మేమొస్తే పాతబస్తీ.. భాగ్యనగరమే | GHMC Elections 2020: BJP President Bandi Sanjay Interview With Sakshi | Sakshi
Sakshi News home page

మేమొస్తే పాతబస్తీ.. భాగ్యనగరమే

Published Mon, Nov 23 2020 4:02 AM | Last Updated on Mon, Nov 23 2020 8:33 AM

GHMC Elections 2020: BJP President Bandi Sanjay Interview With Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ‘మాకు ఉత్తి మాటలు చెప్పడం రాదు... హైదరాబాద్‌ను ఇస్తాంబుల్, డల్లాస్‌లా చేస్తామని మేం చెప్పం. మాకు గ్రేటర్‌ ప్రజలు మేయర్‌ పదవిని అప్పగిస్తే ఇండోర్, సూరత్, అహ్మదాబాద్‌లాగా అభివృద్ధి చేసి తీరుతాం. భాగ్యనగరాన్ని పాతబస్తీలా చేయడం కాదు... పాతబస్తీని భాగ్యనగరంగా చేస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. జీఎహెచ్‌ఎంసీ ఎన్నికల పేరుతో హైదరాబాద్‌ను ఎంఐఎంకు అప్పగించి, హైదరాబాద్‌ నుంచి హిందువులను తరిమి వేస్తారా.. అని తాను అడిగితే మతతత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

భాగ్యలక్ష్మి  దేవాలయానికి వెళితే మతతత్వం అవుతుందా? ఆ దేవాలయం పాతబస్తీలో ఉందా? పాకిస్థాన్‌లో ఉందా? అన్నది సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ దృష్టిలో పాతబస్తీ ప్రజలు పాకిస్థాన్‌ వాదులా? అని ప్రశ్నించారు. 80 శాతం ఉన్న హిందువులపట్ల టీఆర్‌ఎస్, ఎంఐఎం వివక్ష చూపుతోందని, అవమానించేలా వ్యవహరిస్తోందని అన్నారు. అందుకే మెజారిటీ ప్రజల ఆత్మాభిమాన్ని కాపాడేందుకు, భరోసా ఇవ్వడానికి బీజేపీ వెనుకడుగు వేయదన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, అభివృద్ధి చేసేందుకు బీజేపీ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో భాగ్యనగరాన్ని పాతబస్తీగా మార్చే పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు.

‘దేశంలోని 30 కోట్ల మంది ముస్లింలను వెళ్లగొడతారంటూ రెచ్చగొట్టింది ముఖ్యమంత్రి సీఎం కేసీఆరే. ముస్లింల ఓట్ల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదీ ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ పార్టీలే. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటమే అందుకు నిదర్శనం’అని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘సాక్షి’ఇంటర్వ్యూలో వెల్లడించిన మరిన్ని అంశాలు ఆయన మాటల్లో...

భరోసా ఇవ్వని టీఆర్‌ఎస్‌పట్ల వ్యతిరేకత..
టీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం, ప్రజాసమస్యల పరిష్కారంలో అలసత్వం, ఆపద సమయంలో భరోసా ఇవ్వలేని నిస్సహాయత... వెరసి ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీజేపీకి అధికారం రాలేదు.. సేవ చేసే అవకాశమే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ అధికారం, అవకాశాన్ని ప్రజలు బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

జీహెచ్‌ఎంసీలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. 5 ఏళ్ల కిందట అధికారంలో మేమే ఉన్నాం.. జీహెచ్‌ఎంసీలో గెలిపిస్తేనే హైదారాబాద్‌ అభివృద్ధి జరుగతదని టీఆర్‌ఎస్‌ చెప్పింది. ఆచరణ సాధ్యం కాని హామీలు, మాయమాటలు, అబద్ధాలతో గెలిచింది. ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వచ్చింది. అయితే ప్రజలు మళ్లీ అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా లేరు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌ అని సీఎం అన్నారు. కానీ, అదే మేనిఫెస్టోను వారి వెబ్‌సైట్‌ నుంచే డిలీట్‌ చేశారంటే వారి నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. కోవిడ్, వరదల సమయంలో సీఎం స్పందించకపోవడం, ఆపదలో ఉన్న వారిని పట్టించుకోకపోవడం, భరోసా నింపకపోవడం వల్ల ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఆదుకోని సీఎం, పట్టించుకోని ప్రభుత్వం మాకెందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి కాదు.. కనీసం ఆదుకోవడం లేదన్న ఆవేదనతో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ సమస్యలకు కారకులెవరు?
జీహెచ్‌ఎంసీలో ఎక్కడా రోడ్లు సరిగ్గా లేవు. డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు కబ్జా అయ్యాయి. మొన్నటి వర్షాలకు నీళ్లు రోడ్లపైకి వచ్చాయంటే.. అందుకు కారణం చెరువులను టీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేయడమే. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికార పార్టీ నేతలు మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. అందులో నీళ్లను కొబ్బరినీళ్లలా చేస్తామన్నారు. ఆ హామీలు ఏమయ్యాయి. డబుల్‌ బెడ్‌రూం పేరుతో కాలయాపన చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయడం లేదు. కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. ఇలా ప్రజలు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు.

టీఆర్‌ఎస్‌ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి. మూసీ ప్రక్షాళన చేసిందా? డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చిందా.. రోడ్లను అభివృద్ధి చేసిందా? చెరువులు కబ్జా కాకుండా ఆపిందా.. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసిందా? భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌ వరదల పాలు కావడానికి కారణం ఎవరు? కోవిడ్‌కు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించిందెవరు? ఇలాంటి వారికి అధికారం ఇవ్వాలా? వీటన్నింటికీ టీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలి.

కేంద్ర నిధులతోనే అంతోఇంతో అభివృద్ధి ..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. నిధులను ఇస్తోంది. ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే కేంద్రం నుంచి వచ్చిన నిధుల వల్లే. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పూర్తిగా అభివృద్ధికి వెచ్చించకుండా దారి మళ్లించారు. కొన్ని కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు, ఫొటోలు మార్చి వాళ్ల పథకాలుగా చెప్పుకున్నారు. కొన్నింటిని అమలు చేయడం లేదు. ప్రజలు వాస్తవాలు ఆలోచించాలి. హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేస్తాం. 

సవాల్‌ విసిరినా ముందుకు రాలేదు..
హైదరాబాద్‌లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే సాధ్యమైంది. కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలపై, పథకాల అమలుపై ఛాలెంజ్‌ చేశాం. అయినా చర్చకు టీఆర్‌ఎస్‌ ముందుకు రాలేదు. గతంలో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది. 

డల్లాస్‌ కాదు.. అంతా డొల్ల
బీజేపీ గెలిస్తే ఫ్లైఓవర్లకే పరిమితం కాకుండా బస్తీలను కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చేస్తాం. అందుకోసమే ప్రణాళికలు రూపొందిస్తాం. బస్తీల్లోని ప్రజలు కనీస సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తాం. కేవలం ఫ్లైఓవర్లు కాదు.. లండన్, ఇస్తాంబుల్, డల్లాస్‌ కాదు.. దేశంలోని ఇండోర్, సూరత్, అహ్మదాబాద్‌ లాగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. డల్లాస్‌కు సాధారణ ప్రజలు వెళ్లలేరు. చూడలేరు. ఇక్కడ అభివృద్ధిని ప్రజలు చూడొచ్చు. ఇండోర్‌ అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే. వాటిలెక్క భాగ్యనగరాన్ని చేస్తాం. ఆ ధైర్యం మాకు ఉంది. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్‌లాగా చేస్తామన్నారు. ఏమీ లేదు. అంతా డొల్ల. అహ్మదాబాద్‌లో 15 ఏళ్లుగా మత కలహాలు జరగలేదు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధే జరిగింది. టీఆర్‌ఎస్‌లా మేం మాయమాటలతో మోసం చేయడంలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement