ఒక మంచి ఆలోచన సమాజాన్ని మారుస్తుంది | sakshi interview with yogi vemana university vice chancellor surya kalavathi | Sakshi
Sakshi News home page

ఒక మంచి ఆలోచన సమాజాన్ని మారుస్తుంది

Published Fri, Apr 29 2022 3:45 AM | Last Updated on Fri, Apr 29 2022 3:47 AM

sakshi interview with yogi vemana university vice chancellor surya kalavathi - Sakshi

సూర్య కళావతి; జాబ్‌ మేళా వేదిక యోగి వేమన యూనివర్సిటీ, కడప

కాలేజ్‌లో సీటు, పరీక్షల్లో మంచి పర్సంటేజీలు తెచ్చుకున్నంత సులువు కాదు ఉద్యోగం సాధించడం. ఈ ఘట్టాన్ని సులభతరం చేయడానికి అనేక విద్యాసంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు నిర్వహిస్తుంటాయి. కానీ, నిరుద్యోగిత లెక్కలు మాత్రం ప్లేస్‌మెంట్‌ ప్రయత్నాలు సరిపోవడం లేదనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు యోగి వేమన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ సూర్య కళావతి. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగంతో కలిసి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు.  

‘‘మా యూనివర్సిటీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఏటీఏ), ఇండియా విభాగం గత కొన్ని నెలలుగా జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. ఈ సంగతి తెలిసిన తరవాత మా జిల్లా విద్యార్థులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మే నెల రెండవ తేదీన మా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నాం. ఏటీఏ ఇండియా చాప్టర్‌ సమన్వయం కుదిర్చిన అనేక పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఈ జాబ్‌మేళా టార్గెట్‌ ఆరువేల ఉద్యోగాలు. టెన్త్‌ క్లాస్‌ నుంచి పీజీ వరకు అందరికీ ఇది అనువైన వేదిక. గార్మెంట్‌ మేకింగ్‌ యూనిట్‌ల నుంచి మొబైల్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు, ఆటోమొబైల్‌ కంపెనీలు, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా వస్తున్నాయి. టెక్నికల్‌ – నాన్‌ టెక్నికల్, ఐటీ, బీపీవో వరకు అన్ని రకాల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది.

మంచి సహకారం  
మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే... పదిమంది తలా ఒక చెయ్యి వేసి విజయవంతం చేస్తారని అంటారు. అదేవిధంగా మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి చాలామంది సహకారం అందిస్తున్నారు. ఆ రోజున వచ్చే వేలాదిమందికి ఆహారపానీయాలను సమకూర్చడానికి శ్రీ సంపద గ్రూప్‌ కంపెనీ, జీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌లు ముందుకు వచ్చాయి. ఏటీఏ చాలా శ్రద్ధగా మంచి కంపెనీలను అనుసంధానం చేసుకుంది. వాళ్లు ఉద్యోగులకు ఇన్సూరెన్స్, పీఎఫ్‌ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వాళ్లిస్తున్న శాలరీ ప్యాకేజ్‌లు ఏడాదికి లక్షా పాతిక వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి. ఇది మా యూనివర్సిటీకి మాత్రమే కాదు, జిల్లాలో అందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చిన్న పట్టణాల్లో చదివే వాళ్లకు పెద్ద భరోసా’’ అన్నారు సూర్య కళావతి. ప్రభుత్వం స్థాపించిన విద్యాసంస్థలు సామాజిక బాధ్యతను మరింతగా చేపట్టి ఇలాంటి కార్యక్రమాలకు వేదికలవుతుంటే యువతరం ఆలోచనలు కూడా ఆదర్శవంతంగా సాగుతాయి. మరోతరానికి స్నేహహస్తాలుగా మారుతాయి.

వేలాది ఉద్యోగాలకు వేదిక!
మా అమ్మది కడప జిల్లా బలపనూరు. నేను పుట్టింది అనంతపురం జిల్లా కదిరి. ఇంటర్‌ వరకు అక్కడే చదివాను. బీటెక్‌ కడపలోని కేఎస్‌ఆర్‌ఎమ్‌లో. ఎంటెక్‌ ఎస్‌వీయూ, పీహెచ్‌డీ జేఎన్‌టీయూ హైదరాబాద్, పోస్ట్‌ డాక్టరేట్‌ పిట్స్‌బెర్గ్‌లోని కార్నెగీ మెలన్‌ యూనివర్శిటీలో. నా ఉద్యోగ జీవితం కడపలో నేను చదువుకున్న కేఎస్‌ఆర్‌ఎమ్‌ కాలేజ్‌తోనే మొదలైంది. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు మా యూనివర్సిటీ విద్యార్థుల కోసమే ఈ ప్లేస్‌ మెంట్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించాం. ఇప్పుడు జిల్లా అంతటికీ ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ‘చదువుకున్నాను, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు’ అని ఎవరూ ఆందోళన చెందకూడదనేది నా అభిలాష. అందుకే ఏటీఏ గురించి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.
– మునగాల సూర్యకళావతి, వైస్‌ చాన్స్‌లర్, యోగి వేమన యూనివర్సిటీ, కడప.

అనూహ్యమైన స్పందన!
అమెరికన్‌ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం ఈ ఏడాది జాబ్‌మేళా కాన్సెప్ట్‌ తీసుకుంది. ఇప్పటివరకు కుప్పం, పుంగనూరు, తిరుపతి నగరాల్లో నిర్వహించాం. ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు అదే రోజు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ కేంద్రంగా ఉద్యోగాలుంటాయి. మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. మా టీమ్‌లో ఉన్న కిరణ్‌ రాయల్‌ అయితే ఉద్యోగాల్లో ఉండే సవాళ్ల గురించి ఓరియెంటేషన్‌ ఇస్తుంటారు. ఈ సోషల్‌ కాజ్‌లో అందరం ఉత్సాహంగా పని చేస్తున్నాం. యోగి వేమన యూనివర్సిటీ మెగా జాబ్‌ మేళా తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పుట్టపర్తి, కదిరి, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో కూడా జాబ్‌ మేళా నిర్వహించడానికి క్యాలెండర్‌ సిద్ధమవుతోంది.  
– జి. సూర్యచంద్రారెడ్డి, కో ఆర్డినేటర్, అమెరికన్‌ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం

 – వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement