‘‘ఏ ఆర్టిస్ట్ అయినా ఒకేలాంటి మేనరిజాన్ని, డైలాగ్ డెలివరీని అలవాటు చేసుకుంటే త్వరగా బోర్ కొట్టే అవకాశముంది. నేను ఎస్వీ రంగారావు, కమల్ హాసన్ స్కూల్‌ని ఫాలో అవుతాను. నేను డైరెక్టర్స్ యాక్టర్‌ని. అలాగే మెథడ్ యాక్టర్‌ని కూడా. పాత్ర ఆత్మను పట్టుకోవడానికి దర్శకులతో కలసి పని చేస్తాను. అందుకే ఇంకా వరుస సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు సీనియర్ నరేష్. ఇటీవల విడుదలైన ’ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో ఆయన చేసిన ‘బాబ్జి’ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, నరేష్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ పలు విశేషాలు పంచుకున్నారు.
►సినిమాయే నా వ్యసనం. నాకు సీనియర్ దర్శకులు.. జూనియర్ దర్శకులు అనే తేడా ఉండదు. దర్శకుడే సుపీరియర్ అని నమ్ముతాను. అతనితో కలసి క్యారెక్టర్ ను మెరుగు పరచుకోవాలనుకుంటాను. అదే నేను నమ్మే ఫస్ట్ రూల్. కొంతమంది రచయితలు, ‘ఈ పాత్ర మిమ్మల్ని ఊహించుకునే రాశాము’ అని చెబితే చాలా సంతోషంగా ఉంటుంది. అది జాతీయ అవార్డు కంటే గొప్ప ఫీలింగ్.
►ఓటీటీలో విడుదలైన చిత్రాల్లో మా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇది మలయాళ సినిమాకు రీమేక్ అయినా మన నేటివిటీకి తగ్గట్టు చెప్పాడు దర్శకుడు మహా వెంకటేష్. సత్య దేవ్ చాలా బాగా చేశాడు. తనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే నా పాత్రకు కూడా చాలా అభినందనలు వస్తున్నాయి. ‘శతమానం భవతి, సమ్మోహనం’ తర్వాత మళ్లీ ఆ రేంజ్ అభినందనలు ఈ సినిమాకే వచ్చాయి.
►అతిశయోక్తి అనుకోకపోతే.. లాక్‌డౌన్‌లో నాకు సినిమా షూటింగ్ చేస్తున్నట్టు, ఆడియో ఫంక్షన్స్.. ఇవే కలలోకి వస్తున్నాయి. లాక్ డౌన్‌లో నా ఫార్మ్ హౌస్‌లోనే పని చేసుకుంటూ ఉన్నాను. మా అమ్మ లాగా నేను మంచి రైతుని. కోవిడ్ సమయంలో బిజీగా ఉంటున్నాను. స్క్రిప్ట్స్ వింటున్నాను. మా అసోసియేషన్ కి సంబంధించిన పనులు చూసుకుంటున్నాను.
►సినిమా అనేది జీవనది. సినిమా ఆగదు. సినిమాను థియేటర్‌లో చూడటం ఓ మంచి అనుభవం. ఓటీటీని మంచిగా వాడుకుంటే చిన్న బడ్జెట్ చిత్రాలకు మంచి అవకాశం. వెబ్ సిరీస్ కి అడిగారు కానీ కుదరలేదు. నేను అన్నింటికీ ఎప్పుడూ ఓపెన్ గా ఉంటాను. ప్రస్తుతం కరోనాకి సంబంధించి జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ మొదలుపెడతామంటే నేను సిద్ధంగా ఉన్నాను.
Comments
Please login to add a commentAdd a comment