చట్టసభ ల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే సహజ వనరులకు సంబంధించిన బ్యాలెన్స్ ప్రకటించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త ప్రొ.కె.పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత అదే వర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా, హెచ్‌ఓడీగా, చైర్మన్ బోర్డ్‌ఆఫ్ స్టడీస్‌గా, ఓయూ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందించారు.
1990కు ముందు నుంచే వివిధరూపాల్లో పెరుగుతున్న వాయు, నీరు, వాతావరణ కాలుష్యాలపై గొంతెత్తి పోరాడారు. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికితీసే ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతర సంస్థలతో కలిసి పోరాడి విజయం సాధించారు. పర్యావరణ అంశాలతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై సాక్షి ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.... - ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి
పబ్లిక్ డొమైన్ లో ఆ వివరాలు ఎక్కడ ?
ప్రతీ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్‌కు సహజ వనరుల బ్యాలన్స్ షీట్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు.పబ్లిక్ డొమైన్‌లో ఈ వివరాలు పెట్టాల్సి ఉన్నా ఎక్కడా ఆ సమాచారం లేదు. ప్రజలకు ఈ వివరాలు తెలిస్తేనే కదా.. ఆయా అంశాలపై అవగాహన ఏర్పడి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దేశంలోని సహజవనరులు, ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటని తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, లోకాయుక్తలు ఏ విధంగా పని చేయగలుగుతాయి.
పేరుకు మాత్రమే నీతి ఆయోగ్ (గతంలో ప్రణాళికా సంఘం) వంటివి ఉన్నా... సహజ వనరుల తరుగుదల ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా దేశాభివృద్ధిని, పురోగతిని ఎలా అంచనా వేస్తాయి? రైతులకు అందజేయాల్సిన ఆధునిక సాంకేతికత, దాని ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను అస్సలు పట్టించుకోవడం లేదు. సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయ పద్ధతులు, సహజవనరుల పరిరక్షణపై ఎలాంటి దిశానిర్దేశం లేకుండా పోయింది.
ఇసుక రవాణా తీవ్రమైన పర్యావరణ సమస్య...
అన్ని రాష్ట్రాల్లో సహజవనరు ఇసుక యథేచ్ఛగా దోపిడీకి గురవుతోంది. ఇసుక, గుట్ట లు, కొండలు, అడవి, ఇతర సహజవన రులు దేశప్రజల ఉమ్మడి ఆస్తి. అధికారంలో ఉన్న పార్టీ ఇష్టారీతిన తవ్వి అమ్ముకోడానికి కాదు. వాగుల్లో ఇసుక లేక పోతే నీరు రీచార్జ్ కాదు. గుట్టలు తొలగిస్తే దాని ప్రభా వం కూడా పర్యావరణ వ్యవస్థపై పడుతుంది. అధికార పార్టీ నేతలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే చర్యలు పేదల పాలిట శాపాలుగా మారుతున్నాయి.
స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి
ప్రస్తుతం రాజకీయపరమైన అధికారాలన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీల వద్ద కేంద్రీకృతమై ఉన్నాయి. రాజ్యాంగపరంగా గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్ధానిక సంస్థల వంటి స్థానిక ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు కేటాయించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించకుండా హక్కుల రక్షణకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఎస్‌ఈసీ) ఏర్పాటు చేశారు.
ఆ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎస్‌ఈసీలకు అప్పగించినా..అవి రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరించి, స్వతంత్రంగా పనిచేసే స్థాయికి ఎదగలేదు. తమ పరిధిలో నిష్పక్షపాత నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో వున్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో పనిచేసే శాఖలుగా మారిపోవడం విషాదకరం.
రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు
లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ వంటివి కేవలం ఆకారపుష్టిగానే మిగిలిపోయాయి. ఇక సమాచారహక్కు కమిషనర్ల నియామకమే జరగడం లేదు. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా రాష్ట్రప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇలాంటి ముఖ్యమైన అంశాలు చర్చకు రావడం లేదు. కులం,మతం, ప్రాంతం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారు. గతంతో పోలి్చతే ఇప్పుడు ప్రజాసమస్యలనేవి ఏమాత్రం ప్రధానచర్చకు రావడం లేదు.
ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉందా ?
ఎన్నికలనేవి ఎమ్మెల్యేల అభ్యర్థులకు వ్యాపారంగా మారిపోవడం విషాదకరం. రాజకీయపార్టీలు కూడా సిగ్గులేకుండా ఎన్నికోట్లు ఖర్చుచేస్తారనే దాని ప్రాతిపదికన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు అసలు పోటీ చేయాలని కనీసం ఆలోచన చేసే, సాహసించే పరిస్థితులే లేకుండా పోయాయి.
సుస్థిర అభివృద్ధిపై హామీ ఏదీ?
అటు కేంద్ర, ఇటు రాష్ట్రప్రభుత్వాలు దేశ, రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి గురించి స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే ఎలా? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన ప్యారిస్ అగ్రిమెంట్‌లో సంతకం పెట్టి భారత్ భాగస్వామి అయినా...వాటిని సాధించే దిశలో మాత్రం అడుగులు వేయకపోవడం విచారకరం. ఈ విషయంలో మన దేశం వ్యవహారశైలి తీసికట్టుగా ఉంది.
పర్యావరణ అంశాలపై ..
దేశంలో ప్రవహించే ప్రతీ నదిలో ప్రవహించే నీరు విషతుల్యంగా మారుతోంది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో...వాయునాణ్యత తీసికట్టుగా మారి దేశవ్యాప్తంగా పీల్చే గాలి విషంగా మారుతోంది. జీవవైవిధ్యమే పూర్తిస్థాయిలో దెబ్బతింటోంది. దీంతో మొత్తం దేశమే ఓ గ్యాస్‌చాంబర్‌గా మారుతోంది. ఈ అంశాలేవి కూడా అటు లోక్‌సభ ఎన్నికల్లో, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా చర్చనీయాంశం కావడం లేదు. అసలు ఈ సమస్యలకు ప్రాధాన్యత లేదన్నట్టుగా రాజకీయపార్టీలు పట్టించుకోవడం లేదు.
-కె. రాహుల్
Comments
Please login to add a commentAdd a comment