‘‘దేశానికి అన్నం పెట్టే అన్నదాత రుణం మనందరం తీర్చుకోవాలి. ఎక్కడ రైతు బాగుంటాడో అక్కడ నాగరికత, సమాజం, సంస్కృతి బాగుంటాయి. దేశానికి వెన్నెముక అయిన రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేదే నా ‘రైతన్న’ చిత్రం’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతన్న’ సినిమా ఈ నెల 14న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ‘రైతన్న’ నేపథ్యం, ఇతర విశేషాలను నారాయణమూర్తి ఈ విధంగా చెప్పారు.
► ఈ భూమిపైన ఎవరు ఏ వస్తువు తయారు చేసినా వాళ్లే ధర నిర్ణయిస్తారు. అదేం ఖర్మో కానీ ఆది నుంచీ కూడా రైతులకు పెట్టడమే తెలుసు.. దోచుకోవడం తెలియదు.. దాని వల్ల ఇప్పటికీ కూడా మా పంటకు ఇంత ధర ఇవ్వండి అని అడగలేకపోతు న్నారు. అది రైతుల మంచి మనస్సుకు, గొప్పతనానికి నిదర్శనం. దాన్ని ఆసరాగా చేసుకుని దళారులు మార్కెట్లలో రైతుల్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఒక ధర నిర్ణయించి, ఆ ధరకు పంటలు కొనుగోలు చేయమని ఆదేశించినా అక్కడున్న సొసైటీల్లోని సిబ్బంది, అధికారులు, మిల్లర్లు తరుగు పేరు చెప్పి దారుణంగా దోచుకుంటున్నారు. పెట్టడమే తప్ప దోచుకోవడం తెలియని రైతులు తమలో తాము కుమిలిపోతున్నారే కానీ ప్రశ్నించలేకపోతున్నారు. మా సినిమాలో వాటిని ప్రశ్నించాం.
► విత్తనాలు, కూలీలు, ఎరువులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తీరా పంట చేతికొచ్చాక అమ్మితే గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారు. రైతులు పండించిన పంటలతో వ్యాపారం చేసేవాళ్లు కోటీశ్వరులు అవుతున్నారు. కానీ రైతులు మాత్రం బికారీ అవుతున్నారు. దేశానికి రైతే వెన్నెముక అంటారు. కానీ వారు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అయినా ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాలనూ ‘రైతన్న’లో ప్రస్తావించాం.
► కరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు. కానీ అన్నదాతలు మాత్రం పొలం బాట పట్టి ఏడాదికి మూడు పంటలు పండించి దేశం ఆకలితో బాధపడకుండా చూశారు. అలాంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక, సాగు ఖర్చులు రాక అప్పుల బాధతో అర్ధాకలితో ఉంటే పాలకులు పట్టించుకోరా? పంటలకు సరైన మద్దతు ధర వస్తే అన్నదాతలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వారి కుటుంబాలు ఎందుకు రోడ్డున పడతాయి? అని ప్రభుత్వాలు ప్రశ్నించుకోవాలి. అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు వచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి.
► కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల తమకు తీరని నష్టం అని, వాటిని రద్దు చేయాలని ఢిల్లీ వేదికగా అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రంలో మార్పు రావడం లేదు. నూతన వ్యవసాయ సాగు చట్టాలను రెండేళ్ల పాటు అమలు చేయొద్దని, నూతన కమిటీ వేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. రైతులతో పలుమార్లు చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు మాత్రం చర్యలు తీసుకోకుండా మళ్లీ మళ్లీ చర్చలకు ఆహ్వానించడంలో ఆంతర్యం ఏంటి?
► కార్పొరేట్ వ్యవసాయం తొలుత లాభదాయకంగా ఉన్నా ఆ తర్వాత వారు చెప్పిన ధరలకే పంటలను అమ్ముకోవాల్సి వస్తుంది.. దీంతో రైతులే వారి పొలాల్లో కూలీలుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశంలో 75శాతం ఉన్న వ్యవసాయం ప్రస్తుతం 52 శాతానికి పడిపోయింది. ఆ 52 శాతంలో 41 శాతం కౌలు రైతులే ఉన్నారు. ‘పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడం వల్లే సాగు అప్పులు పెరిగి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వారి ఆత్మహత్యలు ఆగాలంటే వారి కష్టానికి అదనంగా 50 శాతం గిట్టుబాటు ధర కల్పించాలి’ అంటూ 2006లో డా.స్వామినాథన్ కమిటీ యూపీఏ ప్రభుత్వానికి నివేదికలు అందించింది.. కానీ ఇప్పటివరకూ అమలు పరచడం లేదు. అవి అమలైతేనే రైతులు సంతోషంగా ఉంటారు.
► బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్వింటాలు (100 కిలోలు) ధాన్యం గతంలో 1800 ధరకు విక్రయిస్తుండగా ప్రస్తుతం 800 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రా లు కచ్చితంగా ఉండాలి. ప్రైవేటు వారు కూడా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసేలా చట్టాలు తీసుకురావాలనే విషయాన్ని కూడా చూపించాం.
► రైతుల సమస్యలేంటి? ప్రభుత్వ వాదనలు ఏంటి? వాటి పరిష్కారం ఎలా? అనే విషయాలను ‘రైతన్న’లో చూపించాం. రైతు కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కూడా ముందుకు రానివారు ఉంటే ఆ రైతుల మనోవేదన ఎలా ఉంటుంది? అనే విషయాలను కూడా మా చిత్రంలో ప్రస్తావించాం. రైతులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు... ఇలా అందరూ చూడాల్సిన సినిమా మా ‘రైతన్న’.
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది
Published Thu, Aug 12 2021 12:59 AM | Last Updated on Thu, Aug 12 2021 12:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment