Srinu Vaitla Birth Day: నన్ను ఇన్‌వాల్వ్‌ చేయొద్దు రావుగారూ..! | Director Sreenu Vaitla Sakshi Special interview | Sakshi
Sakshi News home page

Srinu Vaitla Birth Day: నన్ను ఇన్‌వాల్వ్‌ చేయొద్దు రావుగారూ..!

Published Thu, Sep 23 2021 12:08 AM | Last Updated on Fri, Sep 24 2021 1:03 PM

Director Sreenu Vaitla Sakshi Special interview

శ్రీను వైట్ల... ట్వంటీటూ ఇయర్స్‌ ఇండస్ట్రీ. డైరెక్టర్‌గా పదిహేడు సినిమాలు. జయాపజయాలు ఉన్నప్పటికీ కెరీర్‌ తృప్తిగా ఉందంటున్నారు. ఒక్క ప్రశ్నకు మాత్రం ‘నన్ను ఇన్‌వాల్వ్‌ చేయొద్దు’ అనేశారు. మహేశ్‌బాబుతో శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘దూకుడు’కి నేటితో పదేళ్లు. శుక్రవారం శ్రీను వైట్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీను వైట్లతో ‘సాక్షి’ స్పెషల్‌ ఇంటర్వ్యూ..

► ‘దూకుడు’ సినిమాకి పదేళ్లయిన సందర్భంగా కొన్ని విశేషాలు?
మహేశ్‌బాబుతో సినిమా అనుకున్నాక ఒక స్టోరీ లైన్‌ అనుకోవడం.. దాన్ని మహేశ్‌ ఒప్పుకోవడం జరిగాయి. ఆ తర్వాత ఆ లైన్‌ని ఎనభై శాతం డెవలప్‌ చేశాక నాకు అసంతృప్తిగా అనిపించింది. డ్రాప్‌ చేసేశాను. ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందా అని ఆలోచించుకుంటున్న సమయంలో ‘మహేశ్‌ని ఎమ్మెల్యే గెటప్‌లో చూపిస్తే ఎలా ఉంటుంది?’ అనిపించింది. అలా  పుట్టినదే ‘దూకుడు’. మహేశ్‌కి చెబితే ఎగ్జయిట్‌ అయ్యారు. పగ, ప్రతీకారాల నేపథ్యంలో వినోద ప్రధానంగా గోపీమోహన్‌తో కలసి, ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశా. బాగా వచ్చింది. సెన్సేషనల్‌ హిట్టయింది.

► 22 ఏళ్ల క్రితం సినిమా కష్టాల్లాంటి కష్టాలు ఫేస్‌ చేసే ఉంటారు. ఫైనల్లీ ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ మీరు కూల్‌గా ఉండేంత పొజిషన్‌లో ఉన్నారు...
ఎగ్జాట్లీ.. ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డాను. ఈ కరోనా టైమ్‌లో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చినా.. షూటింగ్‌లకి దూరమవుతున్నామనే బాధ తప్ప వేరే కష్టాలు లేవు. అయితే ఇంట్లో ఎవర్నీ కాలు బయటపెట్టనివ్వకుండా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉన్నాను. ఆ విషయంలో నా పిల్లలు (ముగ్గురు కుమార్తెలు) కొంచెం కోపం ప్రదర్శించినా.. ఎందుకింత ప్రొటెక్టివ్‌గా ఉన్నానో తర్వాత అర్థం చేసుకున్నారు.

► స్త్రీల విషయంలో సమాజంలో పరిస్థితులు అంత బాగాలేవు. మరి.. ముగ్గురు ఆడపిల్లల తండ్రిగా చాలా జాగ్రత్తగా ఉంటారా?
ఉంటున్నాను.. ఒక్కోసారి పిల్లల విషయంలో ‘ఓవర్‌ ప్రొటెక్టివ్‌’గా ఉంటాను. వాళ్లు ఇబ్బందిపడుతున్నారని అర్థం అవుతుంది. కానీ, జరుగుతున్న ఘోరాలు విన్నప్పుడు పిల్లల విషయంలో ఎక్స్‌ట్రా కేర్‌గా ఉండటం తప్పులేదనిపిస్తుంది. పెద్దమ్మాయి ప్లస్‌ టు, రెండో పాప ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, మూడో పాప సెవెన్త్‌ చదువుతోంది. మెచ్యూర్టీ వచ్చాక నేనెందుకు అంత ఓవర్‌ ప్రొటెక్టివ్‌గా ఉన్నానో వాళ్లకు అర్థమవుతుంది.


► ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ 2018 చివర్లో రిలీజైంది. 2020లో లాక్‌డౌన్‌. ఆ ఏడాదిన్నర గ్యాప్‌లో ఏం  చేశారు?
2019లో ఒక స్క్రి‹ప్ట్‌ రెడీ చేశాను. 2020లో అది స్టార్ట్‌ అవ్వాలి. ఈలోపు లాక్‌డౌన్‌ వచ్చింది. ఆ తర్వాత మరో కథ, ఆ తర్వాత ఇంకో ఆలోచన వస్తే.. నా రైటర్స్‌ టీమ్‌కి నచ్చడంతో అది కూడా తయారు చేశాం. మొత్తం మూడు కథలు రెడీగా ఉన్నాయి. అందులో ‘ఢీ అండ్‌ ఢీ’ ఒకటి.

► ‘ఢీ’లో కథ, దానితో పాటు సాగే కామెడీ అన్నీ చక్కగా కుదిరాయి. మరి.. ‘ఢీ అండ్‌ ఢీ’లోనూ ‘నన్ను ఇన్‌వాల్వ్‌ చేయొద్దు’ వంటి డైలాగ్స్‌.. అంత కామెడీ ఉంటుందా?
రెట్టింపు ఉంటుంది. అందుకే ‘ఢీ అండ్‌ ఢీ’కి ‘డబుల్‌ డోస్‌’ అని క్యాప్షన్‌ పెట్టాం. డబుల్‌ డోస్‌ ఆఫ్‌ కామెడీ అని అర్థం. ఇది ‘ఢీ’కి సీక్వెల్‌ కాదు. వేరే కథ. రావుగారూ.. నన్ను ఇన్వాల్వ్‌ చేయొద్దులా పాపులర్‌ అయ్యే ౖడైలాగ్‌ ఇందులోనూ ఉంది. మిగతా అన్ని డైలాగ్స్‌ కూడా బాగుంటాయి.

► ‘ఢీ’లో విష్ణు కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు మేకోవర్‌తో స్లిమ్‌ అయ్యారు. ఇది ప్లస్సవుతుందా?
కచ్చితంగా ప్లస్‌.. మేకోవర్‌ విషయంలో విష్ణు వండర్‌ఫుల్‌. ఎంతో కష్టపడి, ఫిట్‌గా తయారయ్యారు. ‘ఢీ’లో విష్ణు బాగా యాక్ట్‌ చేశారు. ఇప్పుడు ఇంకా మెచ్యూర్టీ వచ్చింది కాబట్టి మ్యాగ్జిమమ్‌ పర్ఫార్మెన్స్‌ రాబట్టగలుగుతాననే నమ్మకం ఉంది. ‘ఢీ’ కంటే కూడా ఈ సినిమాలో విష్ణు క్యారెక్టర్‌లో ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది.

► గౌతమ్‌ మీనన్‌ వంటి దర్శకులు ఇటు సినిమాల్లో అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నటులుగా కనిపిస్తున్నారు.. మీకా ఉద్దేశం లేదా?
నాకు ఫొటోలు దిగడమంటేనే ఇబ్బంది. కెమెరా వెనకాల ఆర్టిస్టులకు ఎంతైనా చేసి చూపిస్తాను. కానీ, యాక్ట్‌ చేయాలనుకోలేదు. నాకా క్వాలిటీ లేదు. గౌతమ్‌ మీనన్‌ గురించి చెప్పాలంటే.. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా ఇష్టం.

► దర్శకుడిగా ఓటీటీ ప్రాజెక్ట్‌ ఏదైనా?
ఇప్పుడు నా దగ్గరున్న మూడు కథలు థియేటర్‌ మీటర్‌ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినవే. ఓటీటీ ప్రాజెక్ట్‌ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు.
 
► మీతో ఎన్నో సినిమాలు చేసిన ప్రకాశ్‌రాజ్, రెండో సినిమా చేయనున్న విష్ణు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.. గెలుపు ఎవరిదని ఊహిస్తున్నారు?
‘ఢీ’లో డైలాగే చెబుతాను. ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్‌వాల్వ్‌ చేయొద్దు రావుగారూ... (నవ్వేస్తూ). ఇప్పుడు నా దృష్టంతా త్వరలో మొదలుపెట్టబోయే ‘ఢీ అండ్‌ ఢీ’ మీదే ఉంది. ఎంత బాగా తీయాలా అనే ప్లానింగ్‌లో ఉన్నాను. అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటి వారంలో షూటింగ్‌ ఆరంభించాలనుకుంటున్నాం.

► కొన్ని హిట్స్‌తో పాటు ఫ్లాప్స్‌ చూశారు కదా.. ఫ్లాప్స్‌కి కారణం తెలుసుకున్నారా?
నా నుంచి ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకుంటున్నారని గ్రహించాను. దానికి దూరంగా వెళ్లినప్పుడు వేరేగా ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే కథలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement