సానియా మీర్జాతో సాకేత్ మైనేని
సాక్షి ప్రతినిధి–అమరావతి): పదకొండేళ్ల వయసులో తండ్రిని చూసి రాకెట్ పట్టిన బాలుడు.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో జత కట్టే స్థాయికి ఎదిగాడు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడల్లో రాణిస్తూ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు.. అతనే అర్జున అవార్డు గ్రహీత, మన ఆంధ్రప్రదేశ్ క్రీడా యువ కెరటం సాకేత్ మైనేని. ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై ముచ్చటించారు. రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధికి ఇది ఆరంభమని, గ్రామీణ క్రీడాకారులను గుర్తించడానికి ప్రభుత్వం వేసిన ఈ తొలి అడుగు అభినందనీయమని ప్రశంసించారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
కృష్ణమ్మ ఒడి నుంచి క్రీడా రంగంలోకి..
కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మించినప్పటికీ పెరిగిందంతా విశాఖపట్నంలోనే. చిన్నప్పటి నుంచీ క్రీడలపై ఆసక్తి ఉండేది. ఖోఖో, కర్రా–బిళ్లా్ల, గోలీలు అంటూ ప్రతి ఆటా ఆడేసేవాడిని. మా నాన్న టెన్నిస్ ఆడుతుంటే చూసి నాకూ ఆడాలనిపించింది. అలా 11 ఏళ్లకే ఆ గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నా. 12 ఏళ్లకు విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచా. 13 ఏళ్ల వయసులో నాకు టెన్నిస్ శిక్షణ ఇప్పించడం కోసం అమ్మానాన్నలు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 17 ఏళ్ల వయసులో టెన్నిస్ స్కాలర్‌షిప్‌పై అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లాను.
అక్కడ కోచింగ్ సర్టిఫికేషన్ పొందాను. ఖర్చుల కోసం అక్కడి స్థానిక క్లబ్‌లో శిక్షణ ఇచ్చాను. అకడమిక్స్‌లో కూడా అగ్రస్థానంలో నిలిచాను. అత్యుత్తమ డబుల్స్ ర్యాంకింగ్ 74వ స్థానంలో ఉన్నాను. 2014లో చైనాలో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్‌లో సానియాతో జత కట్టి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం, సనమ్ సింగ్‌తో జోడికట్టి డబుల్స్‌లో రజత పతకం గెలవడం నిజంగా అద్భుతమైన అనుభూతి. దక్షిణాసియా క్రీడల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో 2016, 2019లో రజత పతకాలు సాధించా.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో నేను, సానియా మీర్జా మాత్రమే పతకాలు సాధించాం. సరదాగా ప్రారంభించిన ఈ క్రీడ చివరికి నా కెరీర్‌గా మారింది. ప్రస్తుతం డేవిస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం 2017లో అర్జున అవార్డుతో గౌరవిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, స్థలం మంజూరు చేయాలని నిర్ణయించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలి.. ఇండియాకే ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ తెచ్చివ్వాలనేది నా లక్ష్యం.
ఈ అద్భుత ప్రయత్నం కొనసాగాలి
ఏదైనా క్రీడలో తమ పిల్లవాడు రాణించేలా చేయాలంటే ఆ కుటుంబానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరి్థకంగానూ సమస్యలు వస్తాయి. అలాగే పిల్లవాడి చదువుపైనా ఆ క్రీడ ప్రభావం చూపుతుంది. సౌకర్యాలు లేకపోవడం ఆటంకంగా మారుతుంది. పాఠశాలకు వెళ్లి వచ్చేసరికే పిల్లాడు అలసిపోతుంటాడు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను టోర్నమెంట్‌లకు తీసుకెళ్లడానికి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది.
అయినా అన్నిటిలో గెలుస్తాడని గ్యారెంటీ ఉండదు. ఇలాంటి అనేక ప్రతికూలతలను అధిగమించి నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి నా తల్లిదండ్రులు ప్రసాద్, సరోజ, భార్య శ్రీలక్ష్మి, స్నేహితులతో పాటు ఎంతో మంది అందించిన ప్రోత్సాహం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా క్రీడల్లో అవకాశాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. వీటితో పాటు క్రీడలు చాలా చిన్న వయస్సు నుంచే సంస్కృతిలో భాగం కావాలి.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా గుర్తించింది. ప్రతి గ్రామంలో యువత పోటీపడి క్రీడలను ఆస్వాదించడానికి ప్రోత్సహించేలా ‘ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభించింది. ఇందుకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇది ఓ ప్రారంభం.. దీనికి కొనసాగింపుగా శిక్షణా సౌకర్యాలను మెరుగు పరచడం ద్వారా భవిష్యత్తులో మన రాష్ట్రం నుంచి అనేక మంది ఛాంపియన్‌లను తయారు చేయగలుగుతాం.
ఖరీదైన క్రీడ.. అయినా నేను సిద్ధం
టెన్నిస్.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడే కాదు ఖరీదైన క్రీడల్లో ఒకటి. అలాగే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ తన శిక్షణకు, ప్రపంచ వ్యాప్తంగా టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి ఖర్చులకు నిధులు తానే సమకూర్చుకోవాలి. అందుకే పాఠశాల దశ నుంచే ఆటగాళ్లకు నిధులు సమకూరుస్తున్న రాష్ట్రాలు మాత్రమే మనదేశంలో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయడంలో విజయం సాధించాయి.
ఆంధ్రాలో ఆటగాళ్లను తయారు చేయడానికి మనకు మంచి టెన్నిస్ కోర్టులు, కోచ్‌లు లేరు. మాకు ప్రతిభగల ఆటగాళ్లను తయారు చేయగల సామర్థ్యం ఉంది. కానీ ఆటగాళ్లు చాలా చిన్న వయస్సులో శిక్షణ కోసం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు, ఆ తర్వాత విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రాలో ఎక్కువ మంది యువత టెన్నిస్‌లో పాల్గొనేలా చేయడానికి, మనకు రాష్ట్రంలోనే మంచి టెన్నిస్ అకాడమీ, కోచ్ ఉండాలి.
దీనిపై ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారు. కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న విశాఖపట్నంలో టెన్నిస్ అకాడమికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నా వయసు ఇప్పుడు 36 ఏళ్లు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొన్న అనుభవంతో పాటు, అంతర్జాతీయ కోచ్‌గా కూడా నాకు గుర్తింపు ఉంది. మన రాష్ట్రంలో టెన్నిస్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు నా నైపుణ్యాన్ని సంతోషంగా అందించడం కోసం నేను సిద్ధంగా ఉన్నా.
Comments
Please login to add a commentAdd a comment