Village Sports
-
మట్టిలో మాణిక్యాలకు మెరుగు
సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్ : రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించడానికి ఇదివరకెన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. ‘ఆడుదాం ఆంధ్రా’తో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి, మెరుగు పెడుతోంది. చరిత్రలో తొలిసారిగా అట్టడుగు స్థాయి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీసే మహాయజ్ఞానికి నాంది పలికింది. యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు, క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకునే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచే పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ పిలుపునిచ్చింది. దానికి తగ్గట్టు పకడ్బందీగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికా బద్ధంగా పోటీల నిర్వహణకు దాదాపు 14 శాఖల సిబ్బంది సహకారంతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రూపకల్పన చేసింది. గత డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు ఈనెల 13వ తేదీతో ముగియనున్నాయి. క్రీడా మాణిక్యాలను ఒడిసిపట్టి, ప్రపంచ వేదికలపై నిలబెట్టేలా తలపెట్టిన ఈ క్రీడా సంబరంలో యావత్తు యువత ఉత్సాహంతో ఉరకలేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో క్రీడాకారులతో పాటు ప్రేక్షకులుగా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు 1.23 కోట్ల రిజిస్ట్రేషన్లతో అతిపెద్ద క్రీడా మహోత్సవంలో భాగస్వాములవ్వడం ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగం సామర్థ్యానికి అద్దం పడుతోంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో మెన్, వుమెన్ విభాగాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా దాటి.. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో నాలుగో దశ పోటీలు విశాఖ వేదికగా ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి. ముగింపు రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విజేతగా నిలిచిన జట్లు ట్రోఫీతో పాటు భారీ నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోనున్నాయి. ఇదో భారీ టాలెంట్ హంట్.. 15004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో గతేడాది డిసెంబర్ 26న అట్టహాసంగా ప్రారంభంమైన ‘ఆడుదాం ఆంధ్ర’ సువిశాల విశాఖ సాగర తీరంలో తుది పోరుకు (ఫైనల్స్‌కు) ఎగిసిపడుతోంది. దాదాపు నెలన్నర కాలంలో 4.60 లక్షల జట్లను పోటీలకు ఎంపిక చేయగా.. 2.93 లక్షల మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఫైనల్స్ పోటీలు.. 13వ తేదీతో ముగియనున్నాయి. 26 జిల్లాలకు చెందిన పల్లెల్లో నుంచి వచ్చిన యువ క్రీడా కెరటాలు అంతర్జాతీయ మైదానాల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. 12వ తేదీ నాటికి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ (డబుల్స్) ఫైనల్స్ పూర్తి చేసి, 13వ తేదీన క్రికెట్ ఫైనల్స్ నిర్వహించి క్రీడా పోటీలను ఘనంగా ముగించేందుకు శాప్ కసరత్తు చేస్తోంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అతిపెద్ద భారీ టాలెంట్ హంట్ చేపట్టడం ఇదే ప్రథమం. దీనికి తోడు గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి సమర్థవంతంగా పోటీలను ముందుకు తీసుకెళ్లడంపై క్రీడావర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో పేరుకు మాత్రమే క్రీడాపోటీలు ఉండేవని.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించే లక్ష్యం కనుమరుగవుతున్న తరుణంలో ‘ఆడుదాం ఆంధ్రా’ తిరిగి క్రీడా రంగానికి జవసత్వాలు తీసుకొచ్చిందని సీనియర్ క్రీడాకారులు ప్రశంసిస్తున్నారు. క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్ బృందాలు, వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘ ప్రతినిధులు టాలెంట్ హంట్ చేస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ప్రతిభగల క్రీడాకారులను గుర్తిస్తున్నాయి. పోటీలు ముగిసిన అనంతరం వారికి వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో అవకాశం కల్పించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 37.35 లక్షల మంది క్రీడాకారుల సత్తా ‘ఆడుదాం ఆంధ్ర’ తొలి ఏడాది ఐదు దశల్లో ప్రతిభగల క్రీడాకారులకు అవకాశం కల్పించింది. 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను భాగస్వాములను చేసి క్రీడల్లో వయసు అంతరాలను తొలగించింది. దాదాపు 37.35 లక్షల మంది వివిధ క్రీడాంశాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 23.58 లక్షల మంది పురుషులు కాగా, 13.77 లక్షల మంది మహిళలున్నారు. వీరు సంప్రదాయ క్రీడా పోటీల్లో (నాన్ కాంపిటీటివ్ విభాగంలో యోగ, మారథాన్, టెన్నికాయిట్)తో పాటు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్‌లో సత్తాచాటారు. 1.49 లక్షల మంది గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్ కోచ్‌లు, క్రీడా సంఘాల పోటీలను తొలి నాలుగు దశల్లో సమర్థవంతంగా నిర్వహించారు. పోటీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రీడాకారుల మొబైల్ ఫోన్లకు సమాచారం ఇస్తూ టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్నారు. నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో విజేతలకు అత్యంత పారదర్శకంగా వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బహుమతులను జమ చేసింది. ఇప్పటికే 95 శాతం పంపిణీ పూర్తి చేసింది. రూ.119.19 కోట్ల బడ్జెట్లో ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తోంది. సుమారు రూ.12.21 కోట్ల నగదు బహుమతులు ప్రదానం చేస్తోంది. క్రీడాకారులకు రూ.42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను ప్రతి సచివాలయానికి సరఫరా చేసింది. ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17.10 లక్షల టీషర్టులు, టోపీలతో కూడిన కిట్లను ఇచ్చింది. క్రీడాకారులకు భోజన, రవాణ, వసతి సౌకర్యాల కోసం ఏకంగా రూ.21 కోట్లకుపైగా ఖర్చు చేసింది. -
రూట్స్ : సేవే శక్తి!
ఉత్సాహం నుంచి శక్తి జనిస్తుంది. మరి ఆ ఉత్సాహం ఎలా వస్తుంది? ఎవరి మాట ఎలా ఉన్నా... విట, జలజ్ దాని దంపతులకు మాత్రం ఆ ఉత్సాహం స్వచ్ఛంద సేవాకార్యక్రమాల ద్వారా వస్తుంది. పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన ఈ దంపతులు తన ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక మంచి పని చేసి చూడండి. అందులో నుంచి వచ్చే శక్తి ఏమిటో మీకే తెలుస్తుంది’ అంటున్నారు... ముందుకు వెళ్లడం మంచిదేగానీ వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా మంచిదే. విటల్, జలజ్ దాని దంపతులు అదే చేశారు. వారి తాత స్వçస్థలం గుజరాత్‌లోని చారిత్రక పట్టణం కపడ్ వంజ్. ఆయన రకరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఒకసారి ఆయన సేవాకార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితో ఎనభై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ‘కపడ్వంజ్ కెలవాణి మండల్’ (కెకెఎం) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ సంస్థ పరిధిలో పదమూడు విద్యాసంస్థలు ఉన్నాయి. ‘కెకెఎం’తో కలిసి పనిచేయడం విట, జలజ్ దంపతులలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత... తమ సేవాకార్యక్రమాలను విస్తృతం చేయడం కోసం ‘దాని ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ‘కెకెఎం’తో పాటు అన్నమిత్ర ట్రస్ట్, ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ‘అన్నమిత్ర’తో కలిసి దేశంలోని 6,500 పాఠశాలలో పిల్లల కోసం మ«ధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ‘బాలకార్మిక వ్యవస్థ పోవాలంటే ముందు పిల్లలకు కడుపు నిండా తిండి దొరకాలి. ఆ భోజనమే వారిని విద్యకు దగ్గర చేస్తుంది. అభివృద్థిపథంలోకి నడిపిస్తుంది’ అంటుంది విట. ‘ప్రథమ్’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి అట్టడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాలలో పాలుపంచుకుంటుంది దాని ఫౌండేషన్. సేవా కార్యక్రమాలే కాకుండా తమ కుమారుడు, ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ముదిత్ కోరిక మేరకు ఆటలపై కూడా దృష్టి సారించారు. ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి క్రీడా నైపుణ్యాలు మెరుగుపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ఆటలకు ప్రాచుర్యాన్ని తీసుకువస్తున్నారు. పాఠశాలలో క్రీడాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రొఫెషనల్ లెవెల్లో పిల్లలను క్రీడల్లో తీర్చిదిద్దడానికి హై–పెర్ఫార్మెన్స్ ప్లాన్స్, హై–పెర్ఫార్మెన్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్‌కు రూపకల్పన చేశారు. గతంతో పోల్చితే విద్యార్థులు ఆటలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇదొక శుభపరిణామంగా చెప్పుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అంటుంది విట... ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. మన దేశంలో కోట్ల జనాభా ఉంది. ఇలాంటి దేశంలో మనం ఛాంపియన్లను తయారు చేయలేమా!’ ‘క్రీడలపై వారి అనురక్తి, అంకితభావాన్ని దగ్గరి నుంచే చూసే అవకాశం వచ్చింది. క్రీడారంగంపై వారు చేపడుతున్న కార్యక్రమాల ప్రభావం తప్పకుండా ఉంటుంది’ అంటున్నాడు ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అభినవ్ బింద్రా. గతకాలం మాట ఎలా ఉన్నా విట ప్రస్తుతం తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతుంది. ‘ఆడ్వర్బ్ టెక్నాలజీ ప్రైవెట్ లిమిటెడ్’ చైర్మన్ జలజ్ కంపెనీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాలకు తగిన సమయం కేటాయిస్తుంటాడు. విట దృష్టిలో స్వచ్ఛంద సేవ అంటే చెక్ మీద సంతకం చేయడం కాదు. యాంత్రికంగా చేసే పని కాదు. మనసుతో చేసే మంచిపని. ప్రజలతో కలిసి పోయి చేసే ఉత్తేజకరమైన పని. ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. – విట, దాని ఫౌండేషన్ -
పైకా క్రీడల్
సాక్షి, కొత్తగూడెం: పల్లె యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రవేశపెట్టిన పైకా జిల్లాలో సరిగా అమలు కావడం లేదు. ఏటా కొద్ది మొత్తంలో విడుదల చేస్తున్న నిధులతోనే సంబంధిత అధికారులు పైకా క్రీడలంటూ హంగామా చేస్తున్నారు తప్ప.. ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం నెరవేరడం లేదు. అలాగే గ్రామీణ క్రీడలకు సంబంధించి జిల్లాకు రెండేళ్ల క్రితం మంజూరైన మినీ స్టేడియాలకు నిధుల నీరసం పట్టుకుంది. పంచాయతీ యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్ (పీవెకెకైఏ) కార్యక్రమాన్ని 2008లో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సంబంధించి 2008 - 09 మొదటి దశ కింద జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం, తిరుమలాయపాలెం, ఇల్లెందు మండలాల్లోని 72 గ్రామ పంచాయతీలను గుర్తించారు. ఇందుకుగాను రూ.91 లక్షలను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధులను పైకా భవన నిర్మాణాలు, క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఖర్చు చేయాలి. అయితే రూ.61 లక్షలు మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన రూ.30 లక్షలు తిరిగి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (షాప్)కు పంపారు. అలాగే 2009 - 10లో రెండో దశ కింద బూర్గంపాడు, మధిర, కొణిజర్ల మండలాల్లోని 58 గ్రామ పంచాయతీలను గుర్తించారు. ఈ దశలో రూ.73 లక్షలు మంజూరు కాగా, రూ.70 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన రూ. 3 లక్షలు జిల్లా క్రీడా అభవృద్ధి సంస్థలోనే మూలుగుతున్నాయి. మూడో దశలో 2011-12లో ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ముదిగొండ, కల్లూరు, కొత్తగూడెం, దుమ్ముగూడెం మండలాల్లోని 127 పంచాయతీలను గుర్తించారు. వీటికి రూ.1.55 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.1.23 కోట్లు ఖర్చు చేయగా, మిగిలిన రూ.29 లక్షలు షాప్‌కు తిరిగి పంపారు. అధికారుల అవగాహన రాహిత్యంతో ఉన్న నిధులను కూడా సద్వినియోగం చేయకుండా తిరిగి పంపడం గమనార్హం. 2012-13కు సంబంధించి అసలు పైకా నుంచి జిల్లాకు నిధులే విడుదల కాలేదు. పైకా పరిధిలో ప్రతి నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియం ఉండాలి. జిల్లాకు గత రెండేళ్ల క్రితం 7 మినీ స్టేడియాలు మంజూరయ్యాయి. ఇందులో చింతకానిలో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. ఇల్లెందు, పినపాక, పాల్వంచ, భద్రాచలం, కల్లూరు, చెరువుమాదారంలోని స్టేడియాల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. పైకా కార్యక్రమాలు లేకపోవడంతో గ్రామాల్లో క్రీడా ప్రతిభ ఉన్న యువతకు గుర్తింపు లేకుండా పోయింది. ఖమ్మం అర్బన్ మండలంగా ఉన్నప్పుడు మండలంలోని 24 గ్రామ పంచాయతీలను పైకా క్రీడా పథకంలో ఎంపిక చేశారు. కేవలం పీఈటీ ఉన్న పంచాయతీల్లో మాత్రమే కొద్దొగొప్పో.. అది కూడా విద్యార్థులకు మాత్రమే వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చారు. మండలంలో కేవలం మూడు పైకా భవనాలను మాత్రమే నిర్మాంచారు. మిగిలిన పంచాయతీల్లో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నార ుు. మధిర మండలంలో ఎక్కడా పైకా భవనాలు నిర్మించలేదు. నిధులు లేవని క్రీడా మైదనాలను కొనుగోలు చేయలేదు. ముదిగొండ మండలంలో 52 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా నాలుగు పాఠశాలల్లోనే క్రీడా మైదానాలున్నాయి. బాణాపురం, వల్లభి, పండ్రేగుపల్లి, గోకినేపల్లి గ్రామాల్లోని క్రీడా మైదానాలు విద్యార్థులు ఆడుకునేందుకు అనుకూలంగా లేవు. కొణిజర్ల, ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో పైకా భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. గ్రామీణ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన పైకా పాఠశాల విద్యార్థులకే పరిమితమైంది. ఆట వస్తువులన్నీ అట్ట పెట్టల్లోనే మూలుగుతున్నాయి. పినపాక నియోజకవర్గంలో ఏ మండల కేంద్రంలోనూ ఇప్పటివరకు ప్రత్యేకంగా క్రీడా మైదానాలు నిర్మించలేదు. పినపాక మండలం బట్టుపల్లికి మంజూరైన మినీ స్టేడియం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గిరిజన యువతలో ప్రతిభను వెలికితీసేందుకు మినీ స్టేడియాలను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. దాని అమలు ఊసేలేదు. కూసుమంచి మండలం కేశ్వాపురం, ముత్యాలగూడెం, చేగొమ్మ గ్రామాల్లో జిల్లా స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులున్నా.. ఇక్కడ మైదానాలు మాత్రం లేవు. దీంతో వీరు ప్రాక్టిస్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గానికి మినీ స్టేడియం మంజూరు చేయనున్నట్లు ప్రకటించినా అదీ అమలు కాలేదు. ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడెం, మర్రిగూడెం, పోలారం పంచాయతీల్లో క్రీడా మైదానాలు లేవు. గార్ల, బయ్యారం మండలాల్లోని ఉన్నత పాఠశాలలకు కూడా ఆట స్థలాలు లేవు. క్రీడా మైదానం లేకపోవడంతో గార్ల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏటా మండల స్థాయి పైకా క్రీడలను నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట మండలంలోని 16 పంచాయతీల్లో పైకా భవనాలను నిర్మించారు. అయితే ప్రతి భవనానికి వాలీబాల్ కిట్, షాట్‌ఫుట్, ఇతర ఆట పరికరాలను సరఫరా చేయాల్సి ఉండగా నేటికీ అవి రాలేదు. పేరాయిగూడెం పంచాయతీలో పైకా భవనాన్ని మోడల్ కాలనీలో నిర్మించారు. కానీ క్రీడా సామగ్రి సరఫరా చేయలేదు. భవనం ఖాళీగా ఉండడంతో అందులో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలం డివిజన్లో ప్రతి మండలానికి రెండు నెలల క్రితం ఒక్కో పంచాయతీకి రూ.10 వేల విలువ గల ఆటవస్తువులను కొనుగోలు చేసి ఇచ్చారు. వీటితో క్రీడలు నిర్వహించేందుకు మైదానాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. భద్రాచలం మండలం చలంపాలెం గ్రామంలో నిర్మించిన పైకా భవనాన్ని ఉపాధ్యాయులు తమ కార్యాలయంగా వాడుకుంటున్నారు. అలాగే తోటపల్లి పంచాయతీలో నిర్మించిన భవనంలో మినీ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలం మండలంలోని 20 పంచాయతీలకు 2011-12 లో ఒక్కో భవనానికి రూ. లక్ష విలువతో భవనాలు మంజూరు చేసినా వాటిలో ఏడు మాత్రమే నిర్మించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలాన్ని పైకాకు ఎంపిక చేశారు. ఈ మండలంలో 23 పంచాయతీలకు గాను 16 పంచాయతీల్లో క్రీడా మైదానాలను ఏర్పాట చేశారు. 11 పైకా భవనాలు రెండేళ్లుగా నిర్మాణంలోనే ఉన్నాయి. సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో పైకా మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగూడెం మండలం పైకా కార్యక్రమానికి ఎంపికైంది. మండలానికి 10 పైకా భవనాలు మంజూరయ్యాయి. ఇందులో ఒక్కటి కూడా నిర్మాణం పూర్తి కాలేదు. మండల, జోనల్ స్థాయి క్రీడలు కొత్తగూడెం పట్టణంలో నిర్వహిస్తున్నారు. అయితే ఇటు పాల్వంచ, కొత్తగూడెం మండలాల్లో పైకా మైదానాలు మాత్రం లేవు.