సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్ : రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించడానికి ఇదివరకెన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. ‘ఆడుదాం ఆంధ్రా’తో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి, మెరుగు పెడుతోంది. చరిత్రలో తొలిసారిగా అట్టడుగు స్థాయి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీసే మహాయజ్ఞానికి నాంది పలికింది. యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు, క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకునే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచే పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ పిలుపునిచ్చింది.
దానికి తగ్గట్టు పకడ్బందీగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికా బద్ధంగా పోటీల నిర్వహణకు దాదాపు 14 శాఖల సిబ్బంది సహకారంతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రూపకల్పన చేసింది. గత డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు ఈనెల 13వ తేదీతో ముగియనున్నాయి. క్రీడా మాణిక్యాలను ఒడిసిపట్టి, ప్రపంచ వేదికలపై నిలబెట్టేలా తలపెట్టిన ఈ క్రీడా సంబరంలో యావత్తు యువత ఉత్సాహంతో ఉరకలేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో క్రీడాకారులతో పాటు ప్రేక్షకులుగా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు 1.23 కోట్ల రిజిస్ట్రేషన్లతో అతిపెద్ద క్రీడా మహోత్సవంలో భాగస్వాములవ్వడం ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగం సామర్థ్యానికి అద్దం పడుతోంది.
క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో మెన్, వుమెన్ విభాగాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా దాటి.. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో నాలుగో దశ పోటీలు విశాఖ వేదికగా ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి. ముగింపు రోజున ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విజేతగా నిలిచిన జట్లు ట్రోఫీతో పాటు భారీ నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోనున్నాయి.
ఇదో భారీ టాలెంట్ హంట్..
15004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో గతేడాది డిసెంబర్ 26న అట్టహాసంగా ప్రారంభంమైన ‘ఆడుదాం ఆంధ్ర’ సువిశాల విశాఖ సాగర తీరంలో తుది పోరుకు (ఫైనల్స్‌కు) ఎగిసిపడుతోంది. దాదాపు నెలన్నర కాలంలో 4.60 లక్షల జట్లను పోటీలకు ఎంపిక చేయగా.. 2.93 లక్షల మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఫైనల్స్ పోటీలు.. 13వ తేదీతో ముగియనున్నాయి. 26 జిల్లాలకు చెందిన పల్లెల్లో నుంచి వచ్చిన యువ క్రీడా కెరటాలు అంతర్జాతీయ మైదానాల్లో హోరాహోరీగా తలపడుతున్నారు.
12వ తేదీ నాటికి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ (డబుల్స్) ఫైనల్స్ పూర్తి చేసి, 13వ తేదీన క్రికెట్ ఫైనల్స్ నిర్వహించి క్రీడా పోటీలను ఘనంగా ముగించేందుకు శాప్ కసరత్తు చేస్తోంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అతిపెద్ద భారీ టాలెంట్ హంట్ చేపట్టడం ఇదే ప్రథమం. దీనికి తోడు గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి సమర్థవంతంగా పోటీలను ముందుకు తీసుకెళ్లడంపై క్రీడావర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో పేరుకు మాత్రమే క్రీడాపోటీలు ఉండేవని.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించే లక్ష్యం కనుమరుగవుతున్న తరుణంలో ‘ఆడుదాం ఆంధ్రా’ తిరిగి క్రీడా రంగానికి జవసత్వాలు తీసుకొచ్చిందని సీనియర్ క్రీడాకారులు ప్రశంసిస్తున్నారు. క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్ బృందాలు, వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘ ప్రతినిధులు టాలెంట్ హంట్ చేస్తున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ప్రతిభగల క్రీడాకారులను గుర్తిస్తున్నాయి. పోటీలు ముగిసిన అనంతరం వారికి వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో అవకాశం కల్పించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
37.35 లక్షల మంది క్రీడాకారుల సత్తా
‘ఆడుదాం ఆంధ్ర’ తొలి ఏడాది ఐదు దశల్లో ప్రతిభగల క్రీడాకారులకు అవకాశం కల్పించింది. 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను భాగస్వాములను చేసి క్రీడల్లో వయసు అంతరాలను తొలగించింది. దాదాపు 37.35 లక్షల మంది వివిధ క్రీడాంశాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 23.58 లక్షల మంది పురుషులు కాగా, 13.77 లక్షల మంది మహిళలున్నారు. వీరు సంప్రదాయ క్రీడా పోటీల్లో (నాన్ కాంపిటీటివ్ విభాగంలో యోగ, మారథాన్, టెన్నికాయిట్)తో పాటు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్‌లో సత్తాచాటారు.
1.49 లక్షల మంది గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్ కోచ్‌లు, క్రీడా సంఘాల పోటీలను తొలి నాలుగు దశల్లో సమర్థవంతంగా నిర్వహించారు. పోటీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రీడాకారుల మొబైల్ ఫోన్లకు సమాచారం ఇస్తూ టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్నారు. నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో విజేతలకు అత్యంత పారదర్శకంగా వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బహుమతులను జమ చేసింది. ఇప్పటికే 95 శాతం పంపిణీ పూర్తి చేసింది.
రూ.119.19 కోట్ల బడ్జెట్‌లో ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తోంది. సుమారు రూ.12.21 కోట్ల నగదు బహుమతులు ప్రదానం చేస్తోంది. క్రీడాకారులకు రూ.42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను ప్రతి సచివాలయానికి సరఫరా చేసింది. ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17.10 లక్షల టీషర్టులు, టోపీలతో కూడిన కిట్లను ఇచ్చింది. క్రీడాకారులకు భోజన, రవాణ, వసతి సౌకర్యాల కోసం ఏకంగా రూ.21 కోట్లకుపైగా ఖర్చు చేసింది.
మట్టిలో మాణిక్యాలకు మెరుగు
Published Sun, Feb 11 2024 2:32 AM | Last Updated on Sun, Feb 11 2024 11:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment