(బోణం గణేష్, సాక్షి ప్రతినిధి) : ఐదు కేజీల తుపాకీని చేత్తో పట్టుకుని.. 20 కేజీల బరువును ఒంటిపై మోస్తూ.. యాభై మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను గురి చూసి కొట్టడమంటే అంత తేలికైన విషయం కాదు. ఆ తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్‌కు ఉన్నంత పవర్ దానిని పట్టుకున్న వ్యక్తికీ ఉండాలి. అత్యంత ఏకాగ్రతతో కఠోర సాధన చేస్తే తప్ప ఇలాంటి అద్భుతాలు సాధ్యం కావు. షూటర్‌గా 15 ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో ఒకేసారి ఇరవై ఈవెంట్లలో పాల్గొని వరల్డ్ రికార్డు సృష్టించిన విజయవాడకు చెందిన మద్దినేని ఉమా మహేశ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. ఆయన మాటల్లోనే..
నాన్న ప్రోత్సాహంతో తొలి అడుగు
ఆరేడేళ్ల వయసు నుంచే నాన్న రామకృష్ణ ప్రోత్సాహంతో క్రీడలను సీరియస్‌గా తీసుకున్నాను. తొలుత క్రికెట్, కరాటే, బాస్కెట్‌బాల్ నేర్చుకున్నాను. పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. విజేతగా కూడా నిలిచాను. మా నాన్న సూచనతో 2017 నుంచి షూటింగ్‌పై దృష్టి సారించాను. మొదట గుంటూరులో శిక్షణ తీసుకున్నాను. 2018లో ఢిల్లీ వెళ్లి దీపక్ దూబియా వద్ద శిక్షణ మొదలుపెట్టాను. అప్పటి నుంచి పలు పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచాను.
జూనియర్ వరల్డ్‌కప్‌లో గోల్డ్ మెడల్..
ప్రముఖ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ పూణేలో నిర్వహించే శిక్షణకు ఎంపికయ్యాను. దేశవ్యాప్తంగా కేవలం ఐదుగురినే ఆయన ఎంపిక చేసుకుంటారు. అప్పటి నుంచి నేహా దూబియా నాకు పర్సనల్ కోచ్‌గా ఉన్నారు. ఆమె శిక్షణలో 2022 షూటింగ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో గోల్డ్‌మెడల్ సాధించాను. నాలుగు సార్లు ‘ఖేలో ఇండియా’లో పాల్గొన్నాను. యూనివర్సిటీలు, స్కూల్ నేషనల్స్‌లోనూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 15 ఏళ్ల వయసులో భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 20 ఈవెంట్స్‌లో పాల్గొని వరల్డ్ రికార్డ్ సాధించాను. వరల్డ్ చాంపియన్‌షిప్, ఏసియన్ చాంపియన్íÙప్‌లోనూ మెడల్స్ వచ్చాయి. షూటింగ్ క్రీడలో ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ ఆటగాడిని నేనొక్కడినే.
ఇంటి కష్టం కన్నా గన్ బరువే ఎక్కువని తెలుసు
ఈ ఆట కోసం 25 కేజీల బరువును దాదాపు గంటన్నర పాటు మోయాలి. గన్ బరువే 5 కేజీలుంటుంది. నా ప్రతిభ వెనుక అమ్మ మంజుల, నాన్న రామకృష్ణ కష్టం చాలా ఉంది. చిన్న వ్యాపారం చేసుకునే మా నాన్నే దగ్గరుండి నాకు కావాల్సినవన్నీ చూసుకునేవారు. షూటింగ్‌కు ఏకాగ్రత చాలా ముఖ్యం. అది దెబ్బతినకూడదని ఇంటి ఇబ్బందులు, ఆరి్థక పరిస్థితి గురించి నాకు చెప్పేవారు కాదు. ఆటల్లో పడి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్నాను. జర్మనీలో బొండెస్లేగా లీగ్‌లు జరుగుతుంటాయి. ఒక్కో క్లబ్ ఒక విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకుంటాయి. ఈ ఏడాది భారత్ నుంచి నన్ను ఒక్కడినే తీసుకున్నారు. ఐదు ఒలింపిక్స్ ఆడిన హంగేరీ కోచ్ పీటర్ సీడీ నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. తమ దేశం తరఫున ఆడాలని జర్మనీ క్లబ్‌లు అడిగాయి. కానీ మన దేశం తరఫున ఆడి గెలవడమే నాకు ఇష్టం.
‘ఆడుదాం ఆంధ్రా’ గొప్ప కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా బాగుంది. ఈ కార్యక్రమం ద్వారా విజేతలకు భారీగా బహుమతులను అందించడం, క్రీడా సామగ్రిని సమకూర్చడం గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమలోని క్రీడా ప్రతిభను చాటి చెప్పాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.
ఆర్థిక చేయూతనిస్తే.. అద్భుత విజయాలు సాధిస్తా
50 మీటర్ల రైఫిల్ షూటింగ్ శిక్షణకు రోజుకు కనీసం రూ.10 వేలు ఖర్చుయ్యేది. నాకు గన్ కూడా లేదు. కొత్తది కొనాలంటే రూ.15 లక్షల వరకు అవసరం. దీంతో పోటీలకు పది రోజుల ముందే వెళ్లి గన్‌ను అద్దెకు తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. ఓల్డర్ కంపెనీ గన్స్‌నే షూటర్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఆ కంపెనీ సీఈవో జర్మనీలో తమ సంస్థను సందర్శించేందుకు నన్ను ఆహ్వానించారు. ఆ కంపెనీ వాళ్లు నా కోసం ప్రత్యేకంగా గన్‌ను సిద్ధం చేశారు. కానీ దాన్ని కొనగలిగేంత ఆరి్థక స్థోమత మాకు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరి్థకంగా చేయూతనిస్తే మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తాను. భారత్ తరపున ఒలింపిక్స్ ఆడి గెలవాలనేది నా లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment