sports and games
-
మట్టిలో మాణిక్యాలకు మెరుగు
సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్ : రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించడానికి ఇదివరకెన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. ‘ఆడుదాం ఆంధ్రా’తో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి, మెరుగు పెడుతోంది. చరిత్రలో తొలిసారిగా అట్టడుగు స్థాయి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీసే మహాయజ్ఞానికి నాంది పలికింది. యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు, క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకునే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచే పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ పిలుపునిచ్చింది. దానికి తగ్గట్టు పకడ్బందీగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికా బద్ధంగా పోటీల నిర్వహణకు దాదాపు 14 శాఖల సిబ్బంది సహకారంతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రూపకల్పన చేసింది. గత డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు ఈనెల 13వ తేదీతో ముగియనున్నాయి. క్రీడా మాణిక్యాలను ఒడిసిపట్టి, ప్రపంచ వేదికలపై నిలబెట్టేలా తలపెట్టిన ఈ క్రీడా సంబరంలో యావత్తు యువత ఉత్సాహంతో ఉరకలేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో క్రీడాకారులతో పాటు ప్రేక్షకులుగా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు 1.23 కోట్ల రిజిస్ట్రేషన్లతో అతిపెద్ద క్రీడా మహోత్సవంలో భాగస్వాములవ్వడం ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగం సామర్థ్యానికి అద్దం పడుతోంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో మెన్, వుమెన్ విభాగాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా దాటి.. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో నాలుగో దశ పోటీలు విశాఖ వేదికగా ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి. ముగింపు రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విజేతగా నిలిచిన జట్లు ట్రోఫీతో పాటు భారీ నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోనున్నాయి. ఇదో భారీ టాలెంట్ హంట్.. 15004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో గతేడాది డిసెంబర్ 26న అట్టహాసంగా ప్రారంభంమైన ‘ఆడుదాం ఆంధ్ర’ సువిశాల విశాఖ సాగర తీరంలో తుది పోరుకు (ఫైనల్స్‌కు) ఎగిసిపడుతోంది. దాదాపు నెలన్నర కాలంలో 4.60 లక్షల జట్లను పోటీలకు ఎంపిక చేయగా.. 2.93 లక్షల మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఫైనల్స్ పోటీలు.. 13వ తేదీతో ముగియనున్నాయి. 26 జిల్లాలకు చెందిన పల్లెల్లో నుంచి వచ్చిన యువ క్రీడా కెరటాలు అంతర్జాతీయ మైదానాల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. 12వ తేదీ నాటికి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ (డబుల్స్) ఫైనల్స్ పూర్తి చేసి, 13వ తేదీన క్రికెట్ ఫైనల్స్ నిర్వహించి క్రీడా పోటీలను ఘనంగా ముగించేందుకు శాప్ కసరత్తు చేస్తోంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అతిపెద్ద భారీ టాలెంట్ హంట్ చేపట్టడం ఇదే ప్రథమం. దీనికి తోడు గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి సమర్థవంతంగా పోటీలను ముందుకు తీసుకెళ్లడంపై క్రీడావర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో పేరుకు మాత్రమే క్రీడాపోటీలు ఉండేవని.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించే లక్ష్యం కనుమరుగవుతున్న తరుణంలో ‘ఆడుదాం ఆంధ్రా’ తిరిగి క్రీడా రంగానికి జవసత్వాలు తీసుకొచ్చిందని సీనియర్ క్రీడాకారులు ప్రశంసిస్తున్నారు. క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్ బృందాలు, వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘ ప్రతినిధులు టాలెంట్ హంట్ చేస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ప్రతిభగల క్రీడాకారులను గుర్తిస్తున్నాయి. పోటీలు ముగిసిన అనంతరం వారికి వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో అవకాశం కల్పించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 37.35 లక్షల మంది క్రీడాకారుల సత్తా ‘ఆడుదాం ఆంధ్ర’ తొలి ఏడాది ఐదు దశల్లో ప్రతిభగల క్రీడాకారులకు అవకాశం కల్పించింది. 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను భాగస్వాములను చేసి క్రీడల్లో వయసు అంతరాలను తొలగించింది. దాదాపు 37.35 లక్షల మంది వివిధ క్రీడాంశాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 23.58 లక్షల మంది పురుషులు కాగా, 13.77 లక్షల మంది మహిళలున్నారు. వీరు సంప్రదాయ క్రీడా పోటీల్లో (నాన్ కాంపిటీటివ్ విభాగంలో యోగ, మారథాన్, టెన్నికాయిట్)తో పాటు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్‌లో సత్తాచాటారు. 1.49 లక్షల మంది గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్ కోచ్‌లు, క్రీడా సంఘాల పోటీలను తొలి నాలుగు దశల్లో సమర్థవంతంగా నిర్వహించారు. పోటీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రీడాకారుల మొబైల్ ఫోన్లకు సమాచారం ఇస్తూ టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్నారు. నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో విజేతలకు అత్యంత పారదర్శకంగా వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బహుమతులను జమ చేసింది. ఇప్పటికే 95 శాతం పంపిణీ పూర్తి చేసింది. రూ.119.19 కోట్ల బడ్జెట్లో ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తోంది. సుమారు రూ.12.21 కోట్ల నగదు బహుమతులు ప్రదానం చేస్తోంది. క్రీడాకారులకు రూ.42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను ప్రతి సచివాలయానికి సరఫరా చేసింది. ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17.10 లక్షల టీషర్టులు, టోపీలతో కూడిన కిట్లను ఇచ్చింది. క్రీడాకారులకు భోజన, రవాణ, వసతి సౌకర్యాల కోసం ఏకంగా రూ.21 కోట్లకుపైగా ఖర్చు చేసింది. -
Adudam Andhra 2023 Photos: అంతటా క్రీడా సంబరం.. ఆడుదాం ఆంధ్రాకు అద్భుత స్పందన (ఫొటోలు)
-
క్రీడా రంగానికి కేటాయింపులెన్నో!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి లభించే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా బడ్జెట్లో క్రీడారంగానికి ప్రాధాన్యత పెరిగినప్పటికీ, కేటాయింపుల్లో నిలకడ లోపించింది. గతేడాది (2020–21) ఖేలో ఇండియా గేమ్స్ కోసం రూ. 890 కోట్లను కేటాయించిన కేంద్రం... భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల నిధుల్లో కోత విధించింది. 2019లో రూ. 615 కోట్లుగా ఉన్న ‘సాయ్’ కేటాయింపులు గతేడాది రూ. 500 కోట్లకు తగ్గగా... క్రీడా సమాఖ్యలకు (రూ. 245 కోట్ల నుంచి రూ. 55 కోట్లకు తగ్గింపు) సైతం భారీ కోత పడింది. అయితే కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సిద్ధం చేసిన ఈ బడ్జెట్లో క్రీడారంగానికి ఎన్ని నిధులు దక్కుతాయనేది ఆసక్తికరం. ► లాక్డౌన్ కారణంగా యూత్ స్పోర్ట్స్‌కు ఆదరణ పెరగడంతో ఈసారి బడ్జెట్లో క్రీడలపై ఎక్కువ వెచ్చించే అవకాశముంది. ► మరోవైపు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను విజయవంతం చేయాలంటే అందుకు తగిన నిధులు కేటాయించాల్సిందే. ► లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు, క్రీడల్ని కెరీర్‌గా ఎంచుకున్న మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై కేంద్రం దృష్టి సారించాల్సి ఉంది. దీనితో పాటు ఒలింపిక్స్ ఏడాది కావడంతో ఆటగాళ్లకు దన్నుగా నిలిచేందుకు ‘సాయ్’, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ► కరోనా కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో గతేడాది గేమింగ్ సెక్టార్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈస్పోర్ట్స్, గేమింగ్ సెక్టార్లను అభివృద్ధి చేసే స్వదేశీ గేమ్ డెవలపర్స్, స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తూ బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇస్తే... నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోన్న మేకిన్ ఇండియా బ్రాండ్‌కు మంచి ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. -
పత్తాలేని అండర్–19 రాష్ట్ర పోటీలు...
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా క్రీడారంగం కుదేలైందా.. జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది.. క్రీడలను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. క్రీడల్లో పాల్గొనేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. 2019–20 విద్యాసంవత్సరంలో నిర్వహించే పోటీలను చూస్తుంటే క్రీడారంగం దయనీయ పరిస్థితికి అద్దం పండుతోంది. మొన్ననే రాష్ట్ర పాఠశాలల, కళాశాలల క్రీడాసమాఖ్య తెలంగాణలోని 31 జిల్లాలకు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే క్రీడలను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో అండర్ – 14, 17 విభాగంలో కేవలం ఆరు అంశాల్లోనే పోటీలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒక్క క్రీడాంశంలో కూడా రాష్ట్ర పోటీల నిర్వహాణ జరుగలేదు. ఇక అండర్–19 విభాగంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీలకే దిక్కు లేకుండా పోవడం కొసమెరుపు. కరీంనగర్ జిల్లా క్రీడారంగం తెలంగాణ రాష్ట్రానికే తలమానికం. గతంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పాఠశాలల, కళాశాలల క్రీడలతోపాటు వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు క్రీడల్లో విజయఢంకా మోగించి కరీంనగర్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. అంతేకాకుండా ఎప్పుడూ ఏదో ఒక క్రీడలో రాష్ట్ర, జాతీయ పోటీల నిర్వహణ పోటాపోటీగా జరుగడంతో క్రీడాహబ్‌గా కరీంనగర్ అభివృద్ధి చెందుతుందనే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది నుంచి క్రీడల నిర్వహణ తగ్గుతోంది. గతేడాది సుమారు 10కిపైగా క్రీడల్లో రాష్ట్ర పోటీలు, ఒక క్రీడలో జాతీయస్థాయి పోటీలు జరిగాయి. ఈయేడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. పత్తాలేని అండర్–19 రాష్ట్ర పోటీలు... స్కూల్ గేమ్స్ పరంగా చూస్తే అండర్ 14, 17 విభాగాల్లో సుమారు ఆరు క్రీడాంశాల్లో రాష్ట్ర పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగానికి వచ్చే సరికే పత్తా లేకుండా పోయింది. నాలుగు జిల్లాల్లో కనీసం ఒక్క క్రీడలో రాష్ట్ర పోటీలు నిర్వహించే బాధ్యతను ఆ సమాఖ్య కార్యదర్శి తీసుకోకపోవడం గమనార్హం. గతేడాది పలు క్రీడల్లో రాష్ట్ర పోటీలతోపాటు జాతీయ స్థాయి పోటీలను నిర్వహించిన అండర్–19 కార్యదర్శి మధు జాన్సన్ ఈసారి ఒక్క క్రీడలో పోటీలు నిర్వహించలేదు. ముందుకు రాని కార్యదర్శులు... పాఠశాలల, కళాశాలల క్రీడల్లో భాగంగా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎక్కువ క్రీడల్లో పోటీలు నిర్వహించడానికి స్కూల్ గేమ్స్ కార్యదర్శులు ముందుకు రాలేదు. కరీంనగర్లో రెండు, జగిత్యాలలో రెండు, పెద్దపల్లిలో మూడు రాష్ట్రస్థాయి పోటీలు మాత్రమే జరుగనుండగా రాజన్నసిరిసిల్లా జిల్లాలో ఒక్క అంశంలో కూడా క్రీడాపోటీలు నిర్వహించలేదు. స్కూల్ గేమ్స్‌పై కొన్నేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యం చూపడం.. నిధులు మంజూరు కాక పోవడం.. సొంత ఖర్చులతో పోటీల నిర్వహించాల్సి రావడం తదితర కారణాలతో ఈఏడాది పోటీల నిర్వహణకు పలువురు కార్యదర్శులు ఆసక్తి చూపలేదని సమాచారం. సిరిసిల్ల జిల్లాలో నిల్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఈ యేడు పాఠశాలల, కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించలేదు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎస్జీఎఫ్ కార్యదర్శి విడుదల చేసిన అండర్ 14, 17, 19 మూడు విభాగాల జాబితాలో ఒక్క క్రీడలో కూడా ఈ ఏడాది పోటీలు నిర్వహించలేదు. మొత్తం 96 క్రీడాంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోటీల నిర్వహాణ మూడు కేటగిరీలలో పోటీలు జరుపాల్సి ఉంది. కానీ, సిరిసిల్ల జిల్లాలో ఒక్క కేటగిరిలో కూడా పోటీలు జరుగకపోవడం గమనార్హం. మూడేళ్లుగా విడుదల కాని నిధులు.. నిజానికి మూడేళ్ల నుంచి స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహాణకు ఇచ్చే నిధులు విడుదలకాలేదు. దీంతో జిల్లాలో గతంలో పలువురు కార్యదర్శులు నిర్వహించిన పోటీల బడ్జెట్ ఇంతవరకు విడుదల కాలేదు. ఈ క్రమంలో ఈసారి పోటీల నిర్వహాణకు దూరం ఉన్నారు. అండర్ 19 విభాగంలో గతంలో నిర్వహించిన పోటీలకు సుమారు రూ.20 లక్షలు, అండర్ 14, 17 విభాగంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు సుమారు రూ.42 లక్షలు బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే పోటీల నిర్వహణకు ఇటీవల కొత్తగా నియామకమైన పలువురు కార్యదర్శులు దూరంగా ఉన్నట్లు సమాచారం. -
కొనసాగుతున్న ఆటల పోటీలు
జిన్నారం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆటల పోటీలు గురువారం రెండో రోజు కొనసాగాయి. ఆయా పాఠశాలల పీడీ, పీఈటీలు జిన్నారంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో క్రీడాకారులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు పంపుతామని పీడీ శ్రీనివాస్‌రావు తెలిపారు. అథ్లెటిక్ పోటీలను కూడా విద్యార్థులకు నిర్వహిస్తామన్నారు.