సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒక వేళ హంగ్ పరిస్థితులే ఉంటే సీఎం పదవిని ఆఫర్ చేసిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఎన్నికల శంఖారావం పేరుతో కొత్తగూడెంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడంతో పాటు బీఎస్పీకి సంబంధించిన మేనిఫెస్టోలోని కీలక అంశాలను వెల్లడించారు.
పులికి భయమెందుకు..
తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి నెలకు రూ.3.50 లక్షల జీతం తీసుకుంటున్న సీఎం కేసీఆర్ నెల రోజుల నుంచి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్ 15న పులి బయటకు వస్తుందని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఆయన పులి అయితే ప్రతిపక్షాలంటే ఎందుకు భయపడు తున్నారని, ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యే పథకాలతో ప్రజల ముందుకు వస్తామని మంత్రి హరీశ్‌రావు అంటున్నారని, ఇప్పటికే ప్రజల మైండ్‌లను నాశనం చేశారని ప్రవీణ్ విమర్శించారు.
ఈసీకి ఫిర్యాదు చేస్తాం
ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అనేక జిల్లాల్లో కీలక పదవుల్లో తమ అడుగులకు మడుగులు ఒత్తే అధికారులను బీఆర్‌ఎస్ పార్టీ నియమించుకుందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అందరి వివరాలతో జాబితా రెడీ చేస్తున్నామని, త్వరలోనే ఎన్నికల కమిషన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వివిధ పదవుల నుంచి రిటైరైన కేసీఆర్ కుటుంబ సభ్యులు, దూరపు బంధువులకు ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఎన్నికలు ముగిసేవరకు వారిని ఆ పోస్టులకు దూరంగా ఉంచాలని ఈసీని కోరారు. కొందరు అధికారులు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత తేదీలతో సంతకాలు చేస్తున్నారని, ఆ వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, కమ్యూనిస్టులు కమ్యూనిజాన్ని మరిచిపోయి దొరల గడీల దగ్గర కాపలా కాస్తున్నారని ఆయన విమర్శించారు.
119 నియోజకవర్గాల్లో పోటీ
రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ 119 నియోజ కవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు 1,300 దరఖాస్తులు తమకు అందాయన్నారు. ఇందులో మేధా వులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, స్కాలర్లు ఉన్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు.
బీఎస్పీ మేనిఫెస్టోలో కీలక అంశాలు
♦ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు పోడు పట్టాల పంపిణీ
♦ భూమి లేని వారికి కనీసం ఎకరం భూమి పంపిణీ
♦ ప్రతీ మండలంలో అంతర్జాతీయ ప్రమాణాల తో పాఠశాల
♦ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీ సౌకర్యంతో కూడిన కోచింగ్ సెంటర్లు
♦ ప్రతీ కుటుంబం నుంచి ఒకరు విదేశాల్లో విద్యనభ్యసించేలా ప్రణాళిక
♦ ఆయుఃప్రమాణం వందేళ్లకు పెంచేలా వైద్య రంగంలో మార్పులు
♦ మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌లో శిక్షణ
♦ పది లక్షల ఉద్యోగాల కల్పన, అందులో 50 శాతం మహిళలకు..
♦ కౌలు రైతులను ఆదుకునేలా విధానాలు
♦ జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులు.
Comments
Please login to add a commentAdd a comment