చల్దన్నంలో ఉల్లిపాయ నంజుకు తింటేనే కూలీ నాలుకకు కాస్త మజా తెలిసేది. రోజువారీ వంటల్లో ఏ కూర వండినా.. ఉల్లిఘాటు తోడైతేనే రుచి తగిలేది. చివరికి హోటల్‌లో దోశయినా.. పూరీ కూరయినా.. అందులో ఉల్లి రుచి కోసం జిహ్వ జివ్వున లాగకమానదు. నిత్య జీవితంలో ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఉల్లి ధర దాదాపు నెల రోజులుగా ఘాటెక్కింది. అయినప్పటికీ ప్రభుత్వం నామమాత్ర చర్యలతోనే సరిపెడుతూ, ప్రజల సహనానికి పరీక్ష పెడుతోంది. ఫలితంగా వినియోగదారుల కంట కొనకుండానే ఉల్లి.. కన్నీరు పెట్టిస్తోంది.
కాకినాడ సిటీ : నెల రోజుల నుంచి మార్కెట్‌లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ దశలో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రాయితీపై ఉల్లి సరఫరా చేయాలని నిర్ణయించింది. గత నెల 30 నుంచి జిల్లాలోని అన్ని రైతుబజార్లలో కేజీ ఉల్లిపాయలను రాయితీపై రూ.20కే విక్రయించడం ప్రారంభించారు. కాకినాడ, రాజమండ్రి, రావులపాలెం, కొత్తపేట, అమలాపురంలలోని 12 రైతుబజార్ల ద్వారాను; రామచంద్రపురం, మండపేట, పెద్దాపురం, పిఠాపురం, తుని పట్టణాల్లో మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ ద్వారాను 20 రోజులపాటు 8 వేల క్వింటాళ్ల ఉల్లిపాయలు రాయితీపై విక్రయించినట్టు అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ రాయితీ అమ్మకాలు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. ఈ నెల 15 నుంచి షాపుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఐదు రోజులుగా రైతుబజార్లలో ఉల్లి నిల్వలు నిండుకోవడంతో ప్రజలకు బహిరంగ మార్కెట్‌లో ధరల ఘాటు తప్పడంలేదు. ప్రస్తుతం బయటి మార్కెట్‌లో కిలో ఉల్లిని రూ.45 నుంచి రూ.65 వరకూ విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉల్లి పండే ప్రాంతాల్లో దిగుబడి తగ్గడంతో దీని ధరలు ఇప్పుడప్పుడే దిగిరాక పోవచ్చని, మరో మూడు నెలలు ఇదే పరిస్థితి ఉండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. అయినప్పటికీ బహిరంగ మార్కెట్‌లో ధరల నియంత్రణకు కానీ, అక్రమ నిల్వలపై చర్యలు తీసుకునేందుకు కానీ అధికారులు ఉపక్రమించిన దాఖలాలు కనిపించడంలేదు.
ఉల్లి కొరత నివారణకు చర్యలు
జిల్లాలో ఉల్లిపాయల కొరతను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కర్నూలు మార్కెట్‌లో ఉల్లిపాయలు అయిపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. 40 టన్నుల ఉల్లిపాయలను రైతుబజార్లల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నాం. వీటి అమ్మకాలు బుధవారం నుంచి జరుగుతాయి.
- ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్
నో స్టాక్ !
Published Wed, Aug 19 2015 1:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement
Advertisement