జగన్ సంక్షేమ పథకాలతో చంద్రబాబు, రామోజీరావులకు భయం పట్టుకుందని ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు తోడల్లుడు అప్పారావు తెలిపారు. వారికి ఇక భవిష్యత్ ఉండదని భయపడుతున్నారని వెల్లడించారు. అందుకే జర్నలిజం విలువలకు పాతరేసి ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సహకారంతో రామోజీరావు శంషాబాద్ విమానాశ్రయం వద్ద 450 ఎకరాలు కొన్నారన్నారు. అలాగే అమరావతిలోనూ బినామీల ద్వారా భూములు కొనిపించారని చెప్పారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండానే రాజధానిని ప్రకటించారని తప్పుబట్టారు. అమరావతి ప్రాంతంలో మంచి పంటలు పండే భూములను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ రాజధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఊరు రాజధాని అయిపోయినంత సంతోషంగా ఉందని తెలిపారు. ఈ మేరకు రామోజీరావు తోడల్లుడు అప్పారావు సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...
మా అబ్బాయిని రామోజీరావు వేధించారు..
డాల్ఫిన్ హోటల్‌కు మా అబ్బాయి శ్రీనివాస్ రెండేళ్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కానీ.. మా అబ్బాయిని రామోజీ వేధించారు. దీంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తర్వాత.. డాల్ఫిన్ హోటల్‌కు ఎండీగా తన కోడలు విజయేశ్వరిని రామోజీ నియమించుకున్నారు. ఇక కళాంజలిని మా అమ్మాయి ఎంతో అభివృద్ధి చేసింది. ఆమెని కూడా బయటకు తరిమేశారు.
రామోజీరావు, చంద్రబాబు గురుశిష్యులు
చంద్రబాబు సహకారంతో రామోజీ అన్నింటినీ నిలబెట్టుకుంటూ వచ్చారు. శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తున్నప్పుడు 400 నుంచి 450 ఎకరాలు రామోజీరావు కొనుగోలు చేశారు. అదేవిధంగా అమరావతిలో రాజధాని అని ముందుగానే చంద్రబాబు సంకేతాలు ఇవ్వడంతో అక్కడ కూడా రామోజీ తన బినామీలతో భూములు కొనిపించారు. ఆ విషయంలో చంద్రబాబు, రామోజీ ఇద్దరూ గురుశిష్యులు... టూ ఇన్ వన్. చంద్రబాబుది పవర్.. రామోజీది కోరిక.
జగన్‌ను చూసి రామోజీ, చంద్రబాబులో భయం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు చూసి.. రామోజీ, చంద్రబాబులో భయం ఏర్పడింది. ఇదే తరహాలో జగన్ వెళ్తే.. తమకు భవిష్యత్తు ఉండదనివారిద్దరూభయపడుతున్నారు. అందుకే పూర్తిగా బరితెగించి.. జర్నలిజం విలువల్ని రామోజీరావు దిగజార్చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంపైనా ఇష్టం వచ్చి నట్లుగా రాతలు రాస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఈనాడు ద్వారా బయటవాళ్లకు మాత్రం నీతులు చెబుతూ.. తాను మాత్రం పాటించననే అహం రామోజీరావుకే సొంతం.
రామోజీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు..
రాజకీయాలకు ఎన్టీఆర్ కొత్త. ఆ సమయంలో ఎన్టీఆర్ రామోజీని విశ్వసించేవారు. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తుంటే ముందు రామోజీకి చెప్పేవారు. క్రమంగా ఎన్టీఆర్ జాతీయ నేతగా ఎదుగుతున్న సమయంలో కొన్నిసార్లు రామోజీకి చెప్పకుండానే కొన్ని పనులు చేశారు. దీంతో రామోజీకి భయం పట్టుకుంది. ఎన్టీఆర్ తన గుప్పిట నుంచి జారిపోతున్నారని భావించారు. యూఎల్‌సీకి సంబంధించి ఈనాడుకు చెందిన ఫైల్ వెళ్తే ఎన్టీఆర్ దాన్ని పక్కన పెట్టమని అధికారులకు చెప్పారు. అప్పట్లో ఉపేంద్ర అనే వ్యక్తి ఎన్టీఆర్‌కు పీఏగా ఉండేవారు.
అయితే.. అతడి వ్యవహారం నచ్చక ఎన్టీఆర్ పక్కన పెట్టేశారు. ఆ సమయంలో చంద్రబాబు వచ్చారు. అప్పటి నుంచి రామోజీరావు, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్‌కు ప్రతికూలంగా మారిపోయారు. వైస్రాయ్ హోటల్ సాక్షిగా దుర్మార్గానికి తెరతీసి ఆయనను పదవీచ్యుతుడిని చేశారు. అప్పట్లో లిక్కర్ కాంట్రాక్టర్‌ల నుంచి చంద్రబాబుకు భారీగా నిధులు ముట్టిన విషయం తెలిసి.. ఈనాడులో దీనిపై కార్టూన్ వేశారు. ఆ మరుసటి రోజు చంద్రబాబు రామోజీ కాళ్లు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ ఒక్కటైపోయారు.
శివరామకృష్ణన్ నివేదిక బయటకు రాకుండానే రాజధాని ప్రకటన
శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆ కమిటీ నివేదికను పూర్తిగా మార్చేశారు. నారాయణను బినామీగా పెట్టుకొని.. ఆయనతో పనికిరాని నివేదిక ఇప్పించారు. అలాగే శివరామకృష్ణన్ నివేదిక బయటకు రాకుండానే అమరావతిని ప్రకటించారు. రామోజీరావుతో శంషాబాద్ వద్ద 450 ఎకరాలు కొనిపించినట్లుగానే అమరావతి ప్రకటనకు ముందు అక్కడ వాళ్ల వాళ్లతో భూములు కొనిపించారు. మంచి పంటలు పండే భూములను నాశనం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖను రాజధాని చేయడం అవసరం. అలాగే కర్నూలును కూడా న్యాయ రాజధానిగా చేయాలి.
ప్రజలు వైఎస్ జగన్‌తోనే ఉంటారు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో 2019లో విజయం సాధించారు. ప్రస్తుతం అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా సామాన్య ప్రజల అన్ని అవసరాలు తీరుస్తున్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కూడా బాగా జరిగింది. ప్రజలు తప్పకుండా జగన్‌తోనే ఉంటారు. ఆయనను మించిన మగాడెవరూ కనిపించడం లేదు.
రామోజీలో మానవత్వం లోపించింది
మనుషుల్లో ఆప్యాయత, అనురాగం ఉండాలి. కానీ రామోజీలో మానవత్వం లోపించింది. ఆనాడు మేము బయటకు రావడానికి, ఈనాడు ప్రజలు ఆయనకు దూరమవ్వడానికి ఇదే కారణం. ఆయన ప్రజలను పూర్తిగా విశ్వసించి ఉంటే ఈనాడులో ఈ తరహా రాతలు ఉండేవి కాదు.
ప్రతి ఊరు రాజధాని అయినంత సంతోషంగా ఉంది
అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతుంటే ఇబ్బంది ఏముంది? ఒక దగ్గరే పాలన చేయాలనేముంది? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఊరు రాజధాని అయిపోయినంత హ్యాపీగా ఉంది. గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ఎవరూ రాజధానికి వెళ్లాల్సిన పనిలేదు. అందరికీ వారున్న గ్రామాల్లోనే అన్నీ అందుతున్నాయి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎలా తన ఛరిష్మాతో జనంలో నాటుకుపోయారో.. అదే తరహాలో జగన్ కూడా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment