టైటిల్: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
జానర్: లవ్ అండ్ రివేంజ్ స్టోరీ
రచనా, దర్శకత్వం: వెంకటేష్ మహా
నటీనటులు: సత్యదేవ్, హరిచందన, రూప, నరేశ్, సుహాస్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు
నిర్మాతలు: విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
సినిమాటోగ్రఫి: అప్పు ప్రభాకర్
గతేడాది నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. విభిన్న కాన్సెప్ట్ ఆధారంగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ హిట్ కొట్టడమే కాకుండా ప్రేక్షకుల మనసునూ గెలుచుకుంటున్నాయి. తాజాగా జూలై 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" ఈ కోవలోకే వస్తుంది. ఇది జాతీయ అవార్డును అందుకున్న "మహేషింటే ప్రతీకారమ్" అనే మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరెకెక్కింది. మరి ఈ చిత్రం ఎంతవరకు 'క్లిక్' అవుతుందో చూసేద్దాం..
కథ:
హీరో మహేశ్(సత్యదేవ్) అరకులోని ఓ ఫొటోగ్రాఫర్. గొడవలంటే ఆమడదూరం పరిగెడతాడు. అలాంటిది ఓ రోజు వీధి రౌడీ జోగినాథ్ (రవీంద్ర విజయ్)తో దెబ్బలాడుతాడు. కొట్లాటకు దిదిగడం ఇదే తొలిసారి అయినందువల్ల తిరిగి కొట్టడం చేత కాలేదు. కానీ అందరి ముందు దారుణంగా తన్నులు తినడంతో హీరో ఆత్మాభిమానం దెబ్బ తింటుంది. తనను చితక్కొట్టిన రౌడీని మళ్లీ తిరిగి కొట్టేవరకు చెప్పులు కూడా వేసుకోనని మంగమ్మ శపథం చేస్తాడు. అలా అప్పటివరకు నవ్వుతూ సరదాగా ఉండే హీరో ఉగ్ర రూపం దాలుస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. (‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ టీజర్ రిలీజ్)
అతి సాధారణంగా ప్రారంభమైన సినిమా కాసేపటికి బోరింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ప్రేక్షకుడు దారి తప్పకుండా తిరిగి కథలోకి తీసుకొచ్చేందుకు దర్శకుడు కాస్త ఎక్కువగానే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. అందరి ముందు రౌడీ చేతిలో హీరో తన్నులు తినే కీలక సన్నివేశంతో ప్రేక్షకుడు మళ్లీ కథలో లీనమవుతాడు. సరిగ్గా ఇదే సమయంలో ప్రేమికురాలు స్వాతి (హరిచందన) బ్రేకప్ చెప్తుంది. ఇక్కడ బ్రేకప్ చెప్పిన తర్వాత ప్రేమికుల పరిస్థితి ఎలా ఉంటుందనేది హీరోహీరోయిన్ల పాత్రల ద్వారా ఆసక్తకిరంగా మలిచాడు. అయితే స్వాతి వేరొకరిని పెళ్లి చేసుకోగా ఉమా రౌడీ చెల్లెలు జ్యోతి (రూప)తో ప్రేమలో పడతాడు. కథలో ప్రేమను, అనుబంధాలను రమ్యంగా చూపించాడు. మరి ఉమా రౌడీపై ప్రతీకారం తీర్చుకున్నాడా? జ్యోతితో ప్రేమకు ఏమైనా అడ్డంకులు ఎదురయ్యాయా? అనేవి చెప్పడం కన్నా సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. కథ చివర్లో ఎలాంటి ట్విస్ట్‌లు, మ్యాజిక్‌లు లేకుండానే సింపుల్‌గా ముగించేశాడు.
విశ్లేషణ:
"మహేషింటే ప్రతీకారమ్" సినిమాను బాగా వంటబట్టించుకున్న 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా మాతృక నుంచి బయటకు రాలేడేమో అనిపిస్తుంది. నటీనటులు మేకప్ లేకుండా కనిపించడం, మెలోడ్రామా లేని నటనతో పాత్రలన్నీ సహజసిద్ధంగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. అప్పు ప్రభాకర్ అరకు అందాలను మరింత అందంగా చూపించాడు. హీరో ఫొటోగ్రఫీ గురించి కొత్త అర్థాన్ని చెప్తాడు. సంగీతం ఫర్వాలేదు. కానీ ఈ సినిమాకు 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' అనే భారీ టైటిల్ సూటయినట్లు అనిపించదు. ఇందులో హీరో ఉగ్రరూపం కంటే మంచితనం, అమాయకత్వమే పెద్దగా హైలెట్ అయ్యాయి. అంతేకాక అమాయకంగా ఉండే హీరో ఉగ్రావతారం ఎత్తి రౌడీని ఎలా ఎదుర్కొన్నాడు? అనే ఒక్క పాయింట్‌ను సాగదీసి చెప్పడం ప్రేక్షకుడి సహనానికి. (‘ఓ.. పిట్ట కథ’ మూవీ రివ్యూ)
సత్యదేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, అమాయకంగా కనిపించడమే కాక ఉగ్ర రూపంలోనూ దర్శనమిస్తూ నవరసాలు ఒలికించాడు. నరేష్ తన పాత్రలో జీవించేశాడు. స్వాతి పాత్రలో హీరోయిన్ హరిచందన గ్లామరస్‌కు దూరంగా ఉంటే, రౌడీ చెల్లెలు జ్యోతి పాత్రలో రూప కాస్త గ్లామరస్‌గా కనిపించారు. ఇద్దరూ చాలా సహజంగా నటించారు. షూటింగ్ ప్రధానంగా జరిగిన అరకు అందాలు అడుగడుగునా కనిపిస్తాయి. అయితే కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారు మాత్రం దీన్ని కాస్త ఓపికగా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫీ
హీరో నటన
అరకు అందాలు
రౌడీతో హీరో తలపడే సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
కథనం
స్లో నెరేషన్
Comments
Please login to add a commentAdd a comment