వెబ్ డెస్క్: మహేశ్.. ఆ పేరులోనే ఓ మత్తు ఉంటుంది. అమ్మాయిలకు కలల రాకుమారుడు ‘అతడు’. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ‘రాకుమారుడు’. తనదైన నటనతో టాలీవుడ్ ‘యువరాజు’గా వెలుగొందుతున్నాడు. అంతేకాదు ‘టక్కరి దొంగ’గా మారి అమ్మాయిల మనసును దోచుకున్నాడు. ‘అతిథి’లా అప్పుడప్పుడు కాకుండా ‘దూకుడు’గా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘వన్’అండ్ ఓన్లీ ‘మహర్షి’. సినిమా కోసం ‘సైనికుడి’గా కష్టపడుతూ.. వరుస హిట్లతో నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్న పక్కా ‘బిజినెస్‌మేన్’ ఈ ఆరడుగుల అందగాడు. వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి, ఆ చిన్నారుల తల్లిదండ్రుల పాలిట దైవంగా పిలవబడుతున్న గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ఈ సూపర్ స్టార్. నేడు(ఆగస్ట్ 09) మహేశ్ బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా మహేశ్ సినీ కెరీర్, జీవిత విశేషాలపై ఓ లుక్కెద్దాం.
సూపర్‌స్టార్ కృష్ణ,ఇందిరదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించాడు మహేశ్. 2005 ఫిబ్రవరి 10న ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు గౌతమ్ కాగా, కూతురి పేరు సితార.
(చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’)
ఇక మహేశ్ నటప్రస్థానం విషయానికి వస్తే.. తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టాడు. 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు. ఆ తరువాత వరుసగా బాలనటుడిగా ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’,‘ముగ్గురు కొడుకులు’,‘గూడచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాల చంద్రుడు’, ‘అన్న తమ్ముడు’తదితర చిత్రాలతో బాలనటుడిగా రాణించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో ‘రాజకుమారుడు’(1999) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
(చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..)
జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు. 2003లో వచ్చిన 'నిజం' సినిమాకు గాను మొదటి సారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011లో వచ్చిన దూకుడు, 2015లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు అందుకొని రికార్డు సృష్టించాడు.
ఈ ఏడాది ‘సర్కారి వారి పాట’చిత్రంతో మరో హిట్‌ని తన ఖాతాలు వేసుకున్నాడు మహేశ్. ఇక ఇప్పుడు వరుసగా రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది అయితే.. మరొకటి దర్శకధీరుడు రాజమౌళిది. మహేశ్ విజయాల పరంపర ఇలాగే కొనసాగుతూ.. మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ‘హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్’.
Comments
Please login to add a commentAdd a comment