సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అప్పటికప్పుడు వినియోగించుకోవాల్సిందే. భారీ పరిమాణంలో విద్యుత్‌ను నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవడానికి అవసరమైన సాంకేతికత, సదుపాయాలు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేవు. ఇందుకు భిన్నంగా దేశంలోనే తొలిసారిగా 8 మెగావాట్ల భారీ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం(బెస్)ను దక్షిణ అండమాన్ దీవిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీ) ఏర్పాటు చేసి విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేసింది.
ప్రారంభ దశలో ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించి విజయవంతంగా స్టోరేజీ సిస్టంను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, దానికి అనుసంధానంగా 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. 101.94 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.136.61 కోట్లను ఖర్చు చేసినట్టు నైవేలీ సంస్థ సీఎండీ మోటుపల్లి ప్రసన్న కుమార్ తెలిపారు.
సాధారణంగా యూనిట్ సౌర విద్యుదుత్పత్తికి రూ.2.60 నుంచి రూ.2.8 పైసల వ్యయం అవుతుండగా, బ్యాటరీ సిస్టంలో నిల్వ చేసేందుకు అవుతున్న వ్యయాన్ని కలుపుకుని.. మొత్తంగా యూనిట్‌కు రూ.7.41 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన ఆయన గత జనవరి 12న నైవేలీ సంస్థ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు.
‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దేశంలో ఏర్పాటైన తొలి బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నైవేలీ సంస్థ తరఫున పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి..
అండమాన్‌లో మరో బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్..
దక్షిణ అండమాన్ విద్యుత్ అవసరాలు 35 మెగావాట్లు. పూర్తిగా డీజిల్ జనరేటర్లతోనే ఆధారపడేవారు. పెద్ద ఎత్తున కాలుష్యం, డీజిల్ వ్యయం ఉండేది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంతో ఈ సమస్య కొంత మేరకు తగ్గింది. అండమాన్ విజ్ఞప్తి మేరకు రెండో విడత కింద మరో 20 మెగావాట‍్ల సౌర విద్యుత్ ప్లాంట్, 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. రెండో దశ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేసే విద్యుత్ ధర ఇంకా తక్కువగా ఉండనుంది.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సాంకేతిక విశేషాలు..
- లిథియం అయాన్ బ్యాటరీల మోడ్యూల్స్ - 1260
- 0.96 ఎంవీఏ సామర్థ్యం గల 9 బెస్ కంటైనర్లు
- 0.96 ఎంవీఏల సామర్థ్యం గల బై-డైరెక‌్షనల్ పవర్ కండిషనింగ్ సిస్టంలు- 18
- యూనిట్ విద్యుత్ ధర రూ.7.4
ఏపీ, తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం..
వ్యాపార విస్తరణలో భాగంగా పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, లిగ్నైట్ నుంచి మిథనాల్, గ్యాస్, డీజిల్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ప్రవేశించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. తెలంగాణ, ఏపీతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జలాశయాలపై పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాల రంగ పరిశ్రమల కోసం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ క్లస్టర్‌లో నైవేలీ ఆధ్వర్యంలో ఎలక్రి‍్టక్ వాహనాల పరిశ్రమ స్థాపనకు పరిశీలిస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల ఇంధన శాఖలతో చర్చలు సైతం జరిపాం. రెండు రాష్ట్రాల్లో కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం.
తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్..
తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకోనున్నాం. ఆ వెంటనే సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే తెలంగాణకు 311 మెగావాట్లు తెలంగాణకు, 230 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం.
మా విద్యుత్ అత్యంత చౌక..
మా లిగ్నైట్ గనుల దగ్గరే విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాం. లిగ్నైట్ రవాణా ఖర్చులుండవు. దీంతో దేశంలోనే అత్యంత చౌక విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ధరలపరంగా మెరిట్ ఆర్డర్‌లో టాప్ పోజిషన్‌లో ఉన్నాం.
రూ.24000 కోట్ల పెట్టుబడులు..
దేశంలోనే 1000 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని వృద్ధి చేసుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ మాదే. 2030 నాటికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 6000 మెగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు రూ.24,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాం. పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల స్థాపన కోసం నైవేలీ ఆధ్వర్యంలో ఎన్‌ఐఆర్‌ఎల్‌ను నెలకోల్పాం. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment