‘‘కథలే యాక్టర్స్‌ను హీరోలుగా చేస్తాయి. అందుకనే నేను కథలనే నమ్ముతాను. మంచి కథల్లో భాగమవ్వాలని కోరుకుంటాను. దర్శకుడి విజన్‌ను నమ్ముతాను’’ అన్నారు సంతోష్ శోభన్. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. కావ్యా థాపర్, శ్రద్ధా దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 27 నుంచి అమెజాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రం ప్రసారం అవుతోంది. ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంతోష్. ఇంకా ‘సాక్షి’తో సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన కొంత సమయం తర్వాత నుంచి నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఫోన్ చేసి అభినందిస్తున్నారు. సక్సెస్ అంటే ఇలా ఉంటుందా? అని నాకు తెలిసొచ్చింది.
బోల్డ్ కంటెంట్ కదా! ఇలాంటి సినిమాను వ్యూయర్స్ చూస్తారా? అని కొందరు అన్నారు. కానీ మంచి కంటెంట్, కొత్త కథలను ప్రోత్సహించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధం గానే ఉంటారన్న మా నమ్మకం నిజమైంది. నేను చేసిన ‘పేపర్‌బాయ్’ సినిమా చూసి గత ఏడాది దర్శకుడు మేర్లపాక గాంధీ నన్ను పిలిచి ఈ కథ చెప్పారు. ఈ చిత్రదర్శకుడు కార్తీక్ రాపోలు భవిష్యత్‌లో మంచి దర్శకుడు అవుతాడు. జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి. అయితే మాట్లాడి పరిష్కరించుకోదగిన సమస్యలు ఏవి? తెలుసుకోవడం ద్వారా తీరిపోయే సమస్యలు ఏవి? అనే ఓ అవగాహనకు వస్తే మన ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు వ్యక్తపరచడానికి ఇబ్బందిగా ఉందని, అసౌకర్యంగా ఉందని కొన్ని సమస్యలను జీవితాంతం భరించకూడదు.
మా సినిమా పాయింట్ ఇదే. ప్రభాస్, రామ్‌చరణ్‌గార్లు మా సినిమాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. నాలో ప్రతిభ ఉందని నమ్మి, నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు వంశీ, విక్కీగార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా పన్నెండేళ్ల వయసులో నాన్నగారు (‘వర్షం’ చిత్రదర్శకులు శోభన్) నాకు దూరమయ్యారు. అప్పుడు నాకు అంతగా మెచ్యూరిటీ లేదు. కానీ మా నాన్నగారిలో ఉన్న నిజాయతీ, ఒదిగి ఉండటం, ముక్కుసూటితనం వంటివన్నీ మనసులో నాటుకుపోయాయి. ఇతరులకు హాని చేయాలనుకోరు. ఆయనలోని ఈ లక్షణాలను నేను అలవరచుకుంటున్నాను’’ అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ– ‘‘చిరంజీవి, ప్రభాస్ గార్లంటే నాకు చాలా ఇష్టం. దర్శకత్వం అనేది ప్రత్యేక ప్రతిభ. అది నాలో లేదనుకుంటున్నాను. యాక్టర్‌గానే కెరీర్‌లో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. యూవీ క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌లో సినిమాలు కమిటయ్యాను. నా స్నేహితుడు ప్రొడ్యూసర్‌గా ఉన్న ఓ సినిమాలో హీరోగా చేయనున్నాను. నేను నటించిన ఓ వెబ్‌సిరీస్ విడుదల కావాల్సి ఉంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment