
సాక్షి, హైదరాబాద్: పాలక, ప్రతిపక్ష సభ్యులను సమన్వయం చేసుకుంటూ శాసనసభ ఔ న్నత్యం ఇనుమడింపజేసేలా ప్రజాస్వామ్య ప ద్ధతిలో సభా కార్యక్రమాలు నిర్వహిస్తానని వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నికకానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పీకర్ పదవికి కాంగ్రెస్ తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని... దళితుడికి ఇంత పెద్ద హోదా కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే...
మంత్రి పదవి వస్తుందని అనుకున్నా...
నాతో పాటు నియోజకవర్గ, జిల్లా ప్రజలు కూడా ఈసారి నాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నాం. కానీ పార్టీ అధిష్టానం ఇంకా గొప్పగా ఆలోచించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద బాధ్యత అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తను నేను. పార్టీ ఏ పదవి ఇచ్చినా కాదనకుండా చేసుకుంటూపోతా. కాంగ్రెస్ పేరుకు దెబ్బ తగలకుండా ఇచ్చిన పదవికి గౌరవం తెచ్చేలా పనిచేస్తా.
రెండు పర్యాయాలుస్పీకర్ నామమాత్ర పాత్రనే...
గత రెండు పర్యాయాలు శాసనసభ కార్యక్రమాల నిర్వహణను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. నియంతృత్వ ధోరణిలో ప్రతిపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా సభానాయకుడే సభలో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితిని గమనించాం. స్పీకర్ పాత్ర నామమాత్రమైంది. నేను స్పీకర్‌గా ఎన్నికైతే ప్రజాస్వామ్య పద్ధతిలో, సభ గౌరవం తగ్గకుండా, స్పీకర్ విలువ పెంచేలా సభను నడిపిస్తా.
మహామహులు సభలో ఉన్నా...
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఇతర సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. పాలక, ప్రతిపక్షాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా. ఇప్పటి వరకు పాలక పక్షం చెప్పిందే వేదంగా సాగేది. సభలో ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇస్తా. అందరినీ కలుపుకొని ముందుకు వెళతా.
మొదటి దళిత స్పీకర్‌ను నేనే అవుతా...
నేను ఎన్నికైతే తెలంగాణ శాసనసభలో తొలి దళిత స్పీకర్‌గా నాదే రికార్డు అవుతుంది. ఉమ్మడి ఏపీలో ప్రతిభాభారతి తొలి దళిత స్పీకర్‌గా ఉండేవారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇంత పెద్ద పదవి దక్కింది కూడా నాకే.
Comments
Please login to add a commentAdd a comment