NLC
-
తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు నైవేలీ సిద్ధం.. చైర్మన్ మోటుపల్లి ప్రసన్న కుమార్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అప్పటికప్పుడు వినియోగించుకోవాల్సిందే. భారీ పరిమాణంలో విద్యుత్‌ను నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవడానికి అవసరమైన సాంకేతికత, సదుపాయాలు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేవు. ఇందుకు భిన్నంగా దేశంలోనే తొలిసారిగా 8 మెగావాట్ల భారీ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం(బెస్)ను దక్షిణ అండమాన్ దీవిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ) ఏర్పాటు చేసి విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. ప్రారంభ దశలో ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించి విజయవంతంగా స్టోరేజీ సిస్టంను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, దానికి అనుసంధానంగా 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. 101.94 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.136.61 కోట్లను ఖర్చు చేసినట్టు నైవేలీ సంస్థ సీఎండీ మోటుపల్లి ప్రసన్న కుమార్ తెలిపారు. సాధారణంగా యూనిట్ సౌర విద్యుదుత్పత్తికి రూ.2.60 నుంచి రూ.2.8 పైసల వ్యయం అవుతుండగా, బ్యాటరీ సిస్టంలో నిల్వ చేసేందుకు అవుతున్న వ్యయాన్ని కలుపుకుని.. మొత్తంగా యూనిట్‌కు రూ.7.41 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన ఆయన గత జనవరి 12న నైవేలీ సంస్థ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దేశంలో ఏర్పాటైన తొలి బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నైవేలీ సంస్థ తరఫున పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. అండమాన్‌లో మరో బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్.. దక్షిణ అండమాన్ విద్యుత్ అవసరాలు 35 మెగావాట్లు. పూర్తిగా డీజిల్ జనరేటర్లతోనే ఆధారపడేవారు. పెద్ద ఎత్తున కాలుష్యం, డీజిల్ వ్యయం ఉండేది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంతో ఈ సమస్య కొంత మేరకు తగ్గింది. అండమాన్ విజ్ఞప్తి మేరకు రెండో విడత కింద మరో 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. రెండో దశ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేసే విద్యుత్ ధర ఇంకా తక్కువగా ఉండనుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సాంకేతిక విశేషాలు.. - లిథియం అయాన్ బ్యాటరీల మోడ్యూల్స్ - 1260 - 0.96 ఎంవీఏ సామర్థ్యం గల 9 బెస్ కంటైనర్లు - 0.96 ఎంవీఏల సామర్థ్యం గల బై-డైరెక్షనల్ పవర్ కండిషనింగ్ సిస్టంలు- 18 - యూనిట్ విద్యుత్ ధర రూ.7.4 ఏపీ, తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం.. వ్యాపార విస్తరణలో భాగంగా పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, లిగ్నైట్ నుంచి మిథనాల్, గ్యాస్, డీజిల్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ప్రవేశించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. తెలంగాణ, ఏపీతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జలాశయాలపై పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాల రంగ పరిశ్రమల కోసం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ క్లస్టర్లో నైవేలీ ఆధ్వర్యంలో ఎలక్రి్టక్ వాహనాల పరిశ్రమ స్థాపనకు పరిశీలిస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల ఇంధన శాఖలతో చర్చలు సైతం జరిపాం. రెండు రాష్ట్రాల్లో కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్.. తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకోనున్నాం. ఆ వెంటనే సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే తెలంగాణకు 311 మెగావాట్లు తెలంగాణకు, 230 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. మా విద్యుత్ అత్యంత చౌక.. మా లిగ్నైట్ గనుల దగ్గరే విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాం. లిగ్నైట్ రవాణా ఖర్చులుండవు. దీంతో దేశంలోనే అత్యంత చౌక విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ధరలపరంగా మెరిట్ ఆర్డర్లో టాప్ పోజిషన్లో ఉన్నాం. రూ.24000 కోట్ల పెట్టుబడులు.. దేశంలోనే 1000 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని వృద్ధి చేసుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ మాదే. 2030 నాటికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 6000 మెగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు రూ.24,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాం. పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల స్థాపన కోసం నైవేలీ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్ఎల్ను నెలకోల్పాం. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలిస్తాం. -
నైవేలీ విద్యుత్ ప్లాంట్‌లో పేలిన బాయిలర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద స్థలి నుంచి గాయపడిన పది మందిని బయటకు తీసుకురాగా తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. లాక్డౌన్ కారణంగా కొన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సడలింపుతో తిరిగి ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేశారు. -
నేటి నుంచి ఆమరణ దీక్షలు
చెన్నై, సాక్షి ప్రతినిధి:గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్సీ) కార్మికులు శుక్రవారం నుంచి ఆమరణదీక్షలు ప్రారంభించనున్నారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించకపోగా తొళిలార్ మున్నేట్ర సంఘం నేత తిరుమావళవన్‌ను బుధవారం ఉద్యోగం నుంచి తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఎల్సీలో 12 వేల మంది శాశ్వత ప్రాతిపదిక కార్మికులు, 13 వేల మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. శాశ్వత కార్మికులకు 2012 నుంచి సవరించిన వేత నం అమలులో ఎన్ఎల్సీ యాజమాన్యం నాన్చివేత ధోరణిని అవలంభిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారంపై గత ఏడాది ఒకసారి సమ్మెకు పూనుకున్న ఉద్యోగులు, కార్మికులు అప్పట్లో ఇచ్చిన హామీతో విరమించారు. అయితే హామీ ఇచ్చి రెండేళ్లు దాటినా యాజమాన్యం నెరవేర్చక పోవడంతో గతనెల 20వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. కొత్త వేతనాలను అమలుచేయాలని, ఒప్పంద కార్మికులను పర్మనెంటు చేయాలని తదితర ఐదు డిమాండ్లపై సాగుతున్న సమ్మె గురువారానికి 25వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాలతో ఎన్ఎల్సీ యాజమాన్యం పలు విడతల జరిపిన చర్చలు విఫలమైనాయి. ఇదిలా ఉండగా, కార్మికుల సమ్మెకు గట్టి అండగా నిలిచారనే కక్షతో తొళిలార్ మున్నేట్ర సంఘం నేత తిరుమావళవన్‌ను ఉద్యోగం నుంచి బుధవారం తొలగించారు. అతని తొలగింపు ఉత్తర్వులను గోడలపై అతికించడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. సుమారు 10 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సైతం విధులను బహిష్కరించి శాశ్వత కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి హడావిడిగా సమావేశం నిర్వహించారు. ఎన్ఎల్సీ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నెల్లై మెయిన్ బజార్ కామరాజర్ మైదానంలో ఆమరణదీక్షలు ప్రారంభించాలని తీర్మానించారు. అంతేగాక 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సైతం బహిష్కరించాలని నిర్ణయించారు. కార్మికుల ఆమరణదీక్ష నిర్ణయంతో ఎన్ఎల్సీ పరిసరాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. నెల్లై డీఎస్పీ నేతృత్వంలో సుమారు 500 మంది రేయింబవళ్లు కాపలాపెట్టారు. 975 మెగావాట్ల లోటు: సమ్మె తీవ్రత కారణంగా ఎన్ఎల్సీ విద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోతోంది. ఎన్ ఎల్సీ మొత్తం సామర్థ్యం 2990 మెగావాట్లు కాగా బుధవారం 2068 మెగావాట్లు ఉత్పత్తి అయింది. గురువారం 2015 మెగావాట్లకు పడిపోయింది. గతనెల 28వ తేదీ నాటికి 831 మెగావాట్ల ఉత్పత్తి లోటు ఉండగా, గురువారం నాటికి లోటు 975 మెగావాట్లకు పెరిగింది. -
జోక్యం చేసుకోండి
కేంద్రం నిర్ణయం కోసం వేచి చూడడం కన్నా, తమరు జోక్యం చేసుకోరూ అంటూ ఎన్ఎల్సీ వ్యవహారంలో సీఎం జయలలితకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి హితవు పలికారు. ఎన్ఎల్సీలో నిరసనలు మిన్నంటాయి. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మిక సంఘాలు రిలే దీక్షల బాట పట్టారు. సాక్షి, చెన్నై :వేతన పెంపు, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, విధుల్లో మరణించే ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కార్మిక లోకం సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. ఈ సమ్మె చేపట్టి ఐదు రోజులు అవుతోంది. యాజమాన్యం బుజ్జగింపు ప్రయత్నాలు బెడిసి కొట్టడం, చర్చలు విఫలం కావడం వెరసి కార్మికులు తమ నిరసనలు ఉధృతం చేసి ఉన్నారు. ఇప్పటికే ఎన్ఎల్సీలో కొంత మేరకు విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టి ఉండటంతో ఈ ప్రభావం రాష్ట్రం మీద పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఎక్కడ అనధికారి కోతలు అమల్లోకి వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ పరిస్థితుల్లో తమ యాజమాన్యం నడ్డి విరిచే విధంగా కార్మిక సంఘాలు నిరసనల్ని ఉధృతం చేశారు. అధికారిక తోముసా, అన్నా కార్మిక సంఘాలు ఓ వైపు పోరాటాన్ని సాగిస్తుంటే, మరో వైపు గుర్తింపు లేని సీఐటీయూ, పీఎంకే, ఐసీయూ, బీఎంఎస్ తదితర పది కార్మిక సంఘాలు వారికి మద్దతుగా నిరసలకు దిగారు. శుక్రవారం నుంచి క్యూ వంతెన వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఈ మార్గం గుండానే ఎన్ఎల్సీలోకి పర్మినెంట్ ఉద్యోగులు, అధికారులు సైతం వెళ్లాల్సి ఉంది. దీంతో ఆ మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసల్ని ఉధృతం చేసిన కార్మిక సంఘాలు, తమకు మద్దతుగా సమ్మెలోకి రావాలని పర్మినెంట్ ఉద్యోగులు, ఇంజనీర్ల సంఘానికి పిలుపు నిచ్చే పనిలో పడ్డారు. నిరసనలో భాగంగా ఎ క్కడ ఇంజనీర్లు, ఉద్యోగుల్ని కార్మికులు అడ్డుకుంటారోనన్న ఉత్కంఠ బయలు దేరడంతో ఎన్ఎల్సీ పరిసరాల్లో భద్రతా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జోక్యం చేసుకోరూ : కార్మికులు నిరసనల్ని ఉధృతం చేసి ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఎదురయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జయలలిత లేఖాస్త్రం సంధించారు. అయితే, కేంద్రం నిర్ణయం కోసం వేచి చూడటాన్ని మానుకుని, సొంత నిర్ణయం తీసుకోవాలంటూ సీఎం జయలలితకు డిఎంకే అధినేత ఎం కరుణానిధి సూచించారు. కార్మికులు సమ్మెను ఉధృతం చేసిన సమయంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూడటం మంచి పద్ధతి కాదన్నారు. కేవలం లేఖాస్త్రం సంధించి , సమస్యను పక్కన పడేయడం కన్నా, స్వతహాగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గతంలో ఇదే విధంగా ఎన్ఎల్సీలో సమస్య బయలు దేరినప్పుడు , తాను సీఎంగా తక్షణం స్పందించినట్టు గుర్తు చేశారు. యాజమాన్యం, కార్మిక సంఘాల్ని, కేంద్ర హోం శాఖ అధికారుల్ని పిలిపించి తన సమక్షంలో చర్చలు జరిపి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించడం జరిగిందన్నారు. అయితే, ఆ విధంగా స్పందించడం మానుకుని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలంటూ లేఖాస్త్రం సంధించడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇకనైనా తమరు జోక్యం చేసుకోరూ... గతంలో తాను తీసుకున్నట్టుగానే నిర్ణయం తీసుకుని, సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని సూచించారు.