జోక్యం చేసుకోండి | DMK Wants TN Government to Hold Talks to End NLC Stir | Sakshi
Sakshi News home page

జోక్యం చేసుకోండి

Published Sat, Jul 25 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

DMK Wants TN Government to Hold Talks to End NLC Stir

కేంద్రం నిర్ణయం కోసం వేచి చూడడం కన్నా, తమరు జోక్యం చేసుకోరూ అంటూ ఎన్‌ఎల్‌సీ వ్యవహారంలో సీఎం జయలలితకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి హితవు పలికారు. ఎన్‌ఎల్‌సీలో నిరసనలు మిన్నంటాయి. అక్కడ
 ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మిక సంఘాలు రిలే దీక్షల బాట పట్టారు.
 
 సాక్షి, చెన్నై :వేతన పెంపు, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, విధుల్లో మరణించే ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కార్మిక లోకం సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. ఈ సమ్మె చేపట్టి ఐదు రోజులు అవుతోంది. యాజమాన్యం బుజ్జగింపు ప్రయత్నాలు బెడిసి కొట్టడం, చర్చలు విఫలం కావడం వెరసి కార్మికులు తమ నిరసనలు ఉధృతం చేసి ఉన్నారు.  ఇప్పటికే ఎన్‌ఎల్‌సీలో కొంత మేరకు విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టి ఉండటంతో ఈ ప్రభావం రాష్ట్రం మీద పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఎక్కడ అనధికారి కోతలు అమల్లోకి వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ పరిస్థితుల్లో తమ యాజమాన్యం నడ్డి విరిచే విధంగా కార్మిక సంఘాలు నిరసనల్ని ఉధృతం చేశారు.
 
 అధికారిక తోముసా, అన్నా కార్మిక సంఘాలు ఓ వైపు పోరాటాన్ని సాగిస్తుంటే, మరో వైపు గుర్తింపు లేని సీఐటీయూ, పీఎంకే, ఐసీయూ, బీఎంఎస్ తదితర పది కార్మిక సంఘాలు వారికి మద్దతుగా నిరసలకు దిగారు. శుక్రవారం నుంచి క్యూ వంతెన వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఈ మార్గం గుండానే ఎన్‌ఎల్‌సీలోకి పర్మినెంట్ ఉద్యోగులు, అధికారులు సైతం వెళ్లాల్సి ఉంది. దీంతో ఆ మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసల్ని ఉధృతం చేసిన కార్మిక సంఘాలు, తమకు మద్దతుగా సమ్మెలోకి రావాలని పర్మినెంట్ ఉద్యోగులు, ఇంజనీర్ల సంఘానికి పిలుపు నిచ్చే పనిలో పడ్డారు. నిరసనలో భాగంగా ఎ క్కడ ఇంజనీర్లు, ఉద్యోగుల్ని కార్మికులు అడ్డుకుంటారోనన్న ఉత్కంఠ బయలు దేరడంతో ఎన్‌ఎల్‌సీ పరిసరాల్లో భద్రతా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
 
 జోక్యం చేసుకోరూ : కార్మికులు నిరసనల్ని ఉధృతం చేసి ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఎదురయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జయలలిత లేఖాస్త్రం సంధించారు. అయితే, కేంద్రం నిర్ణయం కోసం వేచి చూడటాన్ని మానుకుని, సొంత నిర్ణయం తీసుకోవాలంటూ సీఎం జయలలితకు డిఎంకే అధినేత ఎం కరుణానిధి సూచించారు. కార్మికులు సమ్మెను ఉధృతం చేసిన సమయంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూడటం మంచి పద్ధతి కాదన్నారు. కేవలం లేఖాస్త్రం సంధించి , సమస్యను పక్కన పడేయడం కన్నా, స్వతహాగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గతంలో ఇదే విధంగా ఎన్‌ఎల్‌సీలో సమస్య బయలు దేరినప్పుడు , తాను సీఎంగా తక్షణం స్పందించినట్టు గుర్తు చేశారు. యాజమాన్యం, కార్మిక సంఘాల్ని, కేంద్ర హోం శాఖ అధికారుల్ని  పిలిపించి తన సమక్షంలో చర్చలు జరిపి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించడం జరిగిందన్నారు. అయితే, ఆ విధంగా స్పందించడం మానుకుని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలంటూ లేఖాస్త్రం సంధించడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇకనైనా తమరు జోక్యం చేసుకోరూ... గతంలో తాను తీసుకున్నట్టుగానే నిర్ణయం తీసుకుని, సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement