
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు అవసరమైన వ్యూహాలు, అంచనాలు తమకున్నాయని, ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
పాలసీ, క్యాలుక్యులేషన్, కమ్యూనికేషన్, ఎగ్జిక్యూషన్ (పీసీసీఈ) అనే చతుర్ముఖ వ్యూహంతో తాము ముందుకెళుతున్నామని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి 72 స్థానాలు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు 25కి మించిరావని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీల డీఎన్‌ఏ ఒక్కటే అన్న రేవంత్, టీఆర్‌ఎస్, కేసీఆర్‌లు గతమని వ్యాఖ్యానించారు.
♦ హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల్లో భాగంగా గురువారం కరీంనగర్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. రేవంత్ ఏమన్నారంటే...!
మాతో పోటీపడే వారు లేరు
పార్టీ సభ్యత్వ నమోదును మేం క్యాజువల్‌గా తీసుకోలేదు. చాలా క్యాలుక్యులేటెడ్‌గా చేశాం. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా 80లక్షల ఓట్లు అవసరమని మా అంచనా. 75–80 లక్షల ఓట్ల వరకు వస్తే గెలుస్తాం. మా పార్టీలో 43 లక్షల మంది సభ్యులుగా చేరారు. రాష్ట్రంలోని 36,594 పోలింగ్ బూత్‌లలో 42వేల మందిని బూత్ ఎన్‌రోలర్స్‌గా చేర్చాం. పార్టీ సానుభూతిపరులు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకునే వారు కాకుండానే 43 లక్షల మంది కాంగ్రెస్ పార్టీలో బాహాటంగానే సభ్యత్వం తీసుకున్నారు.
ఫిరాయింపులే వారికి టాస్క్
రాష్ట్రంలో మాతో పోటీ పడే ప్రధాన రాజకీయ పక్షాలయిన బీఆర్‌ఎస్, బీజేపీల డీఎన్‌ఏ ఒక్కటే. రూ. వేల కోట్లు పెట్టి ఎన్నికలు చేయడంలో, ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ఆ రెండు పార్టీలది ఒకటే వైఖరి. ఎన్నికల హామీలు, మేనిఫెస్టో అమలు ఏ పార్టీకయినా ఒక టాస్క్ లాంటిది.
కానీ ఆరెండు పార్టీలకు ఫిరాయింపులే ప్రధాన టాస్క్ . గతంలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ గురించి మాట్లాడేవాళ్లు కాదు. వాళ్లకి బీజేపీనే పోటీ అన్నట్టు వ్యవహరించే వాళ్లు. కానీ, హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రల తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు మా తోక పట్టుకుని నడిచే పరిస్థితి వచ్చిం ది. యాత్రలో భాగంగా నేను ఎక్కడకు వెళ్తే కేటీఆర్ అక్కడకు వెళ్తున్నారు.
శైవం మీద దాడి కాదా..?
కేసీఆర్‌కు వైష్ణవం మీద నమ్మకం ఉండొచ్చు కానీ శైవంమీద దాడి చేయకూడదు. శ్మశానాలను కూడా వదలకుండా వైష్టవాన్ని రుద్దే ప్రయత్నం చేశాడు. శ్మశానాలంటే శైవ కేంద్రాలు కానీ వాటికి వైకుంఠ ధామా లు అని పేరు పెట్టాడు. కేసీఆర్ హయాంలో ఆచారాల శాశ్వత విధ్వంసం జరుగుతోంది.
అప్పుడేం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు?
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో చేసిన పనులకు, చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా ఇప్పుడు కేసీఆర్, బీఆర్‌ఎస్ వైఖరి ఉంది. గతంలో ద్రోహులు, దుర్మార్గులు, తెలంగాణ వ్యతిరేకులుగా చిత్రీకరించిన వారందరినీ ఇప్పుడు వెంట పెట్టుకుని తిరుగుతున్నారు.
మాకు 38శాతానికి పైగానే ఓట్లు
వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై మా అంచనాలు మాకున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కేవలం 25 స్థానాల్లోపే పరిమితం అవుతుంది. ఆ పార్టీకి 28–32 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. బీజేపీకి 12–13 శాతం ఓట్లు వస్తాయి కానీ, సీట్లు సింగిల్ డిజిట్‌కు మించవు. ఎంఐఎం మళ్లీ 3.5 శాతం ఓట్లతో 7–8 స్థానాలకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 38శాతం కంటే ఎక్కువ ఓట్లతో 72 స్థానాల్లో గెలుస్తుంది.
మొదటి దశ యాత్రలు పూర్తయ్యాకే
కరీంనగర్‌లో కాంగ్రెస్ పని అయిపోయింది. అంతా బీజేపీనే అన్నారు. ఇప్పుడు నేను హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలకు వెళ్తుంటే వేలాది మంది స్వచ్ఛందంగా వస్తున్నారు. మొదటి దశలో భాగంగా మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్ పార్లమెంటు స్థానాల్లో నేను యాత్ర చేస్తా. ఆ తర్వాత ఏం చేయాలన్నది పార్టీ నేతలందరం కూర్చుని నిర్ణయించుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలూ లేవు. అందరం కలిసే ఉన్నాం. నా యాత్రకు అందరూ వస్తారు.’అని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
కేసీఆర్ ముసలోడయ్యాడు
ఇప్పుడు టీఆర్‌ఎస్, కేసీఆర్ అనేది గతం. తాను ముసలోడిని అయ్యానని ఆయనే చెపుతున్నాడు. ఆ పార్టీ మంత్రులు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. అందుకే ఆ పార్టీ విషయంలో టీఆర్‌ఎస్–కేసీఆర్‌లు గతం, బీఆర్‌ఎస్–కేటీఆర్‌లే భవిష్యత్తు. కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ. ఇక, బీజేపీ విషయంలో బండి సంజయ్ ప్రజలతో సంబంధం లేని వ్యక్తి. గత 23 ఏళ్లుగా ప్రజల మధ్యన ఉంటూ, తొమ్మిదేళ్ల కాలంలో టీఆర్‌ఎస్, కేసీఆర్‌లతో కొట్లాడిన రేవంత్‌ను చూడండి. ఈ మూడు కాంబినేషన్లను చూసి ఓట్లు ఎవరికి వేయాలో ప్రజలు నిర్ణయించుకోవాలి.
60 మంది దాకా అభ్యర్థులు ఖరారయ్యారు
అభ్యర్థుల విషయానికి వస్తే మా పార్టీలో 50 శాతానికిపైగా అభ్యర్థులు ఇప్పటికే ఖరారయినట్టే. చాలా చోట్ల పొటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉంది. 60మందికి పైగా నేతల పేర్లు ప్రకటించడమే తరువాయి. వారంతా ఎవరి పని వారు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment