మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్న దివ్యవాణి
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడతూర్పు): ‘నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. అచ్చెన్నాయుడి మాదిరిగా పార్టీ లేదు బొక్కా లేదు అనలేదు. సాధినేని యామినిలా విమర్శలు చేయలేదు. నారీభేరీకి డబ్బులు తీసుకుని మేకప్ వేసుకుని కూర్చోలేదు. ఇప్పుడు నన్ను తప్పుబడుతున్న వాళ్లు అచ్చెన్నని ఏం శిక్షించారు. టీడీ జనార్దన్‌ను ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బందులు పెట్టారు. ఏడాది కాలంగా నన్ను అవమానించి నరకం చూపించారు. గౌరవం లేనిచోట ఉండలేను. అందుకే టీడీపీకి రాజీనామా చేసి ఆ లేఖను పార్టీకి పంపుతున్నా..’ అని సినీనటి దివ్యవాణి చెప్పారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం గురువారం విజయవాడలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని చాలామంది చెప్పినా వినలేదని, వారు చెప్పినట్టే పార్టీలో తనకు అన్యాయం జరిగిందని కన్నీరు పెట్టుకున్నారు. ఏడాది కాలంగా తనకు ప్రాధాన్యత లేకపోవడానికి దారితీసిన కారణాలను వివరించిన దివ్యవాణి టీడీపీ నేతల తీరుపై సంచలన కామెంట్లు చేశారు. దివ్యవాణి ఇంకా ఏమన్నారంటే..
పార్టీ కోసం బాలకృష్ణకంటే నేనే ఎక్కువ పనిచేశా
మత మార్పిళ్లపై చంద్రబాబు చేసిన కామెంట్ల వల్ల క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. నిజం మాట్లాడినందుకు నన్ను టార్గెట్ చేశారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే ఆయనకంటే ముందు నేనే కౌంటర్ ఇచ్చాను. ఈ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కానీ పార్టీలో జరుగుతున్నవి చెబితే టీడీపీ నేతలే నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నన్ను విసుక్కున్నా నేనేం బాధపడలేదు. చంద్రబాబు చుట్టూ దొంగలున్నారు. వాళ్లంతా చంద్రబాబుతో మాట్లాడనివ్వలేదు. చంద్రబాబు పీఏ రాజగోపాల్ చాలాసార్లు అవమానించాడు.
పార్టీలో ఏం జరుగుతున్నదీ లోకేశ్‌కు చెబితే ఆయన టీడీ జనార్దన్‌కు చెప్పమన్నారు. చంద్రబాబుకు కళ్లు, ముక్కు, చెవులు అంతా తానై వ్యవహరించే జనార్దన్ నన్ను చాలాసార్లు అవమానించాడు. జనార్దన్‌ను ప్రశ్నించినందుకు నరకం చూపించారు. పార్టీకోసం బాలకృష్ణ కంటే నేనే ఎక్కువగా పనిచేశాను. బాలకృష్ణ ఏనాడైనా అమరావతిలో బిడ్డల దగ్గరకు వచ్చారా? కరోనా టైమ్‌లో నేను నా కుటుంబాన్ని వదిలి అమరావతికి వచ్చి పార్టీకోసం పనిచేశాను. మహానాడులో ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం తీర్మానం చేయలేదు. అన్ని జిల్లాల్లో ఏం జరిగిందో కూడా తెలుసుకోలేదు. మహానాడులో గ్రీష్మ అలా మగాళ్ల దగ్గర తొడగొట్టడం మంచి పద్ధతి కాదు.
అనితకు డబ్బులిచ్చి మేకప్ వేయించి నారీభేరీ నిర్వహించారు. ప్రెస్‌మీట్ పెట్టడానికి నలుగురి దగ్గరకి తిప్పేవారు. నన్ను కుక్కపిల్లలా ఆడుకున్నారు. నేను ఇచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్‌మీట్ పెట్టించారు. నాలాగా పార్టీలో ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. టీడీపీలో ఆడవాళ్లకు అవకాశాలు రావాలంటే ఆ నలుగురి చుట్టూ తిరగాలి. ఆ నలుగురికి ఏం కావాలంటే అది చేస్తేనే పదవులు.
అందుకే టీడీపీ నుంచి జయసుధ, జయప్రద బాధతో వెళ్లిపోయారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని నన్నపనేని రాజకుమారి నాకు స్వయంగా ఫోన్‌చేసి ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించాను. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. నాకు ఇలాంటిరోజు వస్తుందని భావించలేదు. నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా? కొందరు ఇడియట్స్ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు.
పిచ్చిదానిలా టీడీపీలో చేరతావా అన్నారు..
పిచ్చిదానిలా టీడీపీలో చేరతావా? వైఎస్సార్‌సీపీలో అయితే బాగుంటుంది. వైఎస్సార్‌సీపీలో నమ్మినవారికి ద్రోహం జరగదని ఎంతోమంది శ్రేయోభిలాషులు చెప్పినా వినకుండా టీడీపీలో చేరాను. మూడున్నరేళ్లుగా టీడీపీకి సేవలు చేశాను. టీడీపీలో ఉన్నందుకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా పోయాయి. నా నోటికాడ భోజనం పోయింది. అది కూడా నేను ఎవరికీ చెప్పుకోలేదు. నా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని పార్టీకోసం పనిచేశాను. చంద్రబాబు కోసం మోదీపైన విమర్శలు చేశాను.
చదవండి: చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా?: దివ్యవాణి
ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బతకాలంటే ధైర్యంగా బయటకు రావాలి
ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బతకాలంటే తనలాంటి వారు ధైర్యంగా బయటకు వచ్చి టీడీపీలో జరుగుతున్నది ఏమిటో నిజాలు చెప్పాలి. ఎన్టీఆర్‌పై అభిమానంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొడుక్కి ఎన్టీఆర్ పేరు పెట్టారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌పై అభిమానంతో మాట్లాడుతుంటారు. అటువంటి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో పాములు పుట్ట పెట్టాయి. వాటిని పిల్లల దశలోనే చంపకపోతే అందర్నీ కాటేస్తాయనే ఆవేదనతో గుండె పగిలి ఈ నిర్ణయం తీసుకున్నా.. అని దివ్యవాణి చెప్పారు. తాను ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేనని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment