కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ద్రోహుల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోందని.. సమైక్యవాది చంద్రబాబుతో కలసి పనిచేస్తున్నవారు తెలంగాణ వ్యతిరేకుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై కక్షగట్టి, కుట్రలు చేసి నిందలు వేసి తెలంగాణవాదాన్ని దెబ్బతీయాలనుకున్న ద్రోహులంతా ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ పంచన చేరారని పేర్కొన్నారు. బ్యారేజీ పిల్లర్లు ఒకటో రెండో కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయిందంటూ విపక్షాలు పైశాచిక ఆనందంతో వికృత వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హరీశ్‌రావు ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ..
కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలతో పొత్తులతో ముందుకు వెళ్తున్నాయి. మీ ఒంటరి పోరు ఫలితాన్నిస్తుందా?
రాష్ట్రం ఏర్పడితే కొన్నిరోజులు అన్నం మానేసిన పవన్‌కల్యాణ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. టీడీపీతో కాంగ్రెస్ పరోక్షంగా పొత్తు పెట్టుకుంది. కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ద్రోహుల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోంది. తెలంగాణవాదాన్ని దెబ్బతీయాలనుకున్న ద్రోహులు కాంగ్రెస్, బీజేపీలను అడ్డం పెట్టుకుని తెలంగాణను, కేసీఆర్‌ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. సమైక్యవాది చంద్రబాబుతో కలసి పనిచేస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి తెలంగాణ ద్రోహులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన సమైక్యవాదులతో అంటకాగుతున్నారు. ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయని కిషన్‌రెడ్డి నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు సలహాదారు. తెలంగాణ ద్రోహుల పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేం తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉన్నాం. బీజేపీ, కాంగ్రెస్ మాకు సమాన ప్రత్యర్థులే.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు, నివేదికల సంగతేంటి?
నాయకులకు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశం లేదు. కాళేశ్వరం మునిగితే కేసీఆర్‌ను బద్నాం చేయ డం ద్వారా నాలుగు ఓట్లు సాధించే తాపత్రయం. కాళేశ్వరం అంటే 21 పంపుహౌస్‌లు, 22 లిఫ్ట్‌లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ పైప్‌లైన్, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన 19 రిజర్వాయర్లు, మూడు బ్యారేజీలు.. ఇంత భారీ ప్రాజెక్టులోని ఒక బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగితే కాళేశ్వరం మునిగిపోయిందంటూ పైశాచిక ఆనందంతో విపక్షాలు వికృత వ్యాఖ్యలు చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మీద నయాపైసా భారం పడకుండా టెక్నికల్ రిపోర్టుల ఆధారంగా ఏజెన్సీల ద్వారా పునరుద్ధరణ జరుగుతుంది. కాళేశ్వరానికి రూ.80వేల కోట్లు ఖర్చు పెడితే రాహుల్‌గాంధీ రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ మతిలేని మాటలు అంటున్నారు. ఇప్పటికే మల్లన్నసాగర్‌లో 20 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీలు, అనంతగిరి, రంగనాయక్ సాగర్‌లలో మూడేసి టీఎంసీలు, మిడ్‌మానేరులో 25 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.
బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలపై మీ స్పందన?
రైతుబంధు, ఆసరా వంటి మా పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టింది. గతంలో నీటి తీరువా, భూమిశిస్తు, కరెంటు బిల్లులు, మార్కెట్ శిస్తు రూపంలో రైతుల ముక్కుపిండి వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. అవన్నీ బంద్ చేసి ‘రైతుబంధు’తో ఆదుకుంటున్నది కేసీఆర్. కానీ కాంగ్రెస్ రైతులను అవమానిస్తూ రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి లేఖలు రాసింది.
మీ ప్రచారంలో కాంగ్రెస్ కర్ణాటక నేతలపై విమర్శలు ఎందుకు?
ఇక్కడి ప్రజాసమస్యలను గాలికొదిలేసి తెలంగాణలో ‘కర్ణాటక మోడల్’ అమలు చేస్తామనడం తెలంగాణ పురోగతిని 20 ఏళ్లు వెనక్కి నెట్టడమే. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయని గతంలో తెలంగాణ ప్రజలకు అనుభవమే. 24గంటలు ఇస్తున్నచోట 5 గంటలు ఇచ్చేవాళ్లు ప్రచారం చేయడం విడ్డూరం. కర్ణాటక నుంచి తెచ్చిన డబ్బుతో తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. నేతలను అంగడి సరుకులా కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
బీజేపీ ‘బీసీ సీఎం’ ప్రకటనపై...
‘తల్లిని చంపి బిడ్డను తీశారు’ అని తెలంగాణ ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీకి ఇక్కడి ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. బీసీల మీద ప్రేమ ఉంటే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.
గజ్వేల్‌లో ఈటల రాజేందర్ పోటీపై...
గజ్వేల్‌లో కేసీఆర్ కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. కేసీఆర్ గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చారు. వందేళ్ల అభివృద్ధిని పదేళ్లలోనే చేసి చూపించారు. సీఎంపై పోటీ ద్వారా తాను పెద్ద నాయకుడినని చెప్పుకోవడానికి ఈటల ప్రయత్నిస్తున్నారు.
సిద్దిపేటలో మీ మెజారిటీ రికార్డును మళ్లీ బ్రేక్ చేస్తారా?
పార్టీ కోసం పనిచేయడం నా బాధ్యత. నిరంతరం నియోజకవర్గ ప్రజల నడుమ ఉంటూ శక్తివంచన లేకుండా వారి కష్టసుఖాల్లో తోడున్నా. వారంతా నా కుటుంబ సభ్యులు. ఈసారి ఎన్నికల పరీక్షలోనూ మంచి మార్కులు వేస్తారనే భావిస్తున్నా.
మైనంపల్లి హన్మంతరావు మీపై ఆరోపణలు ఎందుకు చేశారు?
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 90 శాతం మందికిపై టికెట్లు ఇచ్చాం. అందువల్ల కొందరు ఆశించినవి నెరవేరలేదు. మైనంపల్లికి, ఆయన కుమారుడికి టికెట్ ఇస్తేనే బీఆర్‌ఎస్, కేసీఆర్, హరీశ్ మంచివారు, లేకపోతే కాదా? మైనంపల్లి తన కుటుంబం కోసమే తప్ప ప్రజల కోసం ఆలోచించలేదని స్పష్టమవుతోంది.
బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతల ప్రచారాన్ని ఏమంటారు?
టికెట్ల కోసం ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు.. చివరికి ప్రచారం కోసం కూడా ఆ నాయకులపైనే ఆధారపడటం సిగ్గుచేటు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉత్తరాది నేతల కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారు. రేపు పాలన కూడా ఢిల్లీ నేతల రిమోట్‌లోనే ఉంటుంది. కేసీఆర్ ఉండగా పరాయిపాలన అవసరమా?
కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
రాబోయే రోజుల్లో మీ ప్రచార సరళి ఎలా ఉండబోతోంది?
హుస్నాబాద్ సహా ఉమ్మడి మెదక్‌లోని 11 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూనే పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రచారంలో పాల్గొంటున్నా. మొదటి దశలో సీఎం ప్రచార సభలు పూర్తయిన చోట అవసరాన్ని బట్టి, పార్టీ వ్యూహం మేరకు నేను, కేటీఆర్ పర్యటనలు చేస్తాం.
దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని ఎలా చూస్తున్నారు?
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీని వెనుక కాంగ్రెస్, బీజేపీ నాయకులు సహా ఏ ఇతర శక్తులున్నా వదిలి పెట్టేది లేదు. రాష్ట్రంలో ప్రత్యర్థులను నిర్మూలించే సంస్కృతి లేదు. ఆస్పత్రిలో ఉన్న ప్రభాకర్‌రెడ్డితో నామినేషన్ వేయించేందుకు ఎలా తరలించాలనే అంశంపై వైద్యులతో మాట్లాడుతున్నాం. ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం, అవసరమైతే దుబ్బాక ఎన్నికల ప్రచార బాధ్యత కూడా తీసుకుంటా.
Comments
Please login to add a commentAdd a comment