సాధన అంటే ఇలా ఉండాలి! | Playing must be like this! | Sakshi
Sakshi News home page

సాధన అంటే ఇలా ఉండాలి!

Published Tue, Jul 25 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

సాధన అంటే ఇలా ఉండాలి!

సాధన అంటే ఇలా ఉండాలి!

ఆత్మీయం

దక్షిణదేశంలో ‘తిరువళ్లువార్‌’ అనే పేరును విననివారు అరుదు. అతడు మహాభక్తుడు, జ్ఞాని. నేత నేసి తన సంసారాన్ని నిర్వహించేవాడు. వారంలో ఒకనాడు పూర్తిగా భగవంతుని సేవకు వినియోగించేవాడు. ఆయన భార్య వాసుకి. కాపురానికి వచ్చినప్పటినుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నెనిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దొన్నె నీటినిగాని, సూదినిగాని ఎన్నడూ ఉపయోగించలేదు. వాసుకి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి ‘నాకొక సందేహం ఉంది తీరుస్తారా?’ అనడిగింది భర్తను. సరేనన్నాడు తిరువళ్లువార్‌. ‘‘మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కాని మీరెప్పుడూ దొన్నెలో నీరుగాని, సూదిగాని ఉపయోగించటం నేను చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటన్నదే నా సందేహం. దీనినే తీర్చవలసింది’’ అని అడిగింది.

తిరువళ్లువార్‌ చిరునవ్వుతో ఇలా అన్నాడు. ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయరాదు. వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కిందపడితే దానిని సూదితో తీసి, నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశ్యం. నీవు ఏనాడూ పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కిందపడేయలేదు, అందుకే సూదిని, నీటిని ఉపయోగించే అవసరం రాలేదు’’అన్నాడు. వాసుకి సందేహం తీరి, భర్త ఒడిలో ప్రాణం వదిలింది. తిరువళ్లువార్‌ అన్నాన్ని బ్రహ్మగా భావించాడు. అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో, కిందపడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకనాడు కాదు, జీవితాంతం చేసింది. ఈ యోగం ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో చేస్తే ఇంతకంటే సాధన వేరొకటి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement