Saket Maineni
-
సాకేత్–రామ్‌కుమార్ జోడీకి సియోల్ ఓపెన్ డబుల్స్ టైటిల్
ఎనిమిది నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణకొరియాలో ఆదివారం ముగిసిన సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–4, 4–6, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో వాసిల్ కిర్కోవ్ (అమెరికా)–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జోడీపై నెగ్గింది. సాకేత్–రామ్‌కుమార్ జంటకు 7,580 డాలర్ల (రూ. 6 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది సాకేత్–రామ్మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఇద్దరు బెంగళూరు ఓపెన్, చెన్నై ఓపెన్ టోర్నీల్లో విజేతలుగా నిలిచారు. ఓవరాల్‌గా సాకేత్ కెరీర్లో ఇది 19వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. ఏటీపీ చాలెంజర్ టోర్నీలు కాకుండా సాకేత్ మరో 19 ఐటీఎఫ్ టోర్నీ డబుల్స్ టైటిల్స్ కూడా గెలిచాడు. -
ఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 7–6 (9/7), 6–4తో జాషువ పారిస్ (ఇంగ్లండ్)–నామ్ జి సంగ్ (జపాన్) ద్వయంపై గెలిచింది. ఒక గంట 36 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను ‘టై బ్రేక్’లో దక్కించుకున్న సాకేత్–రామ్‌కుమార్ ద్వయం... రెండో సెట్లో అదే జోరు కొనసాగిస్తూ విజయం సాధించింది. సాకేత్–రామ్‌కుమార్ జంట 6 ఏస్‌లు సంధించి ఆధిక్యం ప్రదర్శించగా... ప్రత్యర్థి జోడీ రెండు ఏస్‌లకు పరిమితమై... రెండు డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఒక టై బ్రేక్ నెగ్గిన సాకెత్–రామ్‌కుమార్ ద్వయం... ఓవరాల్‌గా 77 పాయింట్లు సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో వాసిల్ కిర్కోవ్ (అమెరికా)–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జంటతో సాకేత్–రామ్‌కుమార్ జోడీ తపలడనుంది. -
సెమీఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 6–3, 6–1తో యోంగ్ సియోక్ జియోంగ్–యుసంగ్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో జిసుంగ్ నామ్ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్ (బ్రిటన్) జంటతో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం ఆడుతుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచా జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ అనిరు«ద్–నిక్కీ జంట 1–6, 3–6తో జిసుంగ్ నామ్ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సాకేత్ జోడీకి చుక్కెదురు
బుసాన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. దక్షిణ కొరియాలో బుధవారం జరిగిన తొలి రౌండ్లో టాప్ సీడ్ సాకేత్–ప్యాట్రిక్ నిక్లాస్ సాల్మనెన్ (ఫిన్లాండ్) ద్వయం 5–7, 2–6తో అలెక్స్ బోల్ట్–లి టు (ఆ్రస్టేలియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. -
సాకేత్ జోడీ సంచలనం
పుణే: మహారాష్ట్ర ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సంచలన విజయంతో బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్–రామ్ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ పీటర్ మటూవ్‌స్కీ (పోలాండ్)–మాథ్యూ రోమియోస్ (ఆ్రస్టేలియా) జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ చేరింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జోడీ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అర్జున్ –జీవన్ (భారత్) 6–3, 6–3తో రిత్విక్ చౌదరీ–నికీ పూనాచా (భారత్)లపై నెగ్గగా... గంటా సాయి కార్తీక్ రెడ్డి–కరణ్ (భారత్) 6–3, 3–6, 4–10తో ట్రిస్టన్–వాల్టన్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడారు. -
సాకేత్ జోడీకి టైటిల్
బెంగళూరు: భారత డేవిస్ కప్ ప్లేయర్ సాకేత్ మైనేని మరో డబుల్స్ టైటిల్ సాధించాడు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో రామ్‌కుమార్ రామనాథన్‌తో జోడీ కట్టిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ శనివారం జరిగిన ఫైనల్లో ఫ్రెంచ్ జంటపై విజయం సాధించాడు. భారత ద్వయం 6–3, 6–4తో మ్యాక్సిమ్ జాన్వియెర్–బిటన్ కౌజ్మినె జంటపై వరుస సెట్లలో గెలుపొందింది. సింగిల్స్‌లో భారత టాప్‌ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు మాత్రం సెమీస్‌లో చుక్కెదురైంది. రెండో సీడ్ నగాల్ 6–7 (2/7), 4–6తో ఇటలీకి చెందిన ఏడో సీడ్ స్టెఫానో నెపొలిటనో చేతిలో పరాజయం చవిచూశాడు. ఆట ఆరంభంలో సుమీత్ 4–1తో ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అయితే ఇటలీ ప్లేయర్ వరుసగా గేమ్‌లను గెలవడంతో తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. భారత ఆటగాడు రెండో సెట్ ఆరంభంలో పట్టుదల కనబరిచినప్పటికీ తర్వాత స్టెఫానో జోరు ముందు నిలువలేకపోయాడు. -
సాకేత్–రామ్‌కుమార్ జోడీకి టైటిల్
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్, భారత డేవిస్‌కప్ ప్లేయర్ సాకేత్ మైనేని ఖాతాలో 16వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ చేరింది. రామ్‌కుమార్ రామనాథన్‌తో జోడీ కట్టిన సాకేత్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నమెంట్లో డబుల్స్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 3–6, 6–3, 10–5తో భారత్‌కే చెందిన రిత్విక్ చౌదరి– నిక్కీ పునాచా ద్వయంపై గెలుపొందింది. సాకేత్ జోడీ ఒక ఏస్ సంధించగా, 2 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఆఖరిదాకా పోరాడిన రిత్విక్–నిక్కీ జంట 2 ఏస్‌లు సంధించి ఒకసారి డబుల్ ఫాల్ట్ చేసింది. మరో వైపు ఇదే టోర్నీ సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో 26 ఏళ్ల నగాల్ 6–3, 6–4తో చెక్ రిపబ్లిక్కు చెందిన డలిబర్ విర్సినాపై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో సుమిత్... ఇటలీ ఆటగాడు లుకా నర్డితో తలపడతాడు. మరో సెమీస్‌లో లుకా నర్డి 6–4, 4–6, 7–6 (8/6)తో చున్ సిన్ సెంగ్ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గాడు. -
‘ఆడుదాం ఆంధ్ర’ ఆరంభం అదిరింది : సాకేత్ మైనేని
సాక్షి ప్రతినిధి–అమరావతి): పదకొండేళ్ల వయసులో తండ్రిని చూసి రాకెట్ పట్టిన బాలుడు.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో జత కట్టే స్థాయికి ఎదిగాడు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడల్లో రాణిస్తూ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు.. అతనే అర్జున అవార్డు గ్రహీత, మన ఆంధ్రప్రదేశ్ క్రీడా యువ కెరటం సాకేత్ మైనేని. ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై ముచ్చటించారు. రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధికి ఇది ఆరంభమని, గ్రామీణ క్రీడాకారులను గుర్తించడానికి ప్రభుత్వం వేసిన ఈ తొలి అడుగు అభినందనీయమని ప్రశంసించారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. కృష్ణమ్మ ఒడి నుంచి క్రీడా రంగంలోకి.. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మించినప్పటికీ పెరిగిందంతా విశాఖపట్నంలోనే. చిన్నప్పటి నుంచీ క్రీడలపై ఆసక్తి ఉండేది. ఖోఖో, కర్రా–బిళ్లా్ల, గోలీలు అంటూ ప్రతి ఆటా ఆడేసేవాడిని. మా నాన్న టెన్నిస్ ఆడుతుంటే చూసి నాకూ ఆడాలనిపించింది. అలా 11 ఏళ్లకే ఆ గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నా. 12 ఏళ్లకు విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచా. 13 ఏళ్ల వయసులో నాకు టెన్నిస్ శిక్షణ ఇప్పించడం కోసం అమ్మానాన్నలు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 17 ఏళ్ల వయసులో టెన్నిస్ స్కాలర్‌షిప్‌పై అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లాను. అక్కడ కోచింగ్ సర్టిఫికేషన్ పొందాను. ఖర్చుల కోసం అక్కడి స్థానిక క్లబ్లో శిక్షణ ఇచ్చాను. అకడమిక్స్‌లో కూడా అగ్రస్థానంలో నిలిచాను. అత్యుత్తమ డబుల్స్ ర్యాంకింగ్ 74వ స్థానంలో ఉన్నాను. 2014లో చైనాలో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్‌లో సానియాతో జత కట్టి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం, సనమ్ సింగ్‌తో జోడికట్టి డబుల్స్‌లో రజత పతకం గెలవడం నిజంగా అద్భుతమైన అనుభూతి. దక్షిణాసియా క్రీడల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో 2016, 2019లో రజత పతకాలు సాధించా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో నేను, సానియా మీర్జా మాత్రమే పతకాలు సాధించాం. సరదాగా ప్రారంభించిన ఈ క్రీడ చివరికి నా కెరీర్‌గా మారింది. ప్రస్తుతం డేవిస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం 2017లో అర్జున అవార్డుతో గౌరవిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, స్థలం మంజూరు చేయాలని నిర్ణయించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలి.. ఇండియాకే ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ తెచ్చివ్వాలనేది నా లక్ష్యం. ఈ అద్భుత ప్రయత్నం కొనసాగాలి ఏదైనా క్రీడలో తమ పిల్లవాడు రాణించేలా చేయాలంటే ఆ కుటుంబానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరి్థకంగానూ సమస్యలు వస్తాయి. అలాగే పిల్లవాడి చదువుపైనా ఆ క్రీడ ప్రభావం చూపుతుంది. సౌకర్యాలు లేకపోవడం ఆటంకంగా మారుతుంది. పాఠశాలకు వెళ్లి వచ్చేసరికే పిల్లాడు అలసిపోతుంటాడు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను టోర్నమెంట్లకు తీసుకెళ్లడానికి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయినా అన్నిటిలో గెలుస్తాడని గ్యారెంటీ ఉండదు. ఇలాంటి అనేక ప్రతికూలతలను అధిగమించి నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి నా తల్లిదండ్రులు ప్రసాద్, సరోజ, భార్య శ్రీలక్ష్మి, స్నేహితులతో పాటు ఎంతో మంది అందించిన ప్రోత్సాహం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా క్రీడల్లో అవకాశాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. వీటితో పాటు క్రీడలు చాలా చిన్న వయస్సు నుంచే సంస్కృతిలో భాగం కావాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా గుర్తించింది. ప్రతి గ్రామంలో యువత పోటీపడి క్రీడలను ఆస్వాదించడానికి ప్రోత్సహించేలా ‘ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభించింది. ఇందుకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇది ఓ ప్రారంభం.. దీనికి కొనసాగింపుగా శిక్షణా సౌకర్యాలను మెరుగు పరచడం ద్వారా భవిష్యత్తులో మన రాష్ట్రం నుంచి అనేక మంది ఛాంపియన్లను తయారు చేయగలుగుతాం. ఖరీదైన క్రీడ.. అయినా నేను సిద్ధం టెన్నిస్.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడే కాదు ఖరీదైన క్రీడల్లో ఒకటి. అలాగే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ తన శిక్షణకు, ప్రపంచ వ్యాప్తంగా టోర్నమెంట్లలో పాల్గొనడానికి ఖర్చులకు నిధులు తానే సమకూర్చుకోవాలి. అందుకే పాఠశాల దశ నుంచే ఆటగాళ్లకు నిధులు సమకూరుస్తున్న రాష్ట్రాలు మాత్రమే మనదేశంలో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయడంలో విజయం సాధించాయి. ఆంధ్రాలో ఆటగాళ్లను తయారు చేయడానికి మనకు మంచి టెన్నిస్ కోర్టులు, కోచ్‌లు లేరు. మాకు ప్రతిభగల ఆటగాళ్లను తయారు చేయగల సామర్థ్యం ఉంది. కానీ ఆటగాళ్లు చాలా చిన్న వయస్సులో శిక్షణ కోసం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు, ఆ తర్వాత విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రాలో ఎక్కువ మంది యువత టెన్నిస్‌లో పాల్గొనేలా చేయడానికి, మనకు రాష్ట్రంలోనే మంచి టెన్నిస్ అకాడమీ, కోచ్ ఉండాలి. దీనిపై ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా ఉన్నారు. కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న విశాఖపట్నంలో టెన్నిస్ అకాడమికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నా వయసు ఇప్పుడు 36 ఏళ్లు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొన్న అనుభవంతో పాటు, అంతర్జాతీయ కోచ్‌గా కూడా నాకు గుర్తింపు ఉంది. మన రాష్ట్రంలో టెన్నిస్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు నా నైపుణ్యాన్ని సంతోషంగా అందించడం కోసం నేను సిద్ధంగా ఉన్నా. -
సాకేత్ జోడీకి పతకం ఖాయం
ఆసియా క్రీడల టెన్నిస్‌లో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగాల్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 7–6 (10/8)తో జిజెన్ జాంగ్–యిబింగ్ వు (చైనా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌కిది ఆసియా క్రీడల్లో మూడో పతకం కానుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ పురుషుల డబుల్స్‌లో రజతం, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించాడు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సుమిత్ నగాల్ 7–6 (7/3), 1–6, 2–6తో టాప్ సీడ్ జిజెన్ జాంగ్ (చైనా) చేతిలో, అంకిత రైనా 6–3, 4–6, 4–6తో హరూకా కాజి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
యూఎస్ ఓపెన్ డబుల్స్ బరిలో సాకేత్
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని ఈ ఏడాది నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ లోనూ పోటీపడనున్నాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీతో కలిసి 77వ ర్యాంకర్ సాకేత్ ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలలో బరిలోకి దిగాడు. యూఎస్ ఓపెన్‌లో మాత్రం యూకీతో కాకుండా కరత్సెవ్ (రష్యా)తో సాకేత్ జత కట్టాడు. బ్రెజిల్ ప్లేయర్ డెమోలైనర్తో కలిసి యూకీ ఆడనున్నాడు. 35 ఏళ్ల సాకేత్ 2016 యూఎస్ ఓపెన్ సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్లో నిష్క్రమించాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్–యూకీ జోడీ ఓటమి
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ చాంపియన్‌షిలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 2–6, 2–6తో లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. నాలుగుసార్లు తమ సర్వీస్‌ను కోల్పోయిన భారత జోడీ ప్రత్యర్థి జంట సర్విస్‌లో మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వదులుకుంది. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సాకేత్–యూకీ బాంబ్రీలకు 23,660 డాలర్ల (రూ. 19 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. ఇదే టోర్నీలో రామ్‌కుమార్ (భారత్)–ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్) జోడీ తొలి రౌండ్లో 4–6, 6–3, 5–10తో సాండెర్ జిలె–విలెజిన్ (బెల్జియం) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
Guangzhou Open 2022: గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో రన్నరప్ సాకేత్ జోడీ
ఈ ఏడాది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాలని ఆశించిన భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. కొరియాలో జరిగిన గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ జోడీ 6–2, 3–6, 6–10తో టాప్ సీడ్ బారియెంటోస్ (కొలంబియా)–రెయస్ వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. సాకేత్–యూకీ జోడీకి 1,800 డాలర్ల (రూ. లక్షా 48 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ
షికాగో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 5–7, 6–4, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్)–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. ఈ సీజన్లో సాకేత్–యూకీ జంట అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వీరిద్దరు కలిసి నాలుగు ఏటీపీ చాలెంజర్ టైటిల్స్‌ను, రెండు ఐటీఎఫ్ టోర్నీ టైటిల్స్‌ను సాధించారు. -
సెమీస్‌లో ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. మెక్సికోలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 3–6, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ మిజా–రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జంటకు 1,080 డాలర్ల (రూ.82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 30 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత డేవిస్ కప్ జట్టులో సాకేత్ మైనేని
ఫిన్లాండ్తో సెప్టెంబర్ 18, 19వ తేదీల్లో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనికి చోటు లభించింది. భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ గాయపడటంతో అతని స్థానాన్ని సాకేత్‌తో భర్తీ చేశారు. డేవిస్ కప్‌లో భారత్ తరఫున సాకేత్ ఆరుసార్లు ఆడాడు. చివరిసారిగా అతడు 2018లో సెర్బియాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. -
సింగిల్స్ సెమీస్‌లో సాకేత్ మైనేని
వోల్వో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జెరూసలేంలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6–4, 6–3తో ఈడన్ లెషమ్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకున్న సాకేత్, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో శశికుమార్ (భారత్) 7–6 (7/2), 6–7 (5/7), 2–6తో ఫిలిప్ పెలివో (కెనడా) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్
సాక్షి, హైదరాబాద్: వోల్వో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6–4, 6–4తో తక్ కున్ వాంగ్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఈ మ్యాచ్‌లో సాకేత్ తొమ్మిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన సాకేత్, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో శశికుమార్ ముకుంద్ 1–6, 6–3, 6–3తో రెండో సీడ్ జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించాడు. -
నాదల్ రికార్డుపై జొకోవిచ్ గురి
కాలిఫోర్నియా (అమెరికా): వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో మేటి టైటిల్‌పై గురి పెట్టాడు. గురువారం మొదలయ్యే సీజన్ తొలి మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్ ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 32 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఈ సెర్బియా స్టార్ మరో టైటిల్ నెగ్గితే... అత్యధికంగా 33 మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రాఫెల్ నాదల్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. అయితే మేటి క్రీడాకారులందరూ పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలవాలంటే మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. రాఫెల్ నాదల్, ఫెడరర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నిషికోరి (జపాన్), కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), జాన్ ఇస్నెర్ (అమెరికా), యువతార సిట్సిపాస్ (గ్రీస్), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తదితరులు కూడా ఈ టోర్నీ టైటిల్ రేసులో ఉన్నారు. తొలి రౌండ్లో సాకేత్ పరాజయం సాక్షి, హైదరాబాద్: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 4–6, 6–4, 4–6తో ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సాకేత్ ఓటమి
చెన్నై: హైదరాబాద్ స్టార్ సాకేత్ మైనేని చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. భారత టాప్ ర్యాంక్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ ముకుంద్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 11వ సీడ్ సాకేత్ 3–6, 6–7 (3/7)తో ఐదో సీడ్ డేవిడొవిచ్ ఫొకినా (స్పెయిన్) చేతిలో పరాజయం చవిచూడగా... అన్‌సీడెడ్ ముకుంద్ 6–3, 6–4తో మూడో సీడ్ మొహమద్ సఫ్వాత్ (ఈజిప్టు)కు షాకిచ్చాడు. టాప్ సీడ్ ప్రజ్నేశ్ 6–4, 6–2తో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేను ఇంటిదారి పట్టించాడు. నేడు జరిగే క్వార్టర్స్‌లో ప్రజ్నేశ్... ఏడో సీడ్ జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో, శశికుమార్ ముకుంద్... బ్రిడన్ క్లెయిన్ (బ్రిటన్)తో తలపడతారు. -
సాకేత్–అర్జున్ జంట ఓటమి
చెన్నై: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో రెండో రోజు భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల డబుల్స్‌లో సాకేత్ మైనేని–అర్జున్ ఖడే... అనిరుధ్ చంద్రశేఖర్–అభినవ్ జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. మూడో సీడ్ సాకేత్–అర్జున్ ద్వయం 6–7 (4/7), 3–6తో గియా న్లుకా మాగెర్–ఆండ్రీ పెలెగ్రిని (ఇటలీ) జోడీ చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. మరో మ్యాచ్‌లో అనిరుధ్–అభినవ్ జంట 7–6 (7/5), 2–6, 5–10తో సిద్ధార్థ్ రావత్–మనీశ్ (భారత్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో శశికుమార్ ముకుంద్ (భారత్) 6–3, 6–1తో సెబాస్టియన్ ఫాన్సెలు (జర్మనీ)పై గెలుపొందగా... సుమీత్ నాగల్ (భారత్) 3–6, 4–6తో డకీ లీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్
బెంగళూరు: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 6–1, 3–6, 6–1తో క్వాలిఫయర్ యూసుఫ్ హసమ్ (ఈజిప్ట్)పై గెలుపొందాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) జంట 6–3, 7–6 (7/5)తో ప్రజ్వల్ దేవ్–నికీ పునాచా (భారత్) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సుమీత్ 6–3, 7–6 (7/4)తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై, ప్రజ్నేశ్ 4–6, 6–4, 7–5తో సెబాస్టియన్ (జర్మనీ)పై గెలి చారు. శశికుమార్‌తో మ్యాచ్‌లో స్కోరు 6–7 (2/7), 1–3 వద్ద ఉన్నపుడు గాయం కారణంగా బ్లాజ్ కావిచ్ (స్లొవేనియా) వైదొలిగాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–7 (3/7), 3–6తో పర్సెల్–సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడింది. -
డేవిస్ కప్ జట్టులో మార్పులు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక డేవిస్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో అనూహ్యంగా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన జట్టు నుంచి యూకీ బాంబ్రీ, దివిజ్ శరణ్, సుమీత్ నాగల్ తప్పుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి క్రాలేవోలో సెర్బియాతో ఈ పోరు జరుగనుంది. యూకీ బాంబ్రీ, దివిజ్ శరణ్‌లు గాయాల కారణంగా దూరం కాగా... సుమీత్ మాత్రం స్టాండ్‌బైగా జట్టుతో పాటు కొనసాగడం ఇష్టం లేక తప్పుకున్నాడు. దీంతో తెలుగు తేజం సాకేత్ మైనేనితో పాటు శ్రీరామ్ బాలాజీ వారీ స్థానాలను భర్తీ చేయ నున్నారు. అర్జున్ ఖడే స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. 2014లో బెంగళూరులో సెర్బియాతోనే జరిగిన డేవిస్‌కప్ మ్యాచ్‌లో భారత్ 2–3తో ఓడింది. -
సెమీస్‌లో సాకేత్
కోల్‌కతా: భారత డేవిస్‌కప్ ఆటగాడు ప్రేమ్జీత్ లాల్ స్మారక జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ 6–3, 6–3తో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్‌ను ఓడించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 6–3, 6–3తో జీవన్ నెదున్‌చెజియాన్‌పై, శ్రీరామ్ బాలాజీ 6–0, 6–0తో శశికుమార్ ముకుంద్‌పై, విజయ్ సుందర్ ప్రశాంత్ 6–3, 1–6, 6–1తో సిద్ధార్థ్ రావత్‌పై గెలిచారు. సెమీఫైనల్స్‌లో శ్రీరామ్ బాలాజీతో సాకేత్; రామ్‌కుమార్‌తో ప్రశాంత్ తలపడతారు. -
సాకేత్‌కు వైల్డ్ కార్డు
ముంబై: పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనికి సింగిల్స్ విభాగంలో వైల్డ్ కార్డు కేటాయించారు. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో సాకేత్‌తోపాటు భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీ, ఆర్యన్ గోవిస్, అర్జున్ ఖాడేలకు కూడా నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ప్రపంచ 86వ ర్యాంకర్ రాడూ అల్బోట్ (మాల్డొవా), ప్రపంచ 98వ ర్యాంకర్ బ్లాజ్ కావిచ్ (స్లొవేనియా), భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్, గతేడాది రన్నరప్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. గాయాల కారణంగా ఈ ఏడాది ఎక్కువ భాగం ఆటకు దూరం కావడంతో సాకేత్ సింగిల్స్ ర్యాంక్ 912కు పడిపోయింది. శని, ఆదివారాల్లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
సాకేత్ సంచలనం
యూఎస్ ఓపెన్ మెరుున్ ‘డ్రా’కు అర్హత న్యూయార్క్: పట్టుదలతో పోరాడిన తెలుగు టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అనుకున్నది సాధించాడు. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో మెరుున్ ‘డ్రా’కు అర్హత పొందాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సాకేత్ పురుషుల సింగిల్స్ విభాగం మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. వైజాగ్‌కు చెందిన 28 ఏళ్ల సాకేత్... భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వాలిఫరుుంగ్ మూడో రౌండ్ మ్యాచ్‌లో 6-3, 6-0తో పెద్జా క్రిస్టిన్ (సెర్బియా)పై గెలుపొందాడు. భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా ఉన్న సాకేత్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ క్వాలిఫరుుంగ్ టోర్నమెంట్లలో ఆడినప్పటికీ మెరుున్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. సోమవారం మొదలయ్యే యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నీ మెరుున్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 48వ ర్యాంకర్ జిరీ వెసెలీ (చెక్ రిపబ్లిక్)తో సాకేత్ ఆడతాడు. యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తర్వాత ఇటీవల కాలంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో పోటీపడనున్న మూడో భారతీయ క్రీడాకారుడిగా సాకేత్ నిలిచాడు. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి సయ్యద్ మొహమ్మద్ హాది, సయ్యద్ ఆసిఫ్ ఖాద్రీ, గౌస్ మొహమ్మద్, ఎస్పీ మిశ్రా (హైదరాబాద్) గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పాల్గొన్నారు.