పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ సీఐవో శ్రీనివాస్ రావు రావూరి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థిరమైన విధా నాలు, తయారీ సామర్థ్యాలు పెంచుకుంటూ ఉండటం, వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు అంతర్జాతీయంగా చూస్తే భారతదేశం ప్రధాన థీమ్‌గా ఉండబోతోందని పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ సీఐవో శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. ప్రస్తుతం ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్ స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. మరిన్ని వివరాలు..
► రాబోయే దశాబ్ద కాలంలో పెట్టుబడులకు కొత్తగా ఏ థీమ్‌లు ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి?
ప్రధానంగా మూడు థీమ్‌లు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా భారత్‌తో ముడిపడినవే. అంతర్జాతీయ దృష్టికోణంతో చూస్తే భారతదేశమే కొత్త పెట్టుబడి థీమ్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం అయిదో అతి పెద్ద ఎకానమీగా ఎదిగింది. స్థిరమైన రాజకీయ పరిస్థితులు, పటిష్టమైన వినియోగంతో కూడుకున్న వృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో భారత్‌లో పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక రెండో థీమ్ విషయానికొస్తే భారత్ తన తయారీ సామరŠాధ్యలను పెంచుకుంటూ ఉండటం.
అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ పరిస్థితులు, ముడి సరుకులపై అనిశ్చితి, చైనా ప్లస్ వన్ వ్యూహాలు మొదలైన ధోరణులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం మన జీడీపీలో ఎక్కువగా సర్వీసుల వాటా ఉంటుండగా, తదుపరి దశ వృద్ధి తయారీ రంగం నుంచి రాబోతోంది. దేశీయంగా తయారీకి ప్రాధాన్యతనిస్తుండటం, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాలు మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి. ఇక మూడో థీమ్‌ను తీసుకుంటే పెరుగుతున్న తలసరి ఆదాయంతో వినియోగం కూడా పెరుగుతోంది. మరింత మంది ప్రజలు ఆర్థికంగా ఎదిగే కొద్దీ వినియోగ పరిమాణం, నాణ్యత రెండూ పెరగనున్నాయి. ఫైనాన్షియల్స్, డిజిటలైజేషన్‌లోనూ ఇదే ధోరణి కనిపించనుంది.
► ఒడిదుడుకుల మార్కెట్లో రిటైల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి?
ఇన్వెస్టర్లు.. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే మార్కెట్లో టైమింగ్ కన్నా ఎంత కాలం పాటు మార్కెట్లో ఉన్నామనేది ముఖ్యం. స్వల్పకాలిక ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిప్‌ల విధానం సరైనది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి. మార్కెట్లు స్వల్పకాలికంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా, దీర్ఘకాలంలో మాత్రం ఒడిదుడుకులు తక్కువగానే ఉంటాయి. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు ప్రతి రోజూ తమ పోర్ట్‌ఫోలియోను చూసుకోవడం కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోణంలో వ్యవహరించాలి. అలాగే వయస్సుకు తగిన విధంగా అసెట్ కేటాయింపులపై దృష్టి పెట్టాలి. తద్వారా రిటైర్మెంట్ తదితర దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు వీలవుతుంది.
► ద్వితీయార్ధంలో మార్కెట్లకు పొంచి ఉన్న రిస్కులేమిటి?
ఇటీవలి కాలంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత మార్కెట్లు బాగానే రాణించాయి. వేల్యుయేషన్స్ చౌకగా లేకపోయినా చాలా అధికంగా కూడా ఏమీ లేవు. భౌగోళికరాజకీయ అనిశ్చితులు, కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మొదలైన రిస్కులు ఉన్నాయి. అయితే ఇవన్నీ అంతర్జాతీయంగా కూడా ఉన్నవి, తాత్కాలికమైనవే. ఏదేమైనా రిస్కులనేవి ఈక్విటీ పెట్టుబడుల్లో అంతర్భాగమేనని దృష్టిలో ఉంచుకుని, డైవర్సిఫికేషన్ ద్వారా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.
► ప్రస్తుతం ఏయే రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి?
సాధారణంగా అసెట్ క్వాలిటీ, రుణ వృద్ధి మెరుగుపడుతుండటంతో ఫైనాన్షియల్స్ సానుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే దేశీయంగా తయారీకి ప్రోత్సహిస్తున్నందున ఇండస్ట్రియల్స్ కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, యుటిలిటీలు మొదలైనవి అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు.
► తొలిసారిగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సూచనలు?
ఫస్ట్ టైమర్లు దీర్ఘకాలిక పెట్టుబడుల కోణంతో తక్కువ ఒడిదుడుకులు ఉండే, డైవర్సిఫైడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. డైవర్సిఫైడ్/ఫ్లెక్సి క్యాప్, ఈఎల్‌ఎస్‌ఎస్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈ కోవకు చెందుతాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడులకు 3 ఏళ్ల ఆటోమేటిక్ లాకిన్ వ్యవధి ఉంటుంది. ఈక్విటీల్లో రాబడులు అందుకోవాలంటే కనీసం ఆ మాత్రం సమయమైనా ఇన్వెస్ట్ చేయాలి. ఇక వయస్సు, ఇతరత్రా కట్టుకోవాల్సినవి బట్టి ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలు/వయస్సు/వ్యక్తిగత అవసరాల ప్రకారం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్‌డ్/హైబ్రిడ్ ఫండ్స్‌కు కేటాయించడాన్ని పరిశీలించవచ్చు.స్టాక్, సెక్టార్, మార్కెట్లు .. ఏవైనా కావచ్చు వేలం వెర్రి ధోరణులకు పోవద్దు. మార్కెట్లు ఆశ, నిరాశల మధ్య తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఉంటాయి. కాబట్టి రాబడులకు సంబంధించి భారీగా కాకుండా వాస్తవిక స్థాయిలో అంచనాలు పెట్టుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment