సీఎం వైఎస్ జగన్‌పై పదునైన వస్తువుతో బలంగా దాడి
అత్యంత వేగంగా వచ్చి చర్మాన్ని ఛిద్రం చేసింది
కణతపై తగిలి ఉంటే పెను ప్రమాదం.. అక్కడి ఎముక విరిగి మెదడుకు గుచ్చుకుంటే ప్రాణాపాయమే
అక్కడ ఉండే పెద్ద రక్తనాళం తెగితే భారీగా రక్తస్రావం
కుడి చేయి చచ్చుబడి.. మాట పడిపోయే ప్రమాదం
మెదడులోపల రక్తస్రావం అయ్యుంటే ప్రాణాలకే ముప్పు
తల వెనుక భాగంలో తగిలినా ప్రాణాలకు ప్రమాదం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేవీఆర్ శాస్త్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి ప్రాణాలు తీసేంత తీవ్రమైనదేనని ప్రముఖ న్యూరో సర్జన్ డా. కేవీఆర్ శాస్త్రి అంటున్నారు. అదృష్టవశాత్తు ఎడమ కనుబొమ్మ పై భాగంలో తగలడంతో తీవ్రగాయంతో సరిపోయిందని, అదే ఎడమ కణతపై లేదా తల వెనుక భాగంలో తగిలితే కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోవడంతోపాటు ప్రాణాపాయం సంభవించేందుకు కూడా ఎక్కువగా అవకాశాలున్నాయని ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ – న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్– బెంగళూరు)లో న్యూరాలజీ విభాగాధిపతిగా చేసిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం తీవ్రతను పలు కోణాల్లో విశ్లేషించారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పదునైన ఆయుధంతో దాడి
సీఎం వైఎస్ జగన్‌పై పదునైన రాయి లేదా ఇతర పదునైన వస్తువుతో బలంగా దాడి చేశారు. ఎడమ కనుబొమ్మ పై భాగంలో బలంగా తగలడంతో చర్మం ఛిద్రమై తీవ్ర గాయమైంది. దాంతోనే కుట్లు వేయాల్సి వచ్చింది. ఆయన కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ప్రస్తుతం ఆయన ఒకట్రెండు రోజుల విశ్రాంతి తరువాత రోజువారి పనుల్లో నిమగ్నమైనప్పటికీ, వైద్యులు తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలి.
కణతపై తగిలి ఉంటే..
ఆ పదునైన రాయి లేదా వస్తువు కాస్త పక్కన ఎడమ కణతపై తగిలి ఉంటే పెనుముప్పు సంభవించేది. ఆ భాగంలో ఎముక సున్నితంగా ఉంటుంది. పదునైన రాయి బలంగా తగిలితే ఆ ఎముక విరిగి లోపలే ఉండిపోయేది. ఆ ఎముక లోపల మెదడు భాగానికి గుచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఇక ఎడమ కణత భాగంలోనే పెద్ద రక్తనాళం ఉంటుంది. ఆ నాళం తెగి భారీగా రక్తస్రావం అయ్యేది. కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసి ఉండేంది. మెదడులోనే రక్తస్రావమైనా, మెదడుకు రక్త సరఫరాకు ఇబ్బంది కలిగి ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తల వెనుకభాగంలో తగిలితే..
ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుడివైపు ఉన్న ప్రజలను చూసి అభివాదం చేస్తూ ఉండటంతో ఎడమ వైపు నుంచి బలమైన రాయి లేదా మరో పదునైన వస్తువుతో దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వెనక్కి తిరిగి ఉన్నారు. ఆ వస్తువు తల వెనుక కింద భాగంలో తగిలి ఉంటే మెదడుకు తీవ్ర గాయమయ్యేది. మెదడులో రక్తస్రావం అయి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. అదృష్టవశాత్తూ అది ఎడమ కనుబొమ్మ పై భాగంలో తగలడంతో తీవ్ర గాయంతో సరిపోయింది. అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైద్యులు కొన్నిరోజులపాటు పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది.
న్యూరో సర్జన్ డా. కేవీఆర్ శాస్త్రి
దోషుల్ని శిక్షించాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందడం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి పనులు చేస్తున్నాయి. ఆయన్ని హత్యచేయాలనే ప్రణాళిక ప్రకారం దాడిచేశారు. ఇది ప్రతిపక్షాల కుట్రే. దీనివెనుక ఎంతటి పెద్దవారున్నా పూర్తిస్థాయిలో విచారించి దోషులను కఠినంగా శిక్షించాలి. – చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
చంద్రబాబు చెప్పడంతోనే..
జగన్‌మోహన్‌రెడ్డిని రాళ్లతో కొట్టమని శనివారం మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు తన ప్రసంగంలో సూచించారు. ఆ వీడియోలు ఉన్నాయి. జగన్‌ను రాళ్లతో కొట్టండి, అతడు దుర్మార్గుడు, దున్నపోతు, సైకో రాళ్లతో దాడి చేయండి అని.. చంద్రబాబు చెబితే ఈ దుర్మార్గులు, పచ్చకుక్కలు, తెలుగుతమ్ముళ్లు, పిచ్చి పరాకాష్టకు చేరిన కులగజ్జి పట్టిన కుక్కలు సీఎం జగన్‌ను చంపడానికి కుట్ర పన్నారు. చంద్రబాబునాయుడు ప్రణాళికతో జగన్‌మోహన్‌రెడ్డి మీద గత ఎన్నికల ముందు, ఈ ఎన్నికల ముందు ఈ దారుణం చేయించారు. తక్షణమే ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవాలి.
– కొడాలి నాని, ఎమ్మెల్యే
ఉసిగొల్పుతున్న చంద్రబాబు
ఇటీవల ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దురాగతాలకు ఉసిగొల్పుతున్నారు. చంద్రబాబు ప్రసంగాల వీడియో క్లిప్‌లు పరిశీలిస్తే వాస్తవం ఇట్టే అర్థమవుతుంది. జగన్‌పై హత్యాయత్నం ప్రతిపక్షాల కుట్రలో భాగమే. జగన్ ఇటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు. చంద్రబాబు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలి.
– కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే
జగన్‌ను చంపాలనే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హత్యచేయాలనే ప్రయత్నించారు. రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి ముఖ్యమంత్రికి ఏమీకాలేదు. కుల ఆధిపత్యంతో, అసూయతో ఇలా చేశారు. ఈ కుట్రను ప్రధాని నరేంద్రమోదీ వెలికి తీయించాలి. పొత్తులతోను, డబ్బుతోను అధికారం చేజిక్కించుకోవాలనుకున్న చంద్రబాబు వ్యూహం ఫలించదని తెలియడంతో ఈ కుట్ర చేశారు.
– రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే
చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ కుట్ర
ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనుక చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ కుట్ర ఉంది. వారిద్దరి దుర్మార్గపు ఆలోచనతోనే సీఎంపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్‌పై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ దారుణానికి పాల్పడ్డారు.
– సింహాద్రి రమేష్‌బాబు, ఎమ్మెల్యే
నైతికంగా దెబ్బతీయాలని..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజాభిమానం అధికంగా ఉండడం గమనించి, ఆయన్ని నైతికంగా దెబ్బతీయాలనే హత్యాయత్నం చేశారు. వైఎస్సార్సీపీకి గ్రాఫ్ పెరుగుతోందని గ్రహించి ఓర్వలేక ఈ దారుణానికి తెగబడ్డారు. గతంలో విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్య వంటివి చూస్తే.. ఎదుటి వ్యక్తులను కుట్రలతో దెబ్బతీయడం టీడీపీకి అలవాటేనని అర్థమవుతోంది.
– జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజనం పడుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి దుర్ఘటలకు పాల్పడడం దారుణం. దాడిచేసిన వారిని గుర్తించి, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
ప్రజానాయకుడిపై హత్యాయత్నం ప్రజాస్వామానికి గొడ్డలిపెట్టు. పేదల పెన్నిధి, విద్య, వైద్యం, సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం దుర్మార్గం. గాయపడిన జగన్‌కు ప్రథమ చికిత్స చేశా. ఆయనలో ఎలాంటి భయం లేదు.
– డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి
కఠిన చర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రిపై హత్యాయత్నం హేయం. ఈ సంఘటనపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
ఇంటెలిజెన్స్‌పై చర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేయడం తప్పు. దీన్లో పోలీస్, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇంటెలిజెన్స్ మీద చర్యలు తీసుకోవాలి.
– వంగవీటి రాధా, మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment