Uma Maheswara Ugra Roopasya Movie
-
అదే నా వ్యసనం!
‘‘ఏ ఆర్టిస్ట్ అయినా ఒకేలాంటి మేనరిజాన్ని, డైలాగ్ డెలివరీని అలవాటు చేసుకుంటే త్వరగా బోర్ కొట్టే అవకాశముంది. నేను ఎస్వీ రంగారావు, కమల్ హాసన్ స్కూల్‌ని ఫాలో అవుతాను. నేను డైరెక్టర్స్ యాక్టర్‌ని. అలాగే మెథడ్ యాక్టర్‌ని కూడా. పాత్ర ఆత్మను పట్టుకోవడానికి దర్శకులతో కలసి పని చేస్తాను. అందుకే ఇంకా వరుస సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు సీనియర్ నరేష్. ఇటీవల విడుదలైన ’ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో ఆయన చేసిన ‘బాబ్జి’ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, నరేష్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ పలు విశేషాలు పంచుకున్నారు. ►సినిమాయే నా వ్యసనం. నాకు సీనియర్ దర్శకులు.. జూనియర్ దర్శకులు అనే తేడా ఉండదు. దర్శకుడే సుపీరియర్ అని నమ్ముతాను. అతనితో కలసి క్యారెక్టర్ ను మెరుగు పరచుకోవాలనుకుంటాను. అదే నేను నమ్మే ఫస్ట్ రూల్. కొంతమంది రచయితలు, ‘ఈ పాత్ర మిమ్మల్ని ఊహించుకునే రాశాము’ అని చెబితే చాలా సంతోషంగా ఉంటుంది. అది జాతీయ అవార్డు కంటే గొప్ప ఫీలింగ్. ►ఓటీటీలో విడుదలైన చిత్రాల్లో మా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇది మలయాళ సినిమాకు రీమేక్ అయినా మన నేటివిటీకి తగ్గట్టు చెప్పాడు దర్శకుడు మహా వెంకటేష్. సత్య దేవ్ చాలా బాగా చేశాడు. తనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే నా పాత్రకు కూడా చాలా అభినందనలు వస్తున్నాయి. ‘శతమానం భవతి, సమ్మోహనం’ తర్వాత మళ్లీ ఆ రేంజ్ అభినందనలు ఈ సినిమాకే వచ్చాయి. ►అతిశయోక్తి అనుకోకపోతే.. లాక్డౌన్లో నాకు సినిమా షూటింగ్ చేస్తున్నట్టు, ఆడియో ఫంక్షన్స్.. ఇవే కలలోకి వస్తున్నాయి. లాక్ డౌన్లో నా ఫార్మ్ హౌస్‌లోనే పని చేసుకుంటూ ఉన్నాను. మా అమ్మ లాగా నేను మంచి రైతుని. కోవిడ్ సమయంలో బిజీగా ఉంటున్నాను. స్క్రిప్ట్స్ వింటున్నాను. మా అసోసియేషన్ కి సంబంధించిన పనులు చూసుకుంటున్నాను. ►సినిమా అనేది జీవనది. సినిమా ఆగదు. సినిమాను థియేటర్లో చూడటం ఓ మంచి అనుభవం. ఓటీటీని మంచిగా వాడుకుంటే చిన్న బడ్జెట్ చిత్రాలకు మంచి అవకాశం. వెబ్ సిరీస్ కి అడిగారు కానీ కుదరలేదు. నేను అన్నింటికీ ఎప్పుడూ ఓపెన్ గా ఉంటాను. ప్రస్తుతం కరోనాకి సంబంధించి జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ మొదలుపెడతామంటే నేను సిద్ధంగా ఉన్నాను. -
రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
టైటిల్: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య జానర్: లవ్ అండ్ రివేంజ్ స్టోరీ రచనా, దర్శకత్వం: వెంకటేష్ మహా నటీనటులు: సత్యదేవ్, హరిచందన, రూప, నరేశ్, సుహాస్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు నిర్మాతలు: విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ సినిమాటోగ్రఫి: అప్పు ప్రభాకర్ గతేడాది నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. విభిన్న కాన్సెప్ట్ ఆధారంగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ హిట్ కొట్టడమే కాకుండా ప్రేక్షకుల మనసునూ గెలుచుకుంటున్నాయి. తాజాగా జూలై 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" ఈ కోవలోకే వస్తుంది. ఇది జాతీయ అవార్డును అందుకున్న "మహేషింటే ప్రతీకారమ్" అనే మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరెకెక్కింది. మరి ఈ చిత్రం ఎంతవరకు 'క్లిక్' అవుతుందో చూసేద్దాం.. కథ: హీరో మహేశ్(సత్యదేవ్) అరకులోని ఓ ఫొటోగ్రాఫర్. గొడవలంటే ఆమడదూరం పరిగెడతాడు. అలాంటిది ఓ రోజు వీధి రౌడీ జోగినాథ్ (రవీంద్ర విజయ్)తో దెబ్బలాడుతాడు. కొట్లాటకు దిదిగడం ఇదే తొలిసారి అయినందువల్ల తిరిగి కొట్టడం చేత కాలేదు. కానీ అందరి ముందు దారుణంగా తన్నులు తినడంతో హీరో ఆత్మాభిమానం దెబ్బ తింటుంది. తనను చితక్కొట్టిన రౌడీని మళ్లీ తిరిగి కొట్టేవరకు చెప్పులు కూడా వేసుకోనని మంగమ్మ శపథం చేస్తాడు. అలా అప్పటివరకు నవ్వుతూ సరదాగా ఉండే హీరో ఉగ్ర రూపం దాలుస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. (‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ టీజర్ రిలీజ్) అతి సాధారణంగా ప్రారంభమైన సినిమా కాసేపటికి బోరింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ప్రేక్షకుడు దారి తప్పకుండా తిరిగి కథలోకి తీసుకొచ్చేందుకు దర్శకుడు కాస్త ఎక్కువగానే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. అందరి ముందు రౌడీ చేతిలో హీరో తన్నులు తినే కీలక సన్నివేశంతో ప్రేక్షకుడు మళ్లీ కథలో లీనమవుతాడు. సరిగ్గా ఇదే సమయంలో ప్రేమికురాలు స్వాతి (హరిచందన) బ్రేకప్ చెప్తుంది. ఇక్కడ బ్రేకప్ చెప్పిన తర్వాత ప్రేమికుల పరిస్థితి ఎలా ఉంటుందనేది హీరోహీరోయిన్ల పాత్రల ద్వారా ఆసక్తకిరంగా మలిచాడు. అయితే స్వాతి వేరొకరిని పెళ్లి చేసుకోగా ఉమా రౌడీ చెల్లెలు జ్యోతి (రూప)తో ప్రేమలో పడతాడు. కథలో ప్రేమను, అనుబంధాలను రమ్యంగా చూపించాడు. మరి ఉమా రౌడీపై ప్రతీకారం తీర్చుకున్నాడా? జ్యోతితో ప్రేమకు ఏమైనా అడ్డంకులు ఎదురయ్యాయా? అనేవి చెప్పడం కన్నా సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. కథ చివర్లో ఎలాంటి ట్విస్ట్‌లు, మ్యాజిక్‌లు లేకుండానే సింపుల్‌గా ముగించేశాడు. విశ్లేషణ: "మహేషింటే ప్రతీకారమ్" సినిమాను బాగా వంటబట్టించుకున్న 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా మాతృక నుంచి బయటకు రాలేడేమో అనిపిస్తుంది. నటీనటులు మేకప్ లేకుండా కనిపించడం, మెలోడ్రామా లేని నటనతో పాత్రలన్నీ సహజసిద్ధంగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. అప్పు ప్రభాకర్ అరకు అందాలను మరింత అందంగా చూపించాడు. హీరో ఫొటోగ్రఫీ గురించి కొత్త అర్థాన్ని చెప్తాడు. సంగీతం ఫర్వాలేదు. కానీ ఈ సినిమాకు 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' అనే భారీ టైటిల్ సూటయినట్లు అనిపించదు. ఇందులో హీరో ఉగ్రరూపం కంటే మంచితనం, అమాయకత్వమే పెద్దగా హైలెట్ అయ్యాయి. అంతేకాక అమాయకంగా ఉండే హీరో ఉగ్రావతారం ఎత్తి రౌడీని ఎలా ఎదుర్కొన్నాడు? అనే ఒక్క పాయింట్‌ను సాగదీసి చెప్పడం ప్రేక్షకుడి సహనానికి. (‘ఓ.. పిట్ట కథ’ మూవీ రివ్యూ) సత్యదేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, అమాయకంగా కనిపించడమే కాక ఉగ్ర రూపంలోనూ దర్శనమిస్తూ నవరసాలు ఒలికించాడు. నరేష్ తన పాత్రలో జీవించేశాడు. స్వాతి పాత్రలో హీరోయిన్ హరిచందన గ్లామరస్‌కు దూరంగా ఉంటే, రౌడీ చెల్లెలు జ్యోతి పాత్రలో రూప కాస్త గ్లామరస్‌గా కనిపించారు. ఇద్దరూ చాలా సహజంగా నటించారు. షూటింగ్ ప్రధానంగా జరిగిన అరకు అందాలు అడుగడుగునా కనిపిస్తాయి. అయితే కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారు మాత్రం దీన్ని కాస్త ఓపికగా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫీ హీరో నటన అరకు అందాలు రౌడీతో హీరో తలపడే సన్నివేశాలు మైనస్ పాయింట్స్ కథనం స్లో నెరేషన్ -
‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ టీజర్ రిలీజ్
అందరూ ఎవరి మాట విన్నా, వినకపోయినా ఒకరు చెప్పినట్లు మాత్రం చచ్చినట్లు వినాల్సిందే. అది ఎవరో మీకీపాటికే అర్థమైపోయుంటుంది.. ఫొటోగ్రాఫర్.. అవును, అతను ఏది చెప్పినా కిక్కురుమనకుండా చేయాల్సిందే. పైగా పెళ్లైనా, పేరంటమైనా ఆయన లేనిదే ముందుకు సాగని పరిస్థితి. అలాంటి ఫొటోగ్రాఫర్ అవతారమెత్తాడు సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’. ఇది ‘మహేశింటె ప్రతీకారమ్’ అనే మలయాళ చిత్రానికి రీమేక్. టీజర్‌ను చూస్తే.. ఈ ఫొటోగ్రాఫర్ ఓ అమ్మాయి ఫొటో క్లిక్‌మనిపించే సమయంలో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇంకేముందీ.. అద్దం ముందు నిల్చుని రెడీ అవ్వడం, తనలో తానే ముసిముసిగా నవ్వుకోవడం, గంటల తరబడి ఫోన్ మాట్లాడటం.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. అయితే, టైటిల్ అంత భీకరంగా ఉన్నప్పటికీ టీజర్ మాత్రం సాఫీగా సాగుతుంది. కానీ ఎంతో సౌమ్యంగా కనిపిస్తున్న హీరో చివర్లో ఉగ్రావతారం ఎత్తాడు. అది దేనికోసమో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాను బాహుబలి వంటి భారీ బడ్జెట్‌ను తెరకెక్కించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా, నిర్మాత ప్రవీణా పరుచూరితో కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. (చెప్పు లేసుకోవయ్యా అంటే.. తిరిగి ఆణ్ణి కొట్టేవరకు చెప్పులు వేసుకోను) -
ఉమామహేశుడి ఉగ్రరూపం
‘బాహుబలి’ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా, నిర్మాత ప్రవీణా పరుచూరితో కలసి ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళ ‘మహేశింటె ప్రతీకారమ్’ చిత్రానికి రీమేక్. అరకు వ్యాలీలో జరిపిన 36 రోజుల షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. ‘‘ఉమా మహేశ్ చాలా సౌమ్యుడు. ఓ సందర్భంలో అతను ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటనేది కథ. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2020 ఏప్రిల్ 17న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’
సాక్షి, హైదరాబాద్: ఈ పేరేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఇది కొత్త తెలుగు సినిమా టైటిల్. సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. ‘c/o కంచరపాలెం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేశ్ మహ ఈ సినిమాకు దర్శకుడు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2016లో విడుదలై ఘన విజయం సాధించిన మలయాళం సినిమా ‘మహేశింతే ప్రతీకారం’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాను 2020, ఏప్రిల్ 17న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. సత్యదేవ్‌తో పాటు సీనియర్ నటుడు నరేశ్ ఇందులో కనిపించారు. ‘చెప్పు లేసుకోవయ్యా అంటే.. తిరిగి ఆణ్ణి కొట్టేవరకు చెప్పులు వేసుకోను’ అంటూ హీరో సమాధానం ఇస్తాడు. ప్రతీకారం నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. విలక్షణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.