తెలంగాణను గుప్పిట్లో పెట్టుకునే కుట్ర | Minister KTR in a special interview to Sakshi | Sakshi
Sakshi News home page

తెలంగాణను గుప్పిట్లో పెట్టుకునే కుట్ర

Published Sun, Nov 5 2023 2:51 AM | Last Updated on Sun, Nov 5 2023 5:23 AM

Minister KTR in a special interview to Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై రెండు రోజుల్లో బీజేపీ ఆఫీసులో అడ్డగోలుగా నివేదికను వండివార్చారని.. ఇది రాజకీయ కక్షతో కేసీఆర్‌ను బద్నాం చేసి తెలంగాణను గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాలోచన మాత్రమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ అధికారులు అక్కడ నమూనాలు ఏమైనా సేకరించారా? ల్యాబ్‌ టెస్ట్‌లు చేశారా? ఆ రిపోర్టులేవైనా బయటపెడ్తారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, ఇతర పార్టీల హయాంలో నిర్మించిన ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు, బెంగాల్‌లోని ఫరక్కా ప్రాజెక్టుల్లోనూ తొలినాళ్లలో సాంకేతిక లోపాలు తలెత్తితే వాటిని సరిచేశారని. ఇదీ అంతేనని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్‌ ‘సాక్షి’కి  ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ..

సాక్షి: బీఆర్‌ఎస్‌ గత హామీలేవని బీజేపీ, తమ గ్యారంటీలను కాపీ కొట్టారని కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలపై స్పందన?
కేటీఆర్‌: మా మేనిఫెస్టోను ‘కేసీఆర్‌ భరోసా’గా పిలుస్తూ 15 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాం. రైతుబంధు, ఆసరా పింఛన్లు పెంచుతూ కొత్తగా తెల్లరేషన్‌ కార్డున్న 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా, సన్నబియ్యం, కేసీఆర్‌ ఆరోగ్యరక్ష కింద రూ.15 లక్షల కవరేజీ, మహిళలకు నెలకు రూ.3వేలు భృతి, రూ.400కు గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం.

అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం. కరోనా వల్ల నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయాం. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతీ ఇంటికీ తాగునీరు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు వంటి ఎన్నో హామీలను మోదీ సర్కారు నెరవేర్చలేదు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుగా బీజేపీ తీరు ఉంది. రైతుబంధును కాపీ కొట్టిన కాంగ్రెస్‌ మా మేనిఫెస్టోను విమర్శించడం హాస్యాస్పదం.

బీఆర్‌ఎస్‌ కంటే తమ పాలనే బెటర్‌ అంటున్న కాంగ్రెస్‌ వ్యాఖ్యలను ఏమంటారు?
కాంగ్రెస్‌ అంటేనే కన్నీళ్లు, కల్లోలం, కష్టాల కడలి. తెలంగాణలో హైదరాబాద్‌ మినహా మిగతా అన్ని జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల జాబితాలో ఉండేవి. ఇప్పుడు తలసరి ఆదాయంలో నంబర్‌ వన్‌ స్థానంతోపాటు విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాం. వాళ్లకు మాకు జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌ ఉంది.

మీరు అభ్యర్థులకు బీఫారాలు కూడా ఇచ్చేశారు. విపక్షాల్లో ఇంకా ఎంపికే పూర్తికాకపోవడంపై కామెంట్‌!
విపక్షాలు సీట్లు పంచుకునేలోపు మేం స్వీట్లు పంచుకుంటాం. దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అని రాహుల్‌ అడుగుతున్నారు. 1952 నుంచి 2013 దాకా తెలంగాణను వేధించినది ఆ ఢిల్లీ దొరలే. రాష్ట్రాన్ని ఇవ్వ కుండా వందలమంది చావులకు కారణమైందీ వారే. 2014 నుంచి నేటివరకు తెలంగాణను వేధిస్తున్న మరో ఢిల్లీ దొర ప్రధాని మోదీ. ఈ ఎన్నిక కూడా ఢిల్లీ దొరల అహంకారం.. తెలంగాణ ఆత్మగౌరవానికి నడుమ సాగుతున్న పోరాటం.

ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ‘ఓవర్‌ ఫ్లో’అయిందని చెప్పి.. మళ్లీ పెద్ద సంఖ్యలో చేరికలేమిటి?
మేం బలపడి, ఇతరులు బలహీనపడాలనే యుద్ధనీతి, రణతంత్రంలో భాగంగా చేరికల ఎ త్తుగడను అనుసరిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీలు చివరి నిమిషంలో చేరుతున్న పారాచూట్‌ లీడ ర్లకు టికెట్లు అమ్ముకుంటున్నాయి. మేం 95% సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చాం. ఇతర పార్టీ లు సుదీర్ఘకాలం పనిచేసిన నేతల గొంతు నొక్కు తుంటే.. పొన్నాల, నాగం, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పి.విష్ణువర్ధన్‌రెడ్డి, దరువు ఎల్లన్న వంటి ఎందరో నేతలు బయటికి వచ్చారు.

బీజేపీ ‘బీసీ సీఎం’ నినాదంపై మీరేమంటారు?
గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు.. అధికారం రాదని తెలిసి బీజేపీ ఈ నినాదం ఎత్తుకుంది. బీసీ ని రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తొ లగించిన బీజేపీ.. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు డిమాండ్‌ నూ పట్టించుకోవట్లేదు. వ్యక్తికి కులం కాదు గుణం ముఖ్యం. దళితులు, బీ సీలు, కులవృత్తులకు మేలుచేస్తున్న కేసీఆర్‌కు అందరి ఆశీర్వాదం ఉంది.

మోదీ, అమిత్‌ షా, సోనియా, రాహుల్‌ వంటి ఢిల్లీ నేతల ధాటిని తట్టుకోగలరా?
ఢిల్లీ నేతలకు సామంతులుగా ఉండే కీలుబొమ్మలు కావాలి. కానీ మోదీ, రాహుల్‌లకు కొరుకుడు పడని కొయ్య కేసీఆర్‌. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ తమ పార్టీ సీఎంలు, కేంద్ర మంత్రులు, ఇతరులను దిగుమతి చేసుకుని దాడికి దిగుతున్నాయి. మేం తెలంగాణను గెలిపించే పనిలో ఉన్నాం. వాళ్లు తెలంగాణను గెలుచుకునే పనిలో ఉన్నారు. అవగాహన రాహిత్యంతో రాహుల్‌ విమర్శలను చూసి పప్పు అనక తప్పలేదు. వారు ఇటుకతో కొడితే మేం రాయితో కొడుతాం.

బీజేపీ–జనసేన పొత్తు, కాంగ్రెస్‌కు వైఎస్సార్‌టీపీ, టీజేఎస్‌ మద్దతు, బీఎస్పీ పోటీ వంటి వాటిని ఎలా చూస్తున్నారు?
ఆ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు ఏకోన్ముఖంగా ఉంటారు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలో ప్రజలకు స్పష్టత ఉంది. జేబులో ఉన్న నోటు వంటి కేసీఆర్‌ను వదులుకుని.. చిల్లర నాణేల లాంటి పార్టీలను ప్రజలు ఏరుకోరు. తాత్కాలికంగా పాలపొంగు లాంటి అసంతృప్తి, ఆవేశం అక్కడక్కడా ఉన్నా కేసీఆర్‌ తమ ఇంటి మనిషి అని ఓటర్లు అనుకుంటున్నారు.

సోనియా తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ పరిస్థితి ఏమిటని కాంగ్రెస్‌ అంటోంది?
కేసీఆర్‌ నిరాహార దీక్ష, వందలాది యువత ఆత్మ బలిదానాలు, వైఎస్‌ జగన్‌ ఏపీలో కొత్త పార్టీ పెట్టడంతో.. కాంగ్రెస్‌కు నూకలు చెల్లి అనివార్య స్థితిలో తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ రాకపోతే రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యేవాడే కాదు కదా.

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి?
అది అత్యంత దారుణమైన అమానవీయ చర్య. తెలంగాణ­లో రాజకీయంగా విభేదాలున్నా హత్యా రాజకీయాలు లేవు. రేవంత్‌ నాయకత్వంలో ఈ సంస్కృతి వస్తోంది.

సిట్టింగ్‌లపై వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారు?
మేం విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. కొన్ని తప్పులు, పొరపాట్లు, అసంతృప్తి వంటివి ఉన్నా ఈ ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్‌ ఉండాలా వద్దా అనే అంశానికే ప్రాధాన్యం. త్వరలోనే మిగతా అభ్యర్థులకు బీఫారాలు ఇస్తాం.

కేసీఆర్‌ చేస్తున్న యాగం మీద విమర్శలపై స్పందన?
హిందువులు రెండు రకాలు. ఒకరు కేసీఆర్‌లా నిజమైన ధార్మిక భావాలు కలిగినవారు. మరికొందరు కేవలం రాజకీయంగా వాడుకునే సన్నాసులు. అలాంటి వారే క్షుద్రపూజలు అంటూ విమర్శలు చేస్తారు.

కేంద్రంతో ఘర్షణ వైఖరిపై మీ వివరణ?
కేంద్రంతో ఎన్నడూ మా అంతట మేం తగాదా పెట్టుకో­లేదు. కెలికి కయ్యం పెట్టుకుంటే తగినరీతిలో సమాధానం చె­ప్పాం. రాబోయే రోజుల్లో కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి, 25 స్థానాల్లో గెలిచినా ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాం.

ప్రజల అసంతృప్తి పాలపొంగు 
మా ప్రభుత్వంపై తాత్కాలికంగా పాలపొంగు వంటి అసంతృప్తి అక్కడక్కడా ఉన్నా.. ‘కేసీఆర్‌ మా ఇంటి మనిషి.. ఆయనపై గులుగుడే గులుగుడే.. ఓట్లు గుద్దుడు గుద్దుడే’ అని ఓటర్లు అనుకుంటు­న్నారు. కేసీఆర్‌ స్వయంగా పోటీ చేస్తున్న గజ్వే­ల్, కామారెడ్డి లో గెలుపు ఖాయం. ఈటల రాజేం­ద­ర్‌ అటు హుజూరాబాద్, ఇటు గజ్వేల్‌లో ఓటమి ఖా­యం. రేవంత్‌ కూడా అటు కొడంగల్, ఇటు కామా­రెడ్డిలో ఓడిపోతారు. కేసీఆర్‌ చేతిలో ఓటమి ద్వారా పరువు కాపాడుకునేందుకు ఇద్దరూ పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్‌కు మేలు చేసేందుకే టీడీపీ పోటీకి దూరం
ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోవడం కాంగ్రెస్‌ కు మేలు చేసేందుకే. కాంగ్రెస్, తెలుగుదేశం లోపా యి­కారీగా కలవడం కలికాలమే. గత ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలసి పోటీచేశాయి. అధికారం కోసం కలలు కనడం కాంగ్రెస్‌కు కొత్త కాదు. ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ వైషమ్యాలు, విభేదాలు తెలంగాణకు పాకవద్దు. నిరసన తెలిపే హక్కు ఉన్నా అందుకు అనువైన వేదికలు ఉన్నాయి. ధర్నా­చౌక్‌లో నిర భ్యంతరంగా నిరసన వ్యక్తం చేయొచ్చు. ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చిచ్చుపెట్టవద్దని కోరుకుంటున్నా.   – మంత్రి కేటీఆర్‌


- కల్వల మల్లికార్జున్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement