలో ఒకనాడు పూర్తిగా భగవంతుని సేవకు వినియోగించేవాడు. ఆయన భార్య వాసుకి. కాపురానికి వచ్చినప్పటినుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నెనిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దొన్నె నీటినిగాని, సూదినిగాని ఎన్నడూ ఉపయోగించలేదు. వాసుకి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి ‘నాకొక సందేహం ఉంది తీరుస్తారా?’ అనడిగింది భర్తను. సరేనన్నాడు తిరువళ్లువార్. ‘‘మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కాని మీరెప్పుడూ దొన్నెలో నీరుగాని, సూదిగాని ఉపయోగించటం నేను చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటన్నదే నా సందేహం. దీనినే తీర్చవలసింది’’ అని అడిగింది. తిరువళ్లువార్ చిరునవ్వుతో ఇలా అన్నాడు. ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయరాదు. వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కిందపడితే దానిని సూదితో తీసి, నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశ్యం. నీవు ఏనాడూ పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కిందపడేయలేదు, అందుకే సూదిని, నీటిని ఉపయోగించే అవసరం రాలేదు’’అన్నాడు. వాసుకి సందేహం తీరి, భర్త ఒడిలో ప్రాణం వదిలింది. తిరువళ్లువార్ అన్నాన్ని బ్రహ్మగా భావించాడు. అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో, కిందపడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకనాడు కాదు, జీవితాంతం చేసింది. ఈ యోగం ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో చేస్తే ఇంతకంటే సాధన వేరొకటి లేదు. -
గుణం.. శీలం... స్నేహం
ఆత్మీయం రామాయణం కేవలం కథ కాదు... అందులోని విషయాలు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. రామరావణ సంగ్రామ సమయంలో విభీషణుడు రాముని శరణుకోరి వచ్చినప్పుడు లక్ష్మణుడు విభీషణుడిని నమ్మవద్దని, ఇక్కడికి కేవలం గూఢచారిగానే వచ్చాడని అంటాడు రాముడితో. కాని విభీషణుడు వచ్చి పలికిన పలుకులు విన్న తరవాత లక్ష్మణుడు తన తప్పు తెలుసుకుంటాడు. తొందరపాటు వద్దనీ, ఇతరులను అనవసరంగా నిందించవద్దనీ హితవు పలుకుతాడు రాముడు. అంతేకాదు, రాముడు ఎందరితోనో స్నేహం చేశాడు. వానర రాజయిన సుగ్రీవునితో, పడవలు నడుపుకుంటూ, చేపలు పడుతూ కాలక్షేపం చేసే గుహునితో, శత్రురాజయిన రావణుని తమ్ముడు విభీషణునితో, హనుమతో, నిషాద రాజుతో... ఇలా ఒకరనేమిటి... ప్రతివారితోటీ రామునికి గల మైత్రీ బంధం ఆచరణీయం. శబరి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమె యోగశక్తికి శ్రీరాముడు ఆనందపడిన ఘట్టం చూసినా రాముడు గుణానికిచ్చిన ప్రాధాన్యత బోధపడుతుంది. గుణం, శీలం ఉన్నవారిని ఉన్నతంగా చూడగలగడమే రాముని లక్షణం. ఇటువంటి విషయాలను గ్రహించగల వివేకం అందరికీ ఉండాలని రామాయణం చెబుతోంది. ఇలా మన నిత్యజీవితంలో ఆదర్శంగా నడవడానికీ లోక కల్యాణానికి వినియోగపడే రీతిలో బతకడానికి అవసరమయిన అనేకానేక ధర్మసూక్ష్మాలు, నీతివాక్యాలూ రామాయణ సాగరంలో దొరికే ముత్యాలు. -
నవ చేతన అక్షర కేతనం!
ఏప్రిల్ 22 చేతన్ భగత్ జన్మదినం ‘రచయిత కావడానికి అర్హత ఏమిటి? ఆకర్షణీయమైన స్టోరీ లైనా? ఆకట్టుకునేలా రాయడమా?’ అన్న ప్రశ్నకు చేతన్ భగత్ సమాధానం... ‘పాఠకులకు కనెక్టయ్యేలా రాయగలగడమే అసలు సిసలు అర్హత’! పై సమాధానంలోనే రచయితగా చేతన్ విజయ రహస్యం దాగుంది. ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ నవలలో కనిపించే హరికుమార్, రెయాన్, అలోక్గుప్తాలు ఆ నవలకు మాత్రమే పరిమితమైనవాళ్లు కాదు. పోటీ ప్రపంచానికి, సృజనాత్మక ఏకాంతానికి మధ్య తలెత్తే వైరుధ్యాలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల మన నిత్యజీవితంలో కనిపిస్తూనే ఉంటారు. ‘2 స్టేట్స్’ పాక్షికంగా చేతన్ కథ అంటారుగానీ అది ఆయనకు మాత్రమే పరిమితమైన ప్రేమకథ కాదు అనిపిస్తుంది. భౌగోళిక సరి హద్దులు, భాషాసంస్కృతులతో నిమిత్తం లేని అందరు ప్రేమికుల కథ అది. చదువు విజ్ఞానంగా కాకుండా మూడు పువ్వులు ఆరుకాయల వ్యాపారంగా మారుతున్న వర్తమాన దృశ్యం, తల్లిదండ్రుల తీయటి ఆశలు, ప్రై‘వేటు’ కోచింగ్ సెంటర్ల దోపిడీ ‘రెవల్యూషన్ 2020’ నవలలో కనిపిస్తాయి. ‘హాఫ్-గర్ల్‌ఫ్రెండ్’ నవలలో మధ్యతరగతి ప్రపంచం పలకరిస్తుంది. చేతన్ పుస్తకం ఏది తీసుకున్నా అందులోని పాత్రలు, పరిస్థితులు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. కనెక్ట్ కావడం అంటే ఇదే కదా! అయితే సీరియస్ సాహిత్య ప్రపంచం ‘బెస్ట్ సెల్లింగ్ ఆథర్’ అయిన చేతన్‌ను రచయితగానే గుర్తించలేదు. ‘ఫాస్ట్‌ఫుడ్ రచనలు చేస్తాడు’ అన్నారు. ‘మాస్ స్టఫ్ మాత్రమే రాయగలడు. అతడు రాసే ఇంగ్లిష్‌లో బోలెడు గ్రామర్ మిస్టేక్స్’ అని, ‘రాసిందే రాస్తున్నాడు. కొత్తగా ఏమీ రాయడం లేదు’ అని అంటూనే ఉన్నారు. అయినా అతని పుస్తకాలను ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు. ‘అవి క్లాసిక్సా?’ అంటే... ‘కానే కాదు... జస్ట్ కనెక్టయ్యారంతే’ అని చేతనే అంటాడు! రచయితగా చేతన్ విజయానికి కీలక బలం సరళ వచనం. ఎప్పుడూ పుస్తకం ముట్టని మనిషి కూడా అతడి పుస్తకాలు గబగబా చదివేయగలడు. ‘ఇంగ్లిష్ పుస్తకాలు చదవడమంటే నాకు భయం. అవి ఒక పట్టాన అర్థం కావు’ అని దూరంగా పారిపోయే కుర్రాళ్లు కూడా ‘సింపుల్ బుక్ ఇన్ ఇంగ్లిష్’ అంటూ స్వీట్ తిన్నంత ఇష్టంగా చేతన్ పుస్తకాలు చదవగలరు. ఫిక్షన్ మాత్రమే కాదు...‘వాట్ యంగ్ ఇండియా వాంట్స్’ పేరుతో వచ్చిన పుస్తకంతో ‘నేను నాన్ఫిక్షన్ రచయితను కూడా సుమా!’ అని నిరూపించాడు చేతన్ భగత్. అందుకే ఆయన చాలా మంది మెచ్చిన రచయిత అయ్యాడు! -
నో స్టాక్ !
చల్దన్నంలో ఉల్లిపాయ నంజుకు తింటేనే కూలీ నాలుకకు కాస్త మజా తెలిసేది. రోజువారీ వంటల్లో ఏ కూర వండినా.. ఉల్లిఘాటు తోడైతేనే రుచి తగిలేది. చివరికి హోటల్లో దోశయినా.. పూరీ కూరయినా.. అందులో ఉల్లి రుచి కోసం జిహ్వ జివ్వున లాగకమానదు. నిత్య జీవితంలో ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఉల్లి ధర దాదాపు నెల రోజులుగా ఘాటెక్కింది. అయినప్పటికీ ప్రభుత్వం నామమాత్ర చర్యలతోనే సరిపెడుతూ, ప్రజల సహనానికి పరీక్ష పెడుతోంది. ఫలితంగా వినియోగదారుల కంట కొనకుండానే ఉల్లి.. కన్నీరు పెట్టిస్తోంది. కాకినాడ సిటీ : నెల రోజుల నుంచి మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ దశలో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రాయితీపై ఉల్లి సరఫరా చేయాలని నిర్ణయించింది. గత నెల 30 నుంచి జిల్లాలోని అన్ని రైతుబజార్లలో కేజీ ఉల్లిపాయలను రాయితీపై రూ.20కే విక్రయించడం ప్రారంభించారు. కాకినాడ, రాజమండ్రి, రావులపాలెం, కొత్తపేట, అమలాపురంలలోని 12 రైతుబజార్ల ద్వారాను; రామచంద్రపురం, మండపేట, పెద్దాపురం, పిఠాపురం, తుని పట్టణాల్లో మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ ద్వారాను 20 రోజులపాటు 8 వేల క్వింటాళ్ల ఉల్లిపాయలు రాయితీపై విక్రయించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రాయితీ అమ్మకాలు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. ఈ నెల 15 నుంచి షాపుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఐదు రోజులుగా రైతుబజార్లలో ఉల్లి నిల్వలు నిండుకోవడంతో ప్రజలకు బహిరంగ మార్కెట్లో ధరల ఘాటు తప్పడంలేదు. ప్రస్తుతం బయటి మార్కెట్లో కిలో ఉల్లిని రూ.45 నుంచి రూ.65 వరకూ విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉల్లి పండే ప్రాంతాల్లో దిగుబడి తగ్గడంతో దీని ధరలు ఇప్పుడప్పుడే దిగిరాక పోవచ్చని, మరో మూడు నెలలు ఇదే పరిస్థితి ఉండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. అయినప్పటికీ బహిరంగ మార్కెట్లో ధరల నియంత్రణకు కానీ, అక్రమ నిల్వలపై చర్యలు తీసుకునేందుకు కానీ అధికారులు ఉపక్రమించిన దాఖలాలు కనిపించడంలేదు. ఉల్లి కొరత నివారణకు చర్యలు జిల్లాలో ఉల్లిపాయల కొరతను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కర్నూలు మార్కెట్లో ఉల్లిపాయలు అయిపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. 40 టన్నుల ఉల్లిపాయలను రైతుబజార్లల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నాం. వీటి అమ్మకాలు బుధవారం నుంచి జరుగుతాయి. - ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్