కాట్రావత్‌ శాంతకుమారి: తండా నుంచి థాయ్‌లాండ్‌కు | Sakshi Interview With Asian Volleyball Player Katravat Shantakumari | Sakshi
Sakshi News home page

కాట్రావత్‌ శాంతకుమారి: తండా నుంచి థాయ్‌లాండ్‌కు

Published Sat, Jun 18 2022 12:34 AM | Last Updated on Sat, Jun 18 2022 12:34 AM

Sakshi Interview With Asian Volleyball Player Katravat Shantakumari

నాలుగోసారీ ఆడపిల్ల పుట్టింది. భారమవుతుందేమో అమ్మాలనుకుంటే అయిదొందలకు బేరమూ కుదిరింది. మళ్లీ వద్దనుకున్నారు అమ్మానాన్న. ఎంత కష్టమైనా తామే సాకాలనుకున్నారు.
ఐదో క్లాసు నుంచే కూలిపనులకెళ్లింది. మిల్లులో కూలిపనుల కోసం   సంచుల్లో తవుడు ఎత్తిన ఆ చేయి... ఇప్పుడు అంతర్జాతీయ ఆటస్థలాల్లో వాలీబాల్‌ ఎత్తుతోంది. బంతిని బాదినంత తేలిగ్గా
బీదరికాన్నీ బాదడానికి ప్రయత్నిస్తోంది. నెట్‌ అవతలికి బంతిని పంపినట్టుగా తన నైపుణ్యాలను దేశం బయటా చూపుతోంది. ఎక్కడో గిరిజనతండాల్లో పుట్టిన ఆ యువతి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపడానికి ఇప్పుడు మరోసారి సమాయత్తమవుతోంది. ఆల్‌ ద బెస్ట్‌... శాంతకుమారి.


ఉమ్మడి పాలమూరులోని ప్రస్తుత వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పుతండాకు చెందిన క్రీడా ఆణిముత్యం కాట్రావత్‌ శాంతకుమారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత వాలీబాల్‌ క్రీడలో మహిళల కేటగిరిలో జాతీయ జూనియర్‌ జట్టుకు ఎంపికైన మొట్టమొదటి బాలిక ఆమె. ఈ నెల ఆరు నుంచి 13వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరిగిన 14వ ఏషియన్‌ వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
 
ఒక్కపూట తిండికీ కష్టమే..
మా అమ్మ పేరు భామిని, నాన్న అమృనాయక్, మేము మొత్తం ఆరుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు అయ్యాయి. మూడో అక్క మంజుల ఇంటర్‌ సెకండియర్, తమ్ముళ్లు కుమార్‌ తొమ్మిది, రాహుల్‌ ఏడో తరగతి చదువుతున్నారు. మా అమ్మానాన్న అందరినీ సమానంగా చూస్తారు. పెద్ద కుటుంబం కావడం.. అమ్మానాన్నలకు ఉపాధి దొరక్కపోవడంతో ఒక్క పూట తిండి కూడా కష్టమయ్యేది. మేమందరం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోనే చదువుతున్నాం. కరోనాకు ముందు వరకు అమ్మానాన్న ముంబాయికి వలస వెళ్లారు. కరోనా కాలంలో తిరిగి వచ్చాక ఉపాధి దొరకడం కష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌ షేక్‌పేట (నాలా)లో మేస్త్రీ వద్ద పనిచేస్తున్నారు. వారు కష్టం చేసి సంపాదించిన దాంతోపాటు అప్పులు చేసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు.  
 
మిల్లులో కూలి పనులకు వెళ్లా..

నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాల ప్రైమరీ స్కూల్‌లో చదువుకున్నా. ఐదు నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్‌ కాలేజీ (బాలికలు)లో చదువుతున్నా. నేను ఐదో తరగతి నుంచి మా అక్కలతో కలిసి సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేదాన్ని. రైస్‌మిల్లులో సంచులు కుట్టడం, తవుడు ఎత్తడం వంటి పనులు చేశాను.

పీడీ మేడం చొరవతో ...
నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఎవరైనా ఆటలాడుతుంటే అక్కడే ఉండిపోయేదాన్ని. గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత మా సీనియర్స్‌ ఖో ఖో అడుతుంటే.. ఒక్కొక్కరి ఆటను దగ్గరుండి గమనించేదాన్ని. ఒకరోజు మా పీడీ మేడమ్‌ అరుణారెడ్డి వచ్చి ‘ఏం చూస్తావ్‌.. నీవు ఆడవా’ అని అడిగారు. ఆ తర్వాత నుంచి మేడమ్‌తో మంచి చనువు ఏర్పడింది. మెల్లమెల్లగా నా దృష్టిని వాలీబాల్‌ వైపు మళ్లించారామె. ఉదయం ఐదు నుంచి ప్రాక్టీస్‌ మొదలుపెట్టేవారు.

ఓటమితో మొదలు..
2016లో మండల స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారించా. మహబూబ్‌నగర్‌లో అండర్‌ 14 విభాగంలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ ఎంపికల్లో జిల్లా జట్టుకు ఎంపికయ్యా. ఆ తర్వాత భద్రాచలంలో అసోసియేషన్‌ మీట్‌ జరిగింది. ఇందులో సెలెక్ట్‌ కాలేకపోయా. నాలో నిరుత్సాహం అలుముకుంది. అక్కడి నుంచే మేడంకి ఫోన్‌ చేశా. ఇక నేను వాలీబాల్‌ ఆడనని! కానీ.. ఆమె నాకు ఎక్కడలేని ధైర్యాన్ని నూరిపోశారు. ఆమె సూచనతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. అప్పటి నుంచి నేను మానసికంగా బలంగా తయారయ్యా. మెళకువలు నేర్చుకున్నా.

అనంతరం సబ్‌ జూనియర్స్‌ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచా. చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీల్లో సెమీఫైనల్‌ వరకు వెళ్లాం. అలా టెన్నిస్, వాలీబాల్, బీచ్‌ వాలీబాల్‌తోపాటు రగ్బీ క్రీడలో సైతం రాణించా. అయితే కోవిడ్‌ విజృంభణతో రెండేళ్లుగా ఆటల పోటీలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మా మేడమ్‌ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై ఆన్‌లైన్‌ ద్వారా క్లాస్‌ తీసుకునే వారు. వాలీబాల్‌ ఆట నుంచి నా దృష్టి మరలకుండా శిక్షణ ఇచ్చేవారు. పాస్‌పోర్టు ఇతరత్రా ఖర్చులు కూడా ఆమే భరించారు. మా పీడీ మేడమ్‌ చొరవ, ప్రిన్సిపల్‌ కృష్ణమూర్తి, ఉపాధ్యాయుల ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. నేను వారిని ఎన్నటికీ మరిచిపోలేను.  

ఏషియన్‌ పోటీలకు ప్రాతినిధ్యం మరువలేను..
ప్రస్తుతం నేను ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాను. వార్షిక పరీక్షల సమయంలోనే జాతీయ స్థాయి ఎంపికలు జరిగాయి. ఏప్రిల్‌ 6న భువనేశ్వర్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 225 మందికి ట్రయల్స్‌ నిర్వహించారు. ఇందులో 32 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇందులో నుంచి 20 మందిని ఎంపిక చేసి జూన్‌ రెండో తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇందులో నుంచి 12 మందిని ఎంపిక చేశారు. ప్రధాన జట్టు ఆరుగురిలో నేను ఒకరిగా నిలవడం.. మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా జన్మలో మరచిపోలేని సంఘటన. థాయిలాండ్‌ లో 14వ ఏషియన్‌ జూనియర్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పూల్‌–బీలో పటిష్ట జట్లు అయిన జపాన్, చైనాతోపాటు భారత్‌ ఉంది. మేము గెలిచింది ఒక మ్యాచ్‌లోనే అయినా... వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గరుండి చూశాను. ఆటను మరింత మెరుగుపరుచుకుని జాతీయ స్థాయి సీనియర్స్‌ జట్టుకు ఎంపిక కావడమే తొలి లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎస్‌ సాధించడమే నా ఆశయం’’ అన్నారు శాంతకుమారి.

క్రమశిక్షణ, పోరాట పటిమతోనే..
బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్‌ కాలేజీ (బాలికలు) విద్యార్థినులు మొదటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ ముందున్నారు. రగ్బీలో రాష్ట్ర స్థాయిలో మా స్కూల్‌ నుంచి  ప్రాతినిధ్యం వహించారు. జట్టు గోల్డ్‌మెడల్‌ గెలుచుకుంది. కాట్రావత్‌ శాంతకుమారికి క్రీడలంటే చాలా ఇష్టం. వాలీబాల్‌లో ఆమె రాణిస్తుందనే నమ్మకంతో ఆ క్రీడవైపు మళ్లించా. ఎలాంటి ఆధునిక వసతులు లేని చోటు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే ఆమె ఈ స్థాయికి వచ్చింది.
– ఎం.అరుణారెడ్డి, పీడీ, బాలానగర్‌ గురుకుల పాఠశాల,   జూనియర్‌ కాలేజీ (బాలికలు)

ఐదు వందలకు అమ్మాలనుకున్నాం!
మాకు మొదటి ముగ్గురూ ఆడపిల్లలే. నాలుగో సంతానం కూడా ఆడ పిల్లే. అప్పుడే మా గుడిసెలు తగలబడ్డాయి. దీంతో నాలుగో కూతుర్ని అమ్మాలని మా పెద్దలు నిర్ణయానికి వచ్చారు. రూ.500కు గిరాకీ కూడా తీసుకొచ్చారు. కానీ మాకు మనసు ఒప్పలే. ఏ కష్టం చేసైనా సరే. మా బిడ్డల్ని మేమే సాకుతాం అని చెప్పినం. ఉన్న దాంట్లో తింటున్నం. సదివిస్తున్నం.  పెళ్లిళ్లు చేసినం.. మా బిడ్డ గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతాంటే గర్వంగా ఉంది.
– కె. భామిని, అమృనాయక్,   శాంతకుమారి తల్లిదండ్రులు
 

– కిషోర్‌ కుమార్, పెరుమాండ్ల, (సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌)
ఫొటోలు: భాస్కరాచారి, (సాక్షి సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement