volleyball championship
-
అదరగొట్టిన కడప బాలికలు
కడప: మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో కడప, విజయనగరం జట్లు అదరగొట్టాయి. మైదుకూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఈ పోటీలు సోమవారం ఫైనల్ మ్యాచ్‌లతో ఘనంగా ముగిశాయి. స్థానిక మేథా డిఫెన్స్ అకాడమి మైదానంలో ఒకటో కోర్టులో సోమవారం బాలుర విభాగంలో విజయనగరం – పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా విజయనగరం విజేతగా నిలిచింది. రెండో కోర్టులో బాలికల విభాగంలో కడప– గుంటూరు జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు ఘన విజయం సాధించింది. బాలుర విభాగంలో సెమీ ఫైనల్లో విజయనగరం జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీకాకుళం, బాలికల విభాగంలో సెమీ ఫైనల్లో గుంటూరు జట్టుతో ఓడిపోయిన ప్రకాశం మూడో స్థానంలో సరిపెట్టుకున్నాయి. క్రీడా స్ఫూర్తితో పోటీలు జరగడం హర్షణీయం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మైదుకూరులో క్రీడా స్ఫూర్తితో జరగడం హర్షణీయమని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు మైదుకూరులో నిర్వహించడం నియోజకవర్గానికి ప్రతిష్టగా నిలిచిందన్నారు. టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన తనయుడు నాగిరెడ్డి సోమవారం పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. బాలికల, బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కడప, విజయనగరం జట్లకు రూ.20 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన పశి్చమగోదావరి, గుంటూరు జట్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను ఆయా జట్ల కెపె్టన్, కోచ్ మేనేజర్లకు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల జట్లకు రూ.5 వేల నగదును అందించారు. మైదుకూరు మున్సిపల్ వై.రంగస్వామి మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. మైదుకూరులో వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. శెట్టిపల్లె నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్‌తోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల కార్యనిర్వాహక కార్యదర్శులు అరుణకుమారి, వసంత, మేధా డిఫెన్స్ అకాడమి చైర్మన్ సి.నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు విజేతలుగా నిలిచిన జట్లలోని క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ బహూకరించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాల సంఘం నాయకులు సాజిద్, రమేష్ యాదవ్, నిత్య ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, కిరణ్, శ్రీకాంత్, రమేష్ బాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్లకు ఎంపిక శ్రీనగర్‌లో వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం రాష్ట్ర బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. బాలికల జట్టు : జి.ప్రవల్లిక (విశాఖపట్నం), ఎం.విజయలక్ష్మి (విజయనగరం), వి.కుసుమప్రియ, పావని (కడప), సోని, ఎం.సుమశ్రీ(గుంటూరు), పి.జశి్వత(అనంతపురం), ఇ.షణ్ముఖ ప్రియ (చిత్తూరు), కె.ప్రీతి (తూర్పుగోదావరి), ఎస్.పూజిత (ప్రకాశం), సీహెచ్ శ్రీపద్మజ(కృష్ణ), స్టాండ్ బైగా డి.కీర్తన (గుంటూరు), ఎస్.మానస (అనంతపురం), ఎం.వెంకటలక్ష్మి (నెల్లూరు), ఎస్.ఉన్నత సత్యశ్రీ(కృష్ణ), డి.సమైక్య (ప్రకాశం). బాలుర జట్టు : ఎ.ప్రేమ్ కుమార్, ఎస్.తోషన్ రాము (శ్రీకాకుళం), టి.రాహుల్, ఎన్.మౌర్య (విశాఖపట్నం), బి.రంజిత్ (విజయనగరం), వి.రాజు (పశ్చిమ గోదావరి), టి.సు«దీర్ (అనంతపురం), కె.డేవిడ్ రాజు (గుంటూరు), పి.కిరణ్‌బాబు (ప్రకాశం), ఎన్.అజయ్‌కుమార్ (కడప), స్టాండ్‌బైగా ఎస్.భరత్ (కృష్ణ), వై.రోహిత్(కడప), ఎం.ఆర్యన్ (నెల్లూరు), బి.కార్తీక్(అనంతపురం), వై.రాంబాబు (తూర్పుగోదావరి), కె.రాము (పశ్చిమ గోదావరి). -
HBH: వాలీబాల్ క్లబ్ చాంపియన్‌షిప్ విజేత ఈఎంఈ.. ప్రైజ్‌మనీ ఎంతంటే
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రాథమిక స్ధాయి నుంచి వాలీబాల్ క్రీడను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్(హెచ్బీహెచ్) తమ ప్రయాణం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ స్కూల్ చాంఫియన్‌షిప్‌ను నిర్వహించిన హెచ్బీహెచ్ టీమ్.. వాలీబాల్ క్లబ్ చాంఫియన్‌షిప్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని 16 టీమ్‌ల మధ్య ఈ మేరకు నిర్వహించిన వాలీబాల్ క్లబ్ చాంఫియన్‌షిప్‌లో ఈఎంఈ క్లబ్ విజేతగా నిలిచింది. దక్షిణ మధ్య రైల్వేస్‌పై స్ఫూర్తిదాయక విజయాన్ని ఈ క్లబ్ సాధించింది. కాగా ఈ పోటీలు రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగాయి. శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఈ పోటీలకు ముఖ్య అతిథగా హాజరై విజేతలకు కప్ బహూకరించారు. హోరాహోరీగా ఈఎంఈ, రైల్వేస్ టీమ్ మధ్య టైటిల్ కోసం హోరాహోరీ పోరు జరుగగా.. 11–15, 15–14, 12–15, 15–13, 15–8 తో ఈఎంఈ గెలుపొందింది. అత్యంత ప్రతిభావంతమైన టీమ్ తమ పూర్తి సత్తా చాటుతూ ఈ పోటీలో విజయకేతనం ఎగురవేసింది. తద్వారా ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా సెమీస్‌లో దక్షిణ మధ్య రైల్వేస్(ఎస్సీఆర్) 15–10, 15–7, 15–8 స్కోర్‌తో 20 మెహర్ ఇన్ఫ్రాంట్రీ క్లబ్‌పై విజయం సాధించింది. మరో సెమీస్ పోరులో ఈఎంఈ తమ తొలి గేమ్‌ను 10–15 తేడాతో సూపర్ వ్యాలీ క్లబ్‌కు కోల్పోయింది. అయినప్పటికీ తమ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ విజయ పథంలో దూసుకుపోయింది. ఈ టీమ్ 15–10, 15–11, 15–10తో ఫైనల్లో ప్రవేశించింది. ప్రైజ్ మనీ ఎంతంటే ఈ ఫైనల్‌కు ముందు సూపర్ వాలీ, మహల్ ఇన్ఫ్యాంట్రీలు మూడవ స్ధానం కోసం పోటీపడ్డాయి. ఈ గేమ్స్‌లో సూపర్ వాలీ 15–14, 05–15, 15–13, 11–15, 15–12తో విజయం సాధించింది ఈ పోటీలలో విజేతలకు రెండు లక్షల రూపాయల చెక్ అందజేయగా, రన్నరప్ టీమ్ ఒక లక్ష రూపాయలు గెలుచుకుంది. మూడవ స్థానంలో జట్టుకు 60వేల రూపాయలు అందజేయగా, నాల్గవ స్ధానంలో నిలిచిన జట్టుకు నలభైవేల రూపాయలు అందజేశారు. క్వార్టర్ ఫైనల్స్‌కు వచ్చిన మిగిలిన టీమ్‌లలో సంగమ్ క్లబ్, సఫిల్గూడా క్లబ్, మెదక్ క్లబ్, హైదరాబాద్ మేయర్స్ ఉన్నాయి. ఇవి 20 వేల రూపాయల చొప్పున నగదు బహుమతి అందుకున్నారు. ఫలితాలు : ఫైనల్ : ఈఎంఈ క్లబ్, సౌత్ సెంట్రల్ రైల్వేస్‌ను 11–15, 15–14, 12–15, 15–13,15–8తో ఓడించింది. మూడవ స్ధానం : సూపర్ వాలీక్లబ్ , 20 మెహర్ ఇన్ఫ్యాంట్రీ ను 15–14, 05–15, 15–13, 11–15, 15–12తో ఓడించింది. సెమీ ఫైనల్స్ : సౌత్ సెంట్రల్ రైల్వేస్ , 20 మెహర్ ఇన్ఫ్యాంట్రీని 15–10, 15–7, 15–8తో ఓడించింది. అదే విధంగా ఈఎంఈ క్లబ్ , సూపర్ వాలీ క్లబ్ ను 10–15 , 15–10, 15–11, 15–10తో ఓడించింది. చదవండి: Pak Vs Eng: బాబర్ చెత్త కెప్టెన్.. జీరో.. కోహ్లితో పోల్చడం ఆపేయండి: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్ -
12 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లో అడుగు పెట్టిన భారత జట్టు
టెహ్రాన్ (ఇరాన్): ఆసియా అండర్–18 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 25–19, 25–14, 25–27, 25–23తో మాజీ చాంపియన్ తైనీస్ తైపీపై నెగ్గి ఈ టోర్నీలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కుష్ సింగ్ 22 పాయింట్లు సాధించి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. సెమీస్ చేరడంద్వారా భారత్ వచ్చే ఏడాది జరిగే అండర్–19 ప్రపంచ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఆతిథ్య ఇరాన్‌తో భారత్ తలపడుతుంది. చదవండి: Cincinnati Masters: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మెద్వెదెవ్ -
కాట్రావత్ శాంతకుమారి: తండా నుంచి థాయ్‌లాండ్‌కు
నాలుగోసారీ ఆడపిల్ల పుట్టింది. భారమవుతుందేమో అమ్మాలనుకుంటే అయిదొందలకు బేరమూ కుదిరింది. మళ్లీ వద్దనుకున్నారు అమ్మానాన్న. ఎంత కష్టమైనా తామే సాకాలనుకున్నారు. ఐదో క్లాసు నుంచే కూలిపనులకెళ్లింది. మిల్లులో కూలిపనుల కోసం సంచుల్లో తవుడు ఎత్తిన ఆ చేయి... ఇప్పుడు అంతర్జాతీయ ఆటస్థలాల్లో వాలీబాల్ ఎత్తుతోంది. బంతిని బాదినంత తేలిగ్గా బీదరికాన్నీ బాదడానికి ప్రయత్నిస్తోంది. నెట్ అవతలికి బంతిని పంపినట్టుగా తన నైపుణ్యాలను దేశం బయటా చూపుతోంది. ఎక్కడో గిరిజనతండాల్లో పుట్టిన ఆ యువతి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపడానికి ఇప్పుడు మరోసారి సమాయత్తమవుతోంది. ఆల్ ద బెస్ట్... శాంతకుమారి. ఉమ్మడి పాలమూరులోని ప్రస్తుత వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పుతండాకు చెందిన క్రీడా ఆణిముత్యం కాట్రావత్ శాంతకుమారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత వాలీబాల్ క్రీడలో మహిళల కేటగిరిలో జాతీయ జూనియర్ జట్టుకు ఎంపికైన మొట్టమొదటి బాలిక ఆమె. ఈ నెల ఆరు నుంచి 13వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరిగిన 14వ ఏషియన్ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్కపూట తిండికీ కష్టమే.. మా అమ్మ పేరు భామిని, నాన్న అమృనాయక్, మేము మొత్తం ఆరుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు అయ్యాయి. మూడో అక్క మంజుల ఇంటర్ సెకండియర్, తమ్ముళ్లు కుమార్ తొమ్మిది, రాహుల్ ఏడో తరగతి చదువుతున్నారు. మా అమ్మానాన్న అందరినీ సమానంగా చూస్తారు. పెద్ద కుటుంబం కావడం.. అమ్మానాన్నలకు ఉపాధి దొరక్కపోవడంతో ఒక్క పూట తిండి కూడా కష్టమయ్యేది. మేమందరం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోనే చదువుతున్నాం. కరోనాకు ముందు వరకు అమ్మానాన్న ముంబాయికి వలస వెళ్లారు. కరోనా కాలంలో తిరిగి వచ్చాక ఉపాధి దొరకడం కష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్ షేక్‌పేట (నాలా)లో మేస్త్రీ వద్ద పనిచేస్తున్నారు. వారు కష్టం చేసి సంపాదించిన దాంతోపాటు అప్పులు చేసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. మిల్లులో కూలి పనులకు వెళ్లా.. నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాల ప్రైమరీ స్కూల్లో చదువుకున్నా. ఐదు నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు)లో చదువుతున్నా. నేను ఐదో తరగతి నుంచి మా అక్కలతో కలిసి సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేదాన్ని. రైస్‌మిల్లులో సంచులు కుట్టడం, తవుడు ఎత్తడం వంటి పనులు చేశాను. పీడీ మేడం చొరవతో ... నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఎవరైనా ఆటలాడుతుంటే అక్కడే ఉండిపోయేదాన్ని. గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత మా సీనియర్స్ ఖో ఖో అడుతుంటే.. ఒక్కొక్కరి ఆటను దగ్గరుండి గమనించేదాన్ని. ఒకరోజు మా పీడీ మేడమ్ అరుణారెడ్డి వచ్చి ‘ఏం చూస్తావ్.. నీవు ఆడవా’ అని అడిగారు. ఆ తర్వాత నుంచి మేడమ్‌తో మంచి చనువు ఏర్పడింది. మెల్లమెల్లగా నా దృష్టిని వాలీబాల్ వైపు మళ్లించారామె. ఉదయం ఐదు నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు. ఓటమితో మొదలు.. 2016లో మండల స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారించా. మహబూబ్‌నగర్‌లో అండర్ 14 విభాగంలో జరిగిన ఎస్జీఎఫ్ ఎంపికల్లో జిల్లా జట్టుకు ఎంపికయ్యా. ఆ తర్వాత భద్రాచలంలో అసోసియేషన్ మీట్ జరిగింది. ఇందులో సెలెక్ట్ కాలేకపోయా. నాలో నిరుత్సాహం అలుముకుంది. అక్కడి నుంచే మేడంకి ఫోన్ చేశా. ఇక నేను వాలీబాల్ ఆడనని! కానీ.. ఆమె నాకు ఎక్కడలేని ధైర్యాన్ని నూరిపోశారు. ఆమె సూచనతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. అప్పటి నుంచి నేను మానసికంగా బలంగా తయారయ్యా. మెళకువలు నేర్చుకున్నా. అనంతరం సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచా. చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో సెమీఫైనల్ వరకు వెళ్లాం. అలా టెన్నిస్, వాలీబాల్, బీచ్ వాలీబాల్‌తోపాటు రగ్బీ క్రీడలో సైతం రాణించా. అయితే కోవిడ్ విజృంభణతో రెండేళ్లుగా ఆటల పోటీలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మా మేడమ్ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై ఆన్లైన్ ద్వారా క్లాస్ తీసుకునే వారు. వాలీబాల్ ఆట నుంచి నా దృష్టి మరలకుండా శిక్షణ ఇచ్చేవారు. పాస్‌పోర్టు ఇతరత్రా ఖర్చులు కూడా ఆమే భరించారు. మా పీడీ మేడమ్ చొరవ, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయుల ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. నేను వారిని ఎన్నటికీ మరిచిపోలేను. ఏషియన్ పోటీలకు ప్రాతినిధ్యం మరువలేను.. ప్రస్తుతం నేను ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. వార్షిక పరీక్షల సమయంలోనే జాతీయ స్థాయి ఎంపికలు జరిగాయి. ఏప్రిల్ 6న భువనేశ్వర్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 225 మందికి ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 32 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇందులో నుంచి 20 మందిని ఎంపిక చేసి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇందులో నుంచి 12 మందిని ఎంపిక చేశారు. ప్రధాన జట్టు ఆరుగురిలో నేను ఒకరిగా నిలవడం.. మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా జన్మలో మరచిపోలేని సంఘటన. థాయిలాండ్ లో 14వ ఏషియన్ జూనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పూల్–బీలో పటిష్ట జట్లు అయిన జపాన్, చైనాతోపాటు భారత్ ఉంది. మేము గెలిచింది ఒక మ్యాచ్‌లోనే అయినా... వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గరుండి చూశాను. ఆటను మరింత మెరుగుపరుచుకుని జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావడమే తొలి లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎస్ సాధించడమే నా ఆశయం’’ అన్నారు శాంతకుమారి. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే.. బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) విద్యార్థినులు మొదటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ ముందున్నారు. రగ్బీలో రాష్ట్ర స్థాయిలో మా స్కూల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. జట్టు గోల్డ్‌మెడల్ గెలుచుకుంది. కాట్రావత్ శాంతకుమారికి క్రీడలంటే చాలా ఇష్టం. వాలీబాల్‌లో ఆమె రాణిస్తుందనే నమ్మకంతో ఆ క్రీడవైపు మళ్లించా. ఎలాంటి ఆధునిక వసతులు లేని చోటు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే ఆమె ఈ స్థాయికి వచ్చింది. – ఎం.అరుణారెడ్డి, పీడీ, బాలానగర్ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) ఐదు వందలకు అమ్మాలనుకున్నాం! మాకు మొదటి ముగ్గురూ ఆడపిల్లలే. నాలుగో సంతానం కూడా ఆడ పిల్లే. అప్పుడే మా గుడిసెలు తగలబడ్డాయి. దీంతో నాలుగో కూతుర్ని అమ్మాలని మా పెద్దలు నిర్ణయానికి వచ్చారు. రూ.500కు గిరాకీ కూడా తీసుకొచ్చారు. కానీ మాకు మనసు ఒప్పలే. ఏ కష్టం చేసైనా సరే. మా బిడ్డల్ని మేమే సాకుతాం అని చెప్పినం. ఉన్న దాంట్లో తింటున్నం. సదివిస్తున్నం. పెళ్లిళ్లు చేసినం.. మా బిడ్డ గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతాంటే గర్వంగా ఉంది. – కె. భామిని, అమృనాయక్, శాంతకుమారి తల్లిదండ్రులు – కిషోర్ కుమార్, పెరుమాండ్ల, (సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్) ఫొటోలు: భాస్కరాచారి, (సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్) -
క్వార్టర్స్‌లో భారత్
టెహ్రాన్ (ఇరాన్): ఆసియా సీనియర్ పురుషుల వాలీబాల్ ఛాంపియన్షిప్ లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 22–25, 25–12, 25–21, 25–19తో ఒమన్ జట్టును ఓడించింది. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక గ్రూప్ ‘సి’లో భారత్ ఆరు పాయింట్లతో రెండో స్థానానికి చేరగా.. తొమ్మిది పాయింట్లతో చైనా టాపర్‌గా నిలిచింది. క్వార్టర్ ఫైనల్ చేరిన భారత్ వచ్చే ఏడాది చైనాలో జరిగే టోక్యో ఒలింపిక్స్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు కూడా అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్ చేరిన ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఇ’లో భారత్‌తోపాటు చైనా, ఇరాన్, ఆ్రస్టేలియా... గ్రూప్ ‘ఎఫ్’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, పాకిస్తాన్ ఉన్నాయి. -
రన్నరప్ యువ భారత్
న్యూఢిల్లీ: తొలిసారి ఆసియా అండర్–23 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవాలని ఆశించిన భారత జట్టు తుది మెట్టుపై తడబడింది. మయన్మార్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 21–25, 20–25, 25–19, 23–25తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. చైనా, న్యూజిలాండ్, కజకిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లపై గెలిచి జపాన్, థాయ్‌లాండ్, చైనీస్ తైపీ జట్ల చేతిలో ఓడింది. ఈ టోర్నీలో విజేత చైనీస్ తైపీ, రన్నరప్ భారత్ జట్లు అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించాయి. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
న్యూఢిల్లీ: భారత పురుషుల జట్టు అండర్–23 ఆసియా వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మయన్మార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడింది. భారత్ 2–3 (25–15, 23–25, 23–25, 25–23, 13–15)తో థాయ్‌లాండ్ చేతిలో పరాజయం చవిచూసినప్పటికీ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్ చేరింది. -
చాంపియన్ ఆర్మీ గ్రీన్ జట్టు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ సర్వీసెస్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో ఆర్మీ గ్రీన్ జట్టు విజేతగా నిలిచింది. సికింద్రాబాద్ ఈఎంఈ సెంటర్లోని ఈగల్ ఇండోర్ వాలీబాల్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆర్మీ గ్రీన్ జట్టు 25–21, 26–24, 25–20తో ఇండియన్ నేవీపై గెలుపొంది టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్లో ఆర్మీ రెడ్, ఆర్మీ గ్రీన్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టీమ్ జట్లు పాల్గొన్నాయి. పోటీల అనంతరం ఈఎంఈ సెంటర్ కమాండెంట్ కల్నల్ దేవదాస్ నందా విజేతలకు టైటిల్‌ను అందజేశారు. -
విజేత రిసాలా బజార్ జట్టు
సాక్షి, హైదరాబాద్: అటల్ బిహారి వాజ్‌పేయ్ యూత్ ఫెస్ట్‌లో భాగంగా జరిగిన వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో రిసాలా బజార్ జట్టు ఆకట్టుకుంది. ఎల్బీ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. టైటిల్‌పోరులో రిసాలా బజార్ 25–20, 25–21తో ఎల్బీ స్టేడియంపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఎల్బీ స్టేడియం 25–18, 25–21తో వైఎంసీఏ నారాయణగూడపై, రిసాలా బజార్ 25–16, 25–18తో సరూర్నగర్పై విజయం సాధించాయి. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ విజయం
జాతీయ సీనియర్ వాలీబాల్ చెన్నై: జాతీయ సీనియర్ పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. శనివారం మొదలైన ఈ పోటీల లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 25-14, 25-16, 25-12తో బిహార్‌ను ఓడించింది. ప్రారంభోత్సవం సందర్భంగా... దివంగత వాలీబాల్ మేటి క్రీడాకారులు అబ్దుల్ బాసిత్ (తెలంగాణ), జిమ్మీ జార్జి (కేరళ) కుటుంబాలకు రూ. లక్ష చొప్పున భారత వాలీబాల్ సంఘం (వీఎఫ్ఐ) ఆర్థిక సహాయం అందజేసింది. కాంస్యం నెగ్గిన తోషాలి చెన్నై: చెన్నై ఓపెన్ ‘ఫిడే’ రేటింగ్ కేటగిరి-బి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వి.తోషాలి కాంస్య పతకాన్ని సాధించింది. శనివారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత వైజాగ్‌కు చెందిన తోషాలి 7.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం తొమ్మిది రౌండ్లలో తోషాలి ఏడు గేమ్‌లలో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. 8.5 పాయింట్లతో అనిల్ కు మార్ (కేరళ) విజేతగా నిలిచాడు. -
దక్షిణాసియా వాలీబాల్ విజేత భారత్
త్రిపురేశ్వర్ (నేపాల్): మొదటి దక్షిణాసియా మహిళల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 25-13, 25-6, 25-8తో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్, అన్నీ గెలిచి మొత్తం 12 పాయింట్లతో టైటిల్ సొంతం చేసుకుంది. టోర్నీలో భారత్ ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. నేపాల్‌కు రెండో స్థానం లభించింది. ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో విజేత భారత్‌కు 2 వేల డాలర్లు ప్రైజ్‌మనీ లభించింది.