సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఐపీఎస్ అధికారిగా ఏడేళ్ల సర్విస్‌ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గొంతుకగా మారిన తాను ఎన్నికల అనంతరం కూడా అదేవిధంగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయ న మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
రాష్ట్రంలోని 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టిపోటీ ఇస్తుందన్నారు. చాలా నియోజకవర్గాల్లో అనూహ్య విజయాలు సాధించబోతున్నామని చెప్పారు. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీల ధనబలాన్ని తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు ధీటైన పోటీ ఇస్తున్నారని చెప్పారు. సిర్పూరులో తనతోపాటు చాలా జిల్లాల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలిచిన బీఎస్పీకి రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు అండగా నిలిచారన్నారు.
ఆదివాసీల పోడుభూముల కోసం పోరుబాట పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత, గిరిజన, బీసీ వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల కోసం రెండేళ్లుగా రాజకీయ పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు అత్యధిక స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించి ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. గెలిచిన తరువాత ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేందుకు పోరాడతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment