mega jobmela
-
ఒక మంచి ఆలోచన సమాజాన్ని మారుస్తుంది
కాలేజ్‌లో సీటు, పరీక్షల్లో మంచి పర్సంటేజీలు తెచ్చుకున్నంత సులువు కాదు ఉద్యోగం సాధించడం. ఈ ఘట్టాన్ని సులభతరం చేయడానికి అనేక విద్యాసంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటాయి. కానీ, నిరుద్యోగిత లెక్కలు మాత్రం ప్లేస్మెంట్ ప్రయత్నాలు సరిపోవడం లేదనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు యోగి వేమన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సూర్య కళావతి. అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగంతో కలిసి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ‘‘మా యూనివర్సిటీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ), ఇండియా విభాగం గత కొన్ని నెలలుగా జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. ఈ సంగతి తెలిసిన తరవాత మా జిల్లా విద్యార్థులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మే నెల రెండవ తేదీన మా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఏటీఏ ఇండియా చాప్టర్ సమన్వయం కుదిర్చిన అనేక పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఈ జాబ్‌మేళా టార్గెట్ ఆరువేల ఉద్యోగాలు. టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు అందరికీ ఇది అనువైన వేదిక. గార్మెంట్ మేకింగ్ యూనిట్ల నుంచి మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా వస్తున్నాయి. టెక్నికల్ – నాన్ టెక్నికల్, ఐటీ, బీపీవో వరకు అన్ని రకాల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మంచి సహకారం మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే... పదిమంది తలా ఒక చెయ్యి వేసి విజయవంతం చేస్తారని అంటారు. అదేవిధంగా మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి చాలామంది సహకారం అందిస్తున్నారు. ఆ రోజున వచ్చే వేలాదిమందికి ఆహారపానీయాలను సమకూర్చడానికి శ్రీ సంపద గ్రూప్ కంపెనీ, జీఎస్ఆర్ ఫౌండేషన్లు ముందుకు వచ్చాయి. ఏటీఏ చాలా శ్రద్ధగా మంచి కంపెనీలను అనుసంధానం చేసుకుంది. వాళ్లు ఉద్యోగులకు ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వాళ్లిస్తున్న శాలరీ ప్యాకేజ్‌లు ఏడాదికి లక్షా పాతిక వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి. ఇది మా యూనివర్సిటీకి మాత్రమే కాదు, జిల్లాలో అందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చిన్న పట్టణాల్లో చదివే వాళ్లకు పెద్ద భరోసా’’ అన్నారు సూర్య కళావతి. ప్రభుత్వం స్థాపించిన విద్యాసంస్థలు సామాజిక బాధ్యతను మరింతగా చేపట్టి ఇలాంటి కార్యక్రమాలకు వేదికలవుతుంటే యువతరం ఆలోచనలు కూడా ఆదర్శవంతంగా సాగుతాయి. మరోతరానికి స్నేహహస్తాలుగా మారుతాయి. వేలాది ఉద్యోగాలకు వేదిక! మా అమ్మది కడప జిల్లా బలపనూరు. నేను పుట్టింది అనంతపురం జిల్లా కదిరి. ఇంటర్ వరకు అక్కడే చదివాను. బీటెక్ కడపలోని కేఎస్ఆర్ఎమ్లో. ఎంటెక్ ఎస్వీయూ, పీహెచ్డీ జేఎన్టీయూ హైదరాబాద్, పోస్ట్ డాక్టరేట్ పిట్స్బెర్గ్లోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో. నా ఉద్యోగ జీవితం కడపలో నేను చదువుకున్న కేఎస్ఆర్ఎమ్ కాలేజ్తోనే మొదలైంది. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు మా యూనివర్సిటీ విద్యార్థుల కోసమే ఈ ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఇప్పుడు జిల్లా అంతటికీ ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ‘చదువుకున్నాను, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు’ అని ఎవరూ ఆందోళన చెందకూడదనేది నా అభిలాష. అందుకే ఏటీఏ గురించి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. – మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, యోగి వేమన యూనివర్సిటీ, కడప. అనూహ్యమైన స్పందన! అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం ఈ ఏడాది జాబ్‌మేళా కాన్సెప్ట్ తీసుకుంది. ఇప్పటివరకు కుప్పం, పుంగనూరు, తిరుపతి నగరాల్లో నిర్వహించాం. ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ కేంద్రంగా ఉద్యోగాలుంటాయి. మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. మా టీమ్‌లో ఉన్న కిరణ్ రాయల్ అయితే ఉద్యోగాల్లో ఉండే సవాళ్ల గురించి ఓరియెంటేషన్ ఇస్తుంటారు. ఈ సోషల్ కాజ్లో అందరం ఉత్సాహంగా పని చేస్తున్నాం. యోగి వేమన యూనివర్సిటీ మెగా జాబ్ మేళా తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పుట్టపర్తి, కదిరి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించడానికి క్యాలెండర్ సిద్ధమవుతోంది. – జి. సూర్యచంద్రారెడ్డి, కో ఆర్డినేటర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం – వాకా మంజులారెడ్డి -
అందరి ముఖాల్లో చిరునవ్వే సీఎం ఆశయం
తిరుపతి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన మెగా జాబ్‌మేళా రెండవ రోజు ఆదివారం కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. వారి కుటుంబానికి ఆధారం కల్పించాలి. సామాజికంగా, ఆర్థికంగా ఆ కుటుంబం ఎదగాలి. ఇదీ సీఎం ఆశయం. ఆయన సంకల్పంతోనే ఈ జాబ్‌మేళాల నిర్వహణ. వాస్తవానికి ఈ కార్యక్రమం గురించి ఆలోచించినప్పుడు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ జాబ్‌మేళాలో అత్యధిక వేతనం రూ.77 వేలతో ఆఫర్ లెటర్ ఇచ్చారు’ అని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. వివిధ కంపెనీల హెచ్ఆర్ హెడ్స్ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం 7,537 మందికి ఉద్యోగాలు ► ఇవాళ్టి జాబ్‌మేళాకు కూడా ఊహించని విధంగా ఉద్యోగార్థులు వచ్చారు. పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ అర్హతలతో 4,774 మంది రాగా, వారిలో 1,792 మందికి ఎంపికయ్యారు. బీఏ, బికామ్, బీఎస్సీ, బీబీఏ అర్హతలతో 2,732 మంది హాజరు కాగా, 341 మంది సెలెక్ట్ అయ్యారు. ► బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ అర్హతలతో 2,370 ఉద్యోగార్థులు హాజరు కాగా, 621 మంది ఎంపికయ్యారు. ఇవాళ 9,876 మంది హాజరు కాగా, వారిలో మొత్తంగా 2,753 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ రెండు రోజుల్లో దాదాపు 25,626 మంది హాజరు కాగా, మొత్తం 7,537 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ జాబ్‌మేళాకు 147 జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. ► రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పార్టీ అనుబంధ విభాగాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తాం. విపక్షాల విమర్శ సహేతుకంగా ఉండాలి. కేవలం విమర్శ కోసం విమర్శలు చేయడం సరి కాదు. యువత కోసం ఈ పని చేస్తున్నాం. మేం ఏం చేసినా రాష్ట్రం, ప్రజల కోసమే చేస్తాం. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం. ► ఉద్యోగం రాని వారు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించాలి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమాపే వరకు జాబ్‌మేళా ప్రక్రియ కొనసాగుతుంది. విశాఖపట్నం, గుంటూరులో జరిగే జాబ్‌మేళాలో ప్రత్యేక ప్రతిభావంతులు, 30 ఏళ్లు పైబడిన వారికి ఉద్యోగాలు వచ్చేలా దృష్టి సారిస్తాం. ► జాబ్‌మేళా సక్సెస్‌కు కారకులైన వివిధ కంపెనీల యాజమాన్యాలు, ఎస్వీ యూనివర్సిటీ, జిల్లా యంత్రాంగం, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి డెప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, వలంటీర్లకు కృతజ్ఞతలు. ► ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్చార్జ్ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జాబ్‌మేళాకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేస్తున్న దృశ్యం -
11న మడకశిరలో మెగా ఉద్యోగ మేళా
అనంతపురం న్యూసిటీ : మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ టీహెచ్ విల్సన్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన టెక్‌మహీంద్ర, అపోలో, కార్వే, పోలరీస్, ఇంటెలెంట్ గ్లోబల్ సర్వీసెస్, జెన్పాక్ట్, వినూత్నా ఫెర్టిలైజర్స్ తదితర కంపెనీలు మేళాను నిర్వహిస్తున్నాయన్నారు. పదో తరగతి పాస్/ఫెయిల్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ పూర్తి చేసిన వారు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. -
నిరుద్యోగుల కోసం మెగాజాబ్ మేళా
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుములమదన్‌రెడ్డి అజయ్‌యాదవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నర్సాపూర్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్‌మేళాలు చేపడుతున్నట్టు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం కృష్ణవేణి స్కూల్లో అజయ్‌యాదవ్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఉద్యోగం పొందినవారు రాణించాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో పోటీ పెరిందని, అందుకు అనుగుణంగా ప్రతిభను పెంచుకోవాలని సూచించారు. కాగా, జాబ్‌మేళాలో 14 కంపెనీలు పాల్గొనడం అభినందనీయమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అజయ్‌యాదవ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మురళీధర్ యాదవ్ మాట్లాడుతూ యువతకు అన్ని రంగాల్లో సహకరించేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల గ్రూపు-2 అభ్యర్థులకు 75 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చినట్టు గుర్తుచేశారు. సర్పంచ్ రమణరావు మాట్లాడుతూ.. జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరబిందో ప్రతినిధి రవి మాట్లాడుతూ.. ఉద్యోగాలు రానివారు నిరాశ పడొద్దని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్యక్షుడు గందం రాములు, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శశిధర్, నాయకులు భోగ శేఖర్, మల్లేశ్‌యాదవ్, నర్సింగ్‌రావు, సుభాష్ గౌడ్, భిక్షపతి తదితరులున్నారు. జాబ్‌మేళాలో పాల్గొన్న కంపెనీలు ఎంఆర్ఎఫ్, పెన్నార్ స్టీల్స్, అరబిందో ఫార్మా కంపెనీ, కోవాలెంట్ ల్యాబొరేటరీ, పిరమిల్ హెల్త్‌కేర్, కిర్బి, తోసిబా, పైనార్ ఎలక్ట్రానిక్స్, వసుధ ఫార్మా కంపెనీ, హెచ్జీఎస్ కంపెనీ, జెన్పాక్ట్, ఇన్నోవ్ సోర్స్ ప్రైవేటు కంపెనీ, స్మార్ట్ డ్రైవ్ సిస్టం కంపెనీ, గ్లాండ్ ఫార్మా కంపెనీ, శ్రీరాం చిట్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జాబ్ మేళాకు మంచి స్పందన మెగా జాబ్‌మేళాకు భారీ స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుంచి నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 2,050 హాజరయ్యారు. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల బయోడేటాలు పరిశీలించి త్వరలో సమాచారం అందిస్తామని చెప్పారు. విజయవంతంగా కొనసాగిస్తున్నాం నిరుద్యోగులకు సహకరించాలన్న లక్ష్యయంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పేదలకు రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నాం. ఇటీవల గ్రూపు-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చాం. మరోసారి మరిన్ని ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా జాబ్ మేళా చేపడతాం. - మురళీధర్‌యాదవ్, అజయ్‌యాదవ్ ట్రస్టు చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జాబ్‌మేళా బాగుంది జాబ్‌మేళా బాగుంది. నన్ను ఎమ్మారెఫ్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వూ ్య చేశారు. మరిన్ని జాబ్‌మేళాలు కండక్ట్ చేస్తే నాలాంటి నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. - నవీన్, బీటెక్, నర్సాపూర్ ఉపయోగకరంగా ఉంది ఈ జాబ్‌మేళా నిరుద్యోగులకు ఉనయోగకరంగా ఉంది. నేను బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. మేళాతో ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నా. జిల్లా నుంచి చాలా మంది వచ్చారు. - సౌమ్య, బీటెక్, నర్సాపూర్ మరిన్ని కంపెనీలు రావాలి మరిన్ని కంపెనీలు వస్తే బాగుండేది. విద్యార్హతలకు ప్రాదాన్యం ఉండేలా కంపెనీలు రావాలి. జాబ్ మేళా చేపట్టడం అభినందనీయం. నాలాంటి వాళ్లకు ఉద్యోగ సమస్య తీరుతుంది. - ఈశ్వర్, ఐటీఐ, సంగారెడ్డి అందరికి ఉపయోగ పడేవిదంగా ఉండాలి అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారికి ఉపయోగపడేలా ఉంటే బాగుండేది. ఎక్కువ కంపెనీలు ఐటీఐ అభ్యర్థులను అడిగారు. జాబ్‌మేలా చేపట్టడం అభినందనీయం. - లోకేందర్, మెదక్