టైటిల్ : ప్రేమ్ కుమార్
నటీనటులు : సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్ తదితరులు
నిర్మాణ సంస్థ: సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత: శివప్రసాద్ పన్నీరు
రచన, దర్శకత్వం: అభిషేక్ మహర్షి
సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్
సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం
విడుదల తేది: ఆగస్ట్ 18, 2023
కథేంటంటే..
ప్రేమ్ కుమార్(సంతోష్ శోభన్), నేత(రాశి సింగ్)కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. కాసేపట్లో మూడు ముళ్లు పడతాయనగా.. మండపంలోకి రైజింగ్ స్టార్ రోషన్ బాబు(కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు. నేత్రని ప్రేమిస్తున్నాని చెప్పి.. మండపంలో నుంచి ఆమెను తీసుకెళ్తాడు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్‌కి పిల్ల దొరకదు. పెళ్లి చూపులకు వెళ్లడం.. క్యాన్సిల్ అవ్వడం ఇదే తంతు. చివరకు పెళ్లిపై విరక్తి వచ్చి.. స్నేహితుడు సుందరలింగం(కృష్ణ తేజ)తో కలిసి ‘పీకే డిటెక్టివ్ ఏజెన్సీ’ని స్టార్ట్ చేస్తాడు.
లవర్స్‌ని విడగొట్టడం..పెళ్లి క్యాన్సిల్ చేయడం.. భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటే..వారిని దూరం చేయడం వీళ్ల పని. భార్యలపై అనుమానం చాలా మంది ‘పీకే డిటెక్టివ్ ఏజెన్సీ’ని కలుస్తారు. ఇలా డబ్బలు సంపాదిస్తూ ఆనందంగా ఉంటున్న ప్రేమ్ కుమార్ జీవితంలోకి మళ్లీ నేత్ర వస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? రైజింగ్ స్టార్ రోషన్, నేత్రను కాదని అంగనా(రుచితా సాధినేని)ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యాడు? విషయం తెలుసుకున్న నేత్ర ఏం చేసింది? నేత్ర పెళ్లి చెడగొట్టమని ప్రేమ్ కుమార్‌తో డీల్ కుదుర్చుకున్నదెవరు? ఇంతకీ ప్రేమ్ కుమార్‌కి పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ప్రేమ్ కుమార్ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
‘చాలా సినిమాల్లో క్లైమాక్స్‌లో పెళ్లి జరుగుతుంటుంటే హీరో వచ్చి.. హీరోయిన్ తండ్రికి నాలుగు నీతి వ్యాఖ్యాలు చెప్పడం.. అతను ఎమోషనల్ అయి తన కూతురిని హీరోకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. కానీ అక్కడ ఒకడు మాత్రం అలా బొమ్మలా నిలబడిపోతాడు. వాడి పరిస్థితి ఏంటి? ఎంత మందికి కార్డులిచ్చాడో.. ఎన్ని అప్పులు చేశాడో..బట్టలు ఎలా కొనుకున్నాడో?.. అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. అలాంటి వాడిపై దర్శకుడు అభిషేక్ చేసిన సినిమానే ‘ప్రేమ్ కుమార్’. వినడానికి ఇది ఆసక్తికరమైన పాయింటే అయినా..దానిని తెరపై చూపించడం దర్శకుడు కాస్త తడబడ్డాడు.అభిషేక్ మహర్షి రాసుకున్న కథలో విషయం ఉంది కానీ కథనం మాత్రం అంత ఆసక్తికరంగా ముందుకు సాగదు.
ప్రేమ్ కుమార్, నేత్రల పెళ్లి ఆగిపోయే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఎలాంటి సాగదీత లేకుండా తొలి సీన్‌తోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది చూపించాడు. హీరో పెళ్లి కోసం తల్లి తాపత్రాయపడడం.. అవి క్యాన్సిల్ అవడం..మధ్యలో మందు పార్టీ.. ఇలా రొటీన్ సన్నివేశాలతో కథనం ముందుకు సాగుతుంది. ‘పీకే డిటెక్టివ్ ఏజెన్సీ’ ఏర్పాటు చేసిన తర్వాత కథపై కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది. అక్కడ కూడా కామెడీకి చాలా స్కోప్ ఉన్నా..దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. అంగనా పాత్ర ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత కథనం ఎలా సాగుతుందో ఊహించొచ్చు. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది కానీ ప్రధాన పాత్రల మధ్య ఉన్న సంఘర్షణను బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఈ సినిమా థియేటర్‌లో ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. ఓటీటీ ప్రేక్షకులను కాస్త ఎంటర్‌టైన్ చేసే అవకాశం ఉంది.
ఇక నటీనటుల విషయాలకొస్తే.. ఎప్పటిమాదిరే సంతోష్ శోభన్ తన న్యాచురల్ యాక్టింగ్‌తో ప్రేమ్ కుమార్ పాత్రకు న్యాయం చేశాడు. కృష్ణతేజతో కలిసి చేసే కామెడి హిలేరిస్‌గా ఉంటుంది. నేత్రగా రాశి సింగ్, అంగనాగా రుచితా సాధినేని ఉన్నంతలో చక్కగా నటించారు. ఇక హీరో మేనేజర్ డాడీ పాత్రలో సుదర్శన్ పండించిన కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. హీరో రోషన్ బాబుగా కృష్ణ చైతన్య పర్వాలేదు. హీరో తల్లిగా సురభి ప్రభావతి, హీరోయిన్ తండ్రిగా రాజ్ మాదిరాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు.
Comments
Please login to add a commentAdd a comment