సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి వెల్లడించారు. మున్సిపల్ డివిజన్ల డీ లిమిటేషన్, రిజర్వేషన్లు, ఎన్నికలు పాత జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారమా.. కాదా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వ స్పందన మేరకు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారై తమకు అందాక నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. డివిజన్ల డీ లిమిటే షన్‌కు సంబంధించి వైఖరిని వెల్లడించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు.
పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయని, సంబంధించిన జీవోలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించే వరకు ఓటర్లు తమ ఓట్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరుందో.. లేదో.. చెక్ చేసుకుని, లేకపోతే పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల కోసం ఎస్‌ఈసీ మొబైల్‌యాప్ కూడా అందుబాటులో ఉంచిందని, ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లోనూ తమ ఓటు ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలు చూసుకోవచ్చన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో పార్ధసార«థి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ఓటరే కీలకం...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో ఓటర్‌దే కీలకపాత్ర. ఓటు హక్కున్న ప్రతీ పౌరుడు ఓటు వేయ డాన్ని బాధ్యతగా తీసుకో వాలి. వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేం దుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు పోస్టర్లు, ప్రకటనలతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం, సెలబ్రిటీల సందేశాలు వంటివి చేపడుతున్నాం.
సవాళ్లతో కూడుకున్నదే...
కరోనా భయం నేపథ్యంలో ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రజలను మోటివేట్ చేసే చర్యలు తీసుకుంటున్నాం. ఓటేసేందుకు అవసరమైన సురక్షిత చర్యలను చేపడుతున్నాం. బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. వాటిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టాం.
అన్ని పరిశీలించాకే ఈ–ఓటింగ్..
కరోనా నేపథ్యంలో ఓటింగ్ పెంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటేసేందుకు పరిస్థితులు అనుకూలించని వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బంది కోసం ఈ–ఓటింగ్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాలని భావిస్తున్నాం. అయితే ఐటీశాఖ నుంచి సాఫ్ట్‌వేర్ అందాక, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నాకే పైలట్ బేసిస్‌తో చేపట్టడంపై నిర్ణయం తీసుకుంటాం.
ఏర్పాట్లు పూర్తికావొస్తున్నాయి...
ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) నుంచి అసెంబ్లీ ఓటర్ల జాబితా డేటా త్వరలోనే రానుంది. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ ఏరియా వరకు 26 శాసనసభ నియోజకవర్గాల వారీగా 30 మంది జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు కార్పొరేషన్ డివిజన్ల వారీగా అసెంబ్లీ జాబితాలతో ఓటర్ల జాబితాలను మ్యాపింగ్ చేసి ఎస్‌ఈసీకి ఇవ్వగానే పోలింగ్ స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటాం. ఈ ప్రక్రియకు ముందు పోలింగ్‌బూత్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భవనాల ఎంపికను అధికారులు పూర్తిచేస్తారు.
బూత్‌కు వెయ్యిమంది ఓటర్లు...
ఒక్కో పోలింగ్ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లుండేలా చూడాలని ఈసీ ఇదివరకే సూచించింది. దీనికనుగుణంగా ఏర్పాట్లుచేస్తాం. వెయ్యికంటే తక్కువ మందికి ఒక బూత్ చేయాలనే ఆలోచన ఉన్నా బిల్డింగ్‌లు, సిబ్బంది ఏ మేరకు అందుబాటులో ఉంటాయనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.
ఫేస్ రికగ్నిషన్ పద్ధతి...
150 పోలింగ్ బూత్‌లలో ఫేస్ రికగ్నిషన్ అమలుకు ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించాం. వీటి కోసం ఎంపిక చేసే భవనాల్లో సరైన వెలుతురు, ఇంటర్నెట్, ఇతర సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించాం. ఐటీ శాఖ, టెక్నాలజీ సర్వీసెస్ విభాగం సహకారంతో ఈ ప్రక్రియను చేపడుతున్నాం.
ఈవీఎంలా, బ్యాలెటా.. త్వరలోనే నిర్ణయం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ బ్యాలెట్ పేపర్లతోనా.. ఈవీఎంలతోనా.. అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు అందాయి. ఏ విధానంతో ఎలాంటి సమస్యలు అన్న దానిని పరిశీలించి, నిపుణుల సలహాలు తీసుకున్నాక దీనిని ప్రకటిస్తాం. (చదవండి: బ్యాలెట్‌తోనే జీహెచ్‌ఎంసీ పోరు!)
Comments
Please login to add a commentAdd a comment