ఏదైనా కొత్త ప్రయత్నం మొదలుపెట్టాలంటే ఓ మంచిరోజు చూడాలి. ‘పుట్టినరోజుకి మించిన మంచి రోజు లేదు’ అంటున్నారు మంజుల. దానికి కారణం కూడా చెప్పారు. ఆ విషయంతో పాటు మరెన్నో విశేషాలు పంచుకున్నారు. నేడు తన బర్త్‌డే సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు మంజుల.
► పుట్టినరోజు విశేషాలు చెబుతారా?
ఎవరికైనా పుట్టినరోజు అనేది చాలా చాలా మంచిరోజు. ఆ రోజు స్టార్స్ అన్నీ అందరికీ అలైన్‌మెంట్ (అమరిక)లో ఉన్నట్లుగా ఉంటాయి. అందుకే ఆ రోజు ఏం చేసినా అది సజావుగా జరుగుతుందని నమ్ముతాను. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా నేను రెండు నిర్ణయాలు తీసుకున్నాను. ఒకటేంటే.. నా యూ ట్యూబ్ చానల్‌లో ‘వెయిట్ లాస్’కి సంబంధించిన సిరీస్ చేయాలనుకుంటున్నాను. ఇంకోటి హెల్త్ ప్రొడెక్ట్స్. మనకొచ్చే ఆరోగ్య సమస్యలన్నీ చాలావరకు మనం వాడే నూనెలతోనే వస్తాయి.
అందుకే ఆర్గానిక్ ఉత్పత్తులతో కొబ్బరినూనె, శనగనూనె, ఆవనూనె, నెయ్యి.. వంటివన్నీ తయారు చేస్తున్నాం. మా ఉత్పత్తులు 100శాతం యుఎస్‌డిఏ సర్టిఫికెట్‌తో మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలు మనకు తెలిసినప్పుడు అందరితోనూ పంచుకోవాలి. అవన్నీ మన దగ్గరే పెట్టుకుంటే లావైపోతాం. ‘శ్రీమంతుడు’లో మహేశ్ చెప్పాడుగా. నేను ఒకప్పుడు చాలా బరువు పెరిగాను. మళ్లీ మామూలుగా ఎలా అయ్యానో కూడా యూ ట్యూబ్‌లో షేర్ చేసుకున్నాను.
► పుట్టినరోజున స్టార్స్ అన్నీ అనుకూలంగా ఉంటాయనే విషయం ఎలా తెలిసింది?
భారతీయ జాతక చక్రం లాగానే ‘కబాలా’ అని ఒకటుంది. చైనీస్, ఫిలిప్పీన్స్ వాళ్లు కబాలాను నమ్ముతారంటారు. ‘సన్ పీరియడ్’ అని ఒకటుంటుందని వాళ్లు చెబుతారు. మనం పుట్టినరోజు నుంచి 52 రోజులపాటు ఆ శక్తి ఉంటుందట. ఆ 52 రోజుల సమయంలో మనం ఏం పట్టుకున్నా బంగారం అవుతుందంటారు. అలాగని మనం కష్టపడకుండా కూర్చుంటే కుదరదు. మన కృషికి స్టార్ పవర్ తోడవుతుంది.
► మీ గత పుట్టినరోజులకు ఇది పాటించి, చేసినవి మీకు కలిసొచ్చాయా?
నిజానికి ఈ విషయం నాకు ఏడాది క్రితమే తెలిసింది. నా గత బర్త్‌డేకి వెబ్‌సైట్, యూట్యూబ్ చానల్, ఆర్గానిక్ ఫుడ్స్.. ఇవన్నీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అవన్నీ ఆచరణలో పెట్టగలిగాను.
► మీ నాన్నగారికోసం ప్రత్యేకమైన డైట్ ఏమైనా చెప్పారా?
నాన్నగారే నాకు చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటారు. మొన్నీ మధ్య నాకు కొంచెం ఎలర్జీ అయితే ఆయనతో చెప్పాను. ‘అమ్మూ.. పసుపునీళ్లతో ఆవిరి పట్టు’ అన్నారు. రోజూ పదకొండు గంటలకు ఫోన్ చేసి, ‘ఈరోజు ఆవిరి పట్టావా, లేదా’ అని అడిగేవారు. నాన్న చెప్పిన చిట్కా వర్కవుట్ అయింది.
► ఇప్పుడు కృష్ణగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్య కొంచెం డల్‌గా కనబడ్డారు..
ఆయన చాలా బాగున్నారు. ఒక్కోసారి ఎవరికైనా డల్‌గా ఉంటుంది. అది సహజం. అయితే ఇదివరకటిలా నాన్న స్పీడ్‌గా నడవటం లేదు. అది అనారోగ్యం వల్ల కాదు. జాగ్రత్తగా ఉంటున్నారు.. అంతే. మిగతాదంతా మామూలే. రోజూ వాక్ చేస్తారు, యోగా చేస్తారు. నాన్న ఫుల్ ఎనర్జీగా ఉన్నారు.
► విజయనిర్మలగారు చనిపోయాక ఆయన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఆ బాధ నుంచి బయటపడగలిగారా?
నాన్న కచ్చితంగా ఆవిడ్ని మిస్సవుతున్నారు. వాళ్లిద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్. కానీ ఆవిడ పక్కన లేకపోయినా నాన్నగారు ఆ బాధ నుంచి బయటకు రాగలిగారు. బేసిక్‌గా నాన్న కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ.
► నిజానికి విజయనిర్మలగారు దూరం అయ్యాక కృష్ణగారు మీలో ఎవరి దగ్గరికన్నా వస్తారేమో అనుకున్నాం?
ఎప్పటినుంచో ఉంటున్న ఇంట్లో ఆయనకంటూ ఒక సెటప్ తయారు చేసుకున్నారు. ఆ ఇంట్లో అందరూ ఉన్నారు. మా ఇంటికి, నాన్నగారింటికి దూరం రెండు నిమిషాలే. ఓ రకంగా చెప్పాలంటే మేం కలిసి ఉంటున్నట్లే. అలాగే రోజూ మనవళ్లు, మనవరాళ్లను కలుస్తారు.
మహేశ్ అన్నట్లు ఇవ్వకపోతే లావైపోతాం
Published Sun, Nov 8 2020 1:17 AM | Last Updated on Sun, Nov 8 2020 9:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment