‘‘దివంగత నటుడు, దర్శక–నిర్మాత ఎం. ప్రభాకర రెడ్డిగారిది మా పక్క ఊరు. ఆ పరిచయం వల్ల ఆయన నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఆయన తీసుకుని రాకుంటే నాకు ఇండస్ట్రీలో ఓ వేదిక దొరికేది కాదు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అని దర్శకుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఎన్‌కౌంటర్’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. రెండో చిత్రం ‘శ్రీరాములయ్య’ 1998 ఆగస్టు 14న విడుదలైంది. దర్శకునిగా నేటితో ఆయన ప్రయాణం 23ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో శంకర్ చెప్పిన విశేషాలు.
► ఈ 23 ఏళ్ల ప్రయాణం ఎలా అనిపిస్తోంది?
ఇండస్ట్రీలో నా ప్రయాణం 36 ఏళ్లు. అయితే దర్శకునిగా మాత్రం 23 ఏళ్లు. నా మొదటి చిత్రం ‘ఎన్‌కౌంటర్’, రెండో సినిమా’ శ్రీరాములయ్య’ ఏడాది గ్యాప్‌లో ఒకే రోజు విడుదలయ్యాయి. ఇది అనుకోకుండా జరిగింది. ప్రతి సినిమాని ఓ కమిట్‌మెంట్‌తో చేశా. సినిమా అనేది నాకు ఇష్టమైన వృత్తి కావడంతో 100శాతం సంతృప్తిగా ఉంది.
► ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీరు సినిమాలు తీయడం తగ్గించినట్టున్నారే?
అలాంటిదేం లేదు. ఓ వైపు సేవ చేస్తున్నాను. మరోవైపు కథలు రాసుకుంటున్నాను. నాకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయి స్టూడియో కట్టేందుకు భారతదేశంలోని వివిధ స్టూడియోలతో పాటు విదేశాల్లోని వాటిని కూడా పరిశీలిస్తున్నా. వాటి డిజైన్స్ తీసుకుంటున్నా.
► కేసీఆర్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారట?
2001 నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆయన, నేను కలిసి ‘బతుకమ్మ’ సినిమా చేద్దామనుకున్నాం. తెలంగాణ ఎందుకు రావాలి? అని కేసీఆర్‌గారి వద్ద మంచి కథ ఉండేది. నా దర్శకత్వంలోనే ఆ సినిమా చేద్దామనుకున్నాం. అప్పటికి నాకు వరుస హిట్స్ ఉన్నాయి. బాగా వర్కవుట్ అయ్యేది? కానీ చేయలేకపోయాం. ‘జై బోలో తెలంగాణ’ సినిమాకి నాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. దానిపైనా కొందరు కోర్టుకు వెళితే ‘ఎందుకివ్వకూడదు? ఆయన ఆ అవార్డుకు అర్హుడే’ అంటూ ఆ కేసు కొట్టేశారు. ఆ సినిమా విడుదల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇవ్వడంలో తప్పేం లేదని ఆంధ్రలోనూ చాలామంది అనుకున్నారు.
► దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు?
2008 నుంచి 2010 వరకూ తొలిసారి అధ్యక్షుడిగా చేశా. 2018న మళ్లీ ఎన్నికై కొనసాగుతున్నా. డైరెక్టర్స్ వెల్ఫేర్‌కి సంబంధించి చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాం. ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దానికి అధ్యక్షుడిగా రాఘవేంద్రరావుగారు, మేనేజింగ్ ట్రస్టీగా నేను ఉన్నాను. కరోనా సమయంలో సభ్యులకు 5వేల రూపాయల చొప్పున ఇచ్చాం. చిరంజీవిగారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఇప్పటికే రెండు విడతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. వినాయక చవితికి మూడో విడత ఇవ్వబోతున్నాం.
► కొత్త ప్రాజెక్టులు ఏమైనా?
రెండు సినిమాలకు కథలు రెడీ చేశా. వాటికి నేనే దర్శకత్వం వహిస్తా.
► కొత్తవారికి అవకాశాలు కల్పించడానికి ఓ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని విన్నాం...
అవును. నాకు సినిమా నేపథ్యం లేదు. చాలా కష్టాలు ఎదుర్కొన్నా..మెట్టు మెట్టు ఎక్కుతూ వచ్చా.. డా. ఎన్ ప్రభాకర్ రెడ్డిగారు అవకాశం ఇవ్వడం వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ‘ఆయుధం’ సినిమా ద్వారా ఐదు మంది పాటల రచయితలను పరిచయం చేశా. ఆ తర్వాత చాలా మంది అవకాశాల కోసం నన్ను సంప్రదించారు. కానీ నేను అందరికీ ఇవ్వలేను కదా? అందుకే ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఓ వేదిక ఉంటే బాగుంటుందనిపించింది. ‘వేదిక’ అనే ఓ సంస్థని ఏర్పాటు చేస్తున్నా. దీని ద్వారా నూతన నటీనటులు, రచయితలు, దర్శకులు, సింగర్స్, సంగీతం... ఇలా అన్నివర్గాల వారిని ప్రోత్సహిస్తాం. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం.. ఇప్పటికే ఐదు వెబ్ సిరీస్‌కి కథలు రెడీ చేయించాం. కొత్తవారికి ఓ ‘వేదిక’ ఉందనేలా చేస్తాం.
► హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో కట్టబోతున్నానన్నారు.. ఆ ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చాయి?
1984 తర్వాత ప్రభుత్వాలు స్టూడియోలు కట్టుకునేందుకు ఎవరికీ స్థలాలు ఇవ్వలేదు. 2003లో స్టూడియో కోసం ఓసారి దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు. 2012లో మళ్లీ దరఖాస్తు చేయగా పరిశీలనలోకి వెళ్లింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్‌గారు సీఎం అయ్యారు. స్టూడియో కోసం 15 ఎకరాల స్థలం కావాలని ఆయన్ని కోరగా 2019 జూన్‌లో 5 ఎకరాలు నాకు కేటాయించారు. ఏ స్టూడియోకి అయినా 10 నుంచి 15 ఎకరాలుండాలి. కానీ 5 ఎకరాల్లోనే చాలెంజింగ్‌గా తీసుకుని అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి.
– దేరంగుల జగన్
కొత్తవారి కోసం వేదిక ఏర్పాటు చేస్తున్నా!
Published Fri, Aug 14 2020 5:45 AM | Last Updated on Fri, Aug 14 2020 5:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment