పైకా క్రీడల్
సాక్షి, కొత్తగూడెం: పల్లె యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రవేశపెట్టిన పైకా జిల్లాలో సరిగా అమలు కావడం లేదు. ఏటా కొద్ది మొత్తంలో విడుదల చేస్తున్న నిధులతోనే సంబంధిత అధికారులు పైకా క్రీడలంటూ హంగామా చేస్తున్నారు తప్ప.. ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం నెరవేరడం లేదు. అలాగే గ్రామీణ క్రీడలకు సంబంధించి జిల్లాకు రెండేళ్ల క్రితం మంజూరైన మినీ స్టేడియాలకు నిధుల నీరసం పట్టుకుంది.
పంచాయతీ యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్ (పీవెకెకైఏ) కార్యక్రమాన్ని 2008లో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సంబంధించి 2008 - 09 మొదటి దశ కింద జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం, తిరుమలాయపాలెం, ఇల్లెందు మండలాల్లోని 72 గ్రామ పంచాయతీలను గుర్తించారు. ఇందుకుగాను రూ.91 లక్షలను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధులను పైకా భవన నిర్మాణాలు, క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఖర్చు చేయాలి. అయితే రూ.61 లక్షలు మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన రూ.30 లక్షలు తిరిగి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (షాప్)కు పంపారు. అలాగే 2009 - 10లో రెండో దశ కింద బూర్గంపాడు, మధిర, కొణిజర్ల మండలాల్లోని 58 గ్రామ పంచాయతీలను గుర్తించారు. ఈ దశలో రూ.73 లక్షలు మంజూరు కాగా, రూ.70 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన రూ. 3 లక్షలు జిల్లా క్రీడా అభవృద్ధి సంస్థలోనే మూలుగుతున్నాయి.
మూడో దశలో 2011-12లో ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ముదిగొండ, కల్లూరు, కొత్తగూడెం, దుమ్ముగూడెం మండలాల్లోని 127 పంచాయతీలను గుర్తించారు. వీటికి రూ.1.55 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.1.23 కోట్లు ఖర్చు చేయగా, మిగిలిన రూ.29 లక్షలు షాప్‌కు తిరిగి పంపారు. అధికారుల అవగాహన రాహిత్యంతో ఉన్న నిధులను కూడా సద్వినియోగం చేయకుండా తిరిగి పంపడం గమనార్హం. 2012-13కు సంబంధించి అసలు పైకా నుంచి జిల్లాకు నిధులే విడుదల కాలేదు. పైకా పరిధిలో ప్రతి నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియం ఉండాలి. జిల్లాకు గత రెండేళ్ల క్రితం 7 మినీ స్టేడియాలు మంజూరయ్యాయి. ఇందులో చింతకానిలో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. ఇల్లెందు, పినపాక, పాల్వంచ, భద్రాచలం, కల్లూరు, చెరువుమాదారంలోని స్టేడియాల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. పైకా కార్యక్రమాలు లేకపోవడంతో గ్రామాల్లో క్రీడా ప్రతిభ ఉన్న యువతకు గుర్తింపు లేకుండా పోయింది.
ఖమ్మం అర్బన్ మండలంగా ఉన్నప్పుడు మండలంలోని 24 గ్రామ పంచాయతీలను పైకా క్రీడా పథకంలో ఎంపిక చేశారు. కేవలం పీఈటీ ఉన్న పంచాయతీల్లో మాత్రమే కొద్దొగొప్పో.. అది కూడా విద్యార్థులకు మాత్రమే వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చారు. మండలంలో కేవలం మూడు పైకా భవనాలను మాత్రమే నిర్మాంచారు. మిగిలిన పంచాయతీల్లో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నార
ుు.
మధిర మండలంలో ఎక్కడా పైకా భవనాలు నిర్మించలేదు. నిధులు లేవని క్రీడా మైదనాలను కొనుగోలు చేయలేదు. ముదిగొండ మండలంలో 52 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా నాలుగు పాఠశాలల్లోనే క్రీడా మైదానాలున్నాయి. బాణాపురం, వల్లభి, పండ్రేగుపల్లి, గోకినేపల్లి గ్రామాల్లోని క్రీడా మైదానాలు విద్యార్థులు ఆడుకునేందుకు అనుకూలంగా లేవు.
కొణిజర్ల, ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో పైకా భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. గ్రామీణ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన పైకా పాఠశాల విద్యార్థులకే పరిమితమైంది. ఆట వస్తువులన్నీ అట్ట పెట్టల్లోనే మూలుగుతున్నాయి.
పినపాక నియోజకవర్గంలో ఏ మండల కేంద్రంలోనూ ఇప్పటివరకు ప్రత్యేకంగా క్రీడా మైదానాలు నిర్మించలేదు. పినపాక మండలం బట్టుపల్లికి మంజూరైన మినీ స్టేడియం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గిరిజన యువతలో ప్రతిభను వెలికితీసేందుకు మినీ స్టేడియాలను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. దాని అమలు ఊసేలేదు.
కూసుమంచి మండలం కేశ్వాపురం, ముత్యాలగూడెం, చేగొమ్మ గ్రామాల్లో జిల్లా స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులున్నా.. ఇక్కడ మైదానాలు మాత్రం లేవు. దీంతో వీరు ప్రాక్టిస్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గానికి మినీ స్టేడియం మంజూరు చేయనున్నట్లు ప్రకటించినా అదీ అమలు కాలేదు.
ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడెం, మర్రిగూడెం, పోలారం పంచాయతీల్లో క్రీడా మైదానాలు లేవు. గార్ల, బయ్యారం మండలాల్లోని ఉన్నత పాఠశాలలకు కూడా ఆట స్థలాలు లేవు. క్రీడా మైదానం లేకపోవడంతో గార్ల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏటా మండల స్థాయి పైకా క్రీడలను నిర్వహిస్తున్నారు.
అశ్వారావుపేట మండలంలోని 16 పంచాయతీల్లో పైకా భవనాలను నిర్మించారు. అయితే ప్రతి భవనానికి వాలీబాల్ కిట్, షాట్‌ఫుట్, ఇతర ఆట పరికరాలను సరఫరా చేయాల్సి ఉండగా నేటికీ అవి రాలేదు. పేరాయిగూడెం పంచాయతీలో పైకా భవనాన్ని మోడల్ కాలనీలో నిర్మించారు. కానీ క్రీడా సామగ్రి సరఫరా చేయలేదు. భవనం ఖాళీగా ఉండడంతో అందులో అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
భద్రాచలం డివిజన్‌లో ప్రతి మండలానికి రెండు నెలల క్రితం ఒక్కో పంచాయతీకి రూ.10 వేల విలువ గల ఆటవస్తువులను కొనుగోలు చేసి ఇచ్చారు. వీటితో క్రీడలు నిర్వహించేందుకు మైదానాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. భద్రాచలం మండలం చలంపాలెం గ్రామంలో నిర్మించిన పైకా భవనాన్ని ఉపాధ్యాయులు తమ కార్యాలయంగా వాడుకుంటున్నారు. అలాగే తోటపల్లి పంచాయతీలో నిర్మించిన భవనంలో మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలం మండలంలోని 20 పంచాయతీలకు 2011-12 లో ఒక్కో భవనానికి రూ. లక్ష విలువతో భవనాలు మంజూరు చేసినా వాటిలో ఏడు మాత్రమే నిర్మించారు.
సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలాన్ని పైకాకు ఎంపిక చేశారు. ఈ మండలంలో 23 పంచాయతీలకు గాను 16 పంచాయతీల్లో క్రీడా మైదానాలను ఏర్పాట చేశారు. 11 పైకా భవనాలు రెండేళ్లుగా నిర్మాణంలోనే ఉన్నాయి. సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో పైకా మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొత్తగూడెం మండలం పైకా కార్యక్రమానికి ఎంపికైంది. మండలానికి 10 పైకా భవనాలు మంజూరయ్యాయి. ఇందులో ఒక్కటి కూడా నిర్మాణం పూర్తి కాలేదు. మండల, జోనల్ స్థాయి క్రీడలు కొత్తగూడెం పట్టణంలో నిర్వహిస్తున్నారు. అయితే ఇటు పాల్వంచ, కొత్తగూడెం మండలాల్లో పైకా మైదానాలు మాత్రం లేవు.