ఈనాడు పత్రికాధిపతి రామోజీరావును కీర్తిస్తూ చాలామంది చాలా మాటలు అంటూంటారు. మీడియా మొఘల్ వంటి భుజకీర్తులు చాలానే తొడుగుతూంటారు. ఈ జాబితాలోకి నమ్మకద్రోహి, అవకాశవాదీ వంటివి కూడా చేరిస్తే బాగుంటుందేమో అంటున్నారు ఆయన తోడల్లుడు... డాల్ఫిన్ అప్పారావు! విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని ఈనాడు కార్యాలయం డాల్ఫిన్ అప్పారావు, ఈయన మేనమామలదే.
వ్యాపారం కోసమని 33 ఏళ్లపాటు వాడుకోమని లీజుకిస్తే రామోజీరావు మోసం చేశాడని, గడవు తీరిన తరువాత కూడా రకరకాల కారణాలు, పేచీలతో కోర్టుల చుట్టూ తిప్పుతూ స్థలం ఖాళీ చేయకుండా తనకు ద్రోహం తలపెట్టారని ఆయన ఈమధ్యే ‘సాక్షి’ టీవీతో తన గోడు వెళ్లబోసుకున్నారు. రామోజీరావు నమ్మిన వాళ్లను మోసం చేయడం ఇదే మొదటిసారి కాదులెండి. 1974లో విశాఖపట్నంలో ఈనాడు మొదలైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ ఉదంతాలకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని కథనాలు వార్తా పత్రికల్లోనూ అచ్చు అయ్యాయి.
అక్కడేం జరిగింది?
విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈనాడు తన మొట్టమొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం చాలామందికి తెలుసు. అయితే ఆ స్థలం ఎవరిదన్న విషయం తెలిసింది కొద్దిమందికే. ఈశ్వర కుమార్ వర్మ అనే వ్యక్తి ఈ స్థలాన్ని రామోజీరావుకు లీజుకిచ్చారు. దీర్ఘకాలిక లీజు. కచ్చితంగా చెప్పాలంటే 33 ఏళ్లు. హైదరాబాద్‌లోని సోమాజీగూడలో ఉన్న ఈనాడు ప్రధాన కార్యాలయం కూడా ఈ కుటుంబానిదేనని, రెండు చోట్లా లీజు గడువు ముగిసిన తరువాత కూడా స్థలం ఖాళీ చేసి యజమానులకు అప్పగించకుండా రామోజీ తన పేచీకోరు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని డాల్ఫిన్ అప్పారావు సాక్షి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇదంత ఒక ఎత్తు అయితే లీజుకు తీసుకున్న స్థలం తన సొంతమైనట్లు రోడ్డు విస్తరణ కోసమని ప్రభుత్వానికి అప్పగించడం.. ప్రతిగా అందే పరిహారాన్ని కూడా తన ఖాతాల్లో, తనవారి ఖాతాల్లో వేయించుకోవడం ఇంకో ఎత్తు. విశాఖపట్నం స్థలం 2.70 ఎకరాల్లో సుమారు 517 చ.మీటర్ల స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి (రోడ్డు విస్తరణ కోసం) అప్పగించినందుకు గాను పరిహారంగా ఇచ్చిన 872 చ.మీటర్ల స్థలాన్ని రామోజీ తన పేరుతో రాయించుకున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. అందుకేనేమో.. డాల్ఫిన్ అప్పారావు కూడా రామోజీని ‘కఠిన దుర్మార్గుడు’ అని అభివర్ణించారు.
ఈశ్వర కుమార్ వర్మ కుటుంబానికే చెందిన స్థలంలో హైదరాబాద్‌లోని ఈనాడు కేంద్ర కార్యాలయం నిర్మించారని చెప్పుకున్నాం కదా.. ఈ విషయంలోనూ రామోజీరావు ఆడిన డ్రామా అంత ఇంత కాదని డాల్ఫిన్ అప్పారావు చెబుతారు. లీజు ముగిసిన తరువాత స్థలాన్ని ఖాళీ చేయకపోగా...స్థలాన్ని తనకే అమ్మేయాలని డిమాండ్ చేయడం.. అది కూడా పావల అర్ధకు ఇచ్చేయాలని చెప్పడం రామోజీరావు నైజాన్ని బయటపెడుతుందన్న విమర్శలున్నాయి. ఆఖరుకు సుప్రీంకోర్టు జోక్యం తరువాత గతిలేని పరిస్థితుల్లో హైదరాబాద్ ఈనాడు ప్రధాన కార్యాలయం ఉన్న స్థలాన్ని ఆయన కొనుగోలు చేయాల్సి వచ్చింది!
ఏతావాతా.. లీజు పేరుతో స్థలం తీసుకోవడం.. గడువు తీరినా ఖాళీ చేయకపోవడం.. పత్రికను అడ్డుపెట్టుకుని లీజుదారులను బెదిరించడం.. కోర్టుల చుట్టూ తిప్పడం ద్వారా అలసిపోయేలా చేసి రాజీకి ఒప్పించడం! ఇదీ రామోజీ మోడస్ ఆపరాండీ అంటారు డాల్ఫిన్ అప్పారావు. హైదరాబాద్, విజయవాడ స్థల వివాదాలను పరిశీలిస్తే ఇవన్నీ నిజమేనని అంగీకరించక తప్పదు! డాల్ఫిన్ అప్పారావు మాటల్లోనే చెప్పాలంటే న్యాయం జరగడంలో కొంత ఆలస్యమైతే కావచ్చు కానీ.. ఎప్పటికైనా సత్యం, ధర్మం గెలిచి తీరుతాయి! ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే!
Comments
Please login to add a commentAdd a comment