నవ చేతన అక్షర కేతనం!
ఏప్రిల్ 22 చేతన్ భగత్ జన్మదినం
‘రచయిత కావడానికి అర్హత ఏమిటి? ఆకర్షణీయమైన స్టోరీ లైనా? ఆకట్టుకునేలా రాయడమా?’ అన్న ప్రశ్నకు చేతన్ భగత్ సమాధానం... ‘పాఠకులకు కనెక్టయ్యేలా రాయగలగడమే అసలు సిసలు అర్హత’! పై సమాధానంలోనే రచయితగా చేతన్ విజయ రహస్యం దాగుంది. ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ నవలలో కనిపించే హరికుమార్, రెయాన్, అలోక్‌గుప్తాలు ఆ నవలకు మాత్రమే పరిమితమైనవాళ్లు కాదు.
పోటీ ప్రపంచానికి, సృజనాత్మక ఏకాంతానికి మధ్య తలెత్తే వైరుధ్యాలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల మన నిత్యజీవితంలో కనిపిస్తూనే ఉంటారు. ‘2 స్టేట్స్’ పాక్షికంగా చేతన్ కథ అంటారుగానీ అది ఆయనకు మాత్రమే పరిమితమైన ప్రేమకథ కాదు అనిపిస్తుంది. భౌగోళిక సరి హద్దులు, భాషాసంస్కృతులతో నిమిత్తం లేని అందరు ప్రేమికుల కథ అది. చదువు విజ్ఞానంగా కాకుండా మూడు పువ్వులు ఆరుకాయల వ్యాపారంగా మారుతున్న వర్తమాన దృశ్యం, తల్లిదండ్రుల తీయటి ఆశలు, ప్రై‘వేటు’ కోచింగ్ సెంటర్ల దోపిడీ ‘రెవల్యూషన్ 2020’ నవలలో కనిపిస్తాయి.
‘హాఫ్-గర్ల్‌ఫ్రెండ్’ నవలలో మధ్యతరగతి ప్రపంచం పలకరిస్తుంది. చేతన్ పుస్తకం ఏది తీసుకున్నా అందులోని పాత్రలు, పరిస్థితులు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. కనెక్ట్ కావడం అంటే ఇదే కదా! అయితే సీరియస్ సాహిత్య ప్రపంచం ‘బెస్ట్ సెల్లింగ్ ఆథర్’ అయిన చేతన్‌ను రచయితగానే గుర్తించలేదు. ‘ఫాస్ట్‌ఫుడ్ రచనలు చేస్తాడు’ అన్నారు. ‘మాస్ స్టఫ్ మాత్రమే రాయగలడు.
అతడు రాసే ఇంగ్లిష్‌లో బోలెడు గ్రామర్ మిస్టేక్స్’ అని, ‘రాసిందే రాస్తున్నాడు. కొత్తగా ఏమీ రాయడం లేదు’ అని అంటూనే ఉన్నారు. అయినా అతని పుస్తకాలను ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు. ‘అవి క్లాసిక్సా?’ అంటే... ‘కానే కాదు... జస్ట్ కనెక్టయ్యారంతే’ అని చేతనే అంటాడు!
రచయితగా చేతన్ విజయానికి కీలక బలం సరళ వచనం. ఎప్పుడూ పుస్తకం ముట్టని మనిషి కూడా అతడి పుస్తకాలు గబగబా చదివేయగలడు. ‘ఇంగ్లిష్ పుస్తకాలు చదవడమంటే నాకు భయం. అవి ఒక పట్టాన అర్థం కావు’ అని దూరంగా పారిపోయే కుర్రాళ్లు కూడా ‘సింపుల్ బుక్ ఇన్ ఇంగ్లిష్’ అంటూ స్వీట్ తిన్నంత ఇష్టంగా చేతన్ పుస్తకాలు చదవగలరు. ఫిక్షన్ మాత్రమే కాదు...‘వాట్ యంగ్ ఇండియా వాంట్స్’ పేరుతో వచ్చిన పుస్తకంతో ‘నేను నాన్‌ఫిక్షన్ రచయితను కూడా సుమా!’ అని నిరూపించాడు చేతన్ భగత్. అందుకే ఆయన చాలా మంది మెచ్చిన రచయిత అయ్యాడు!