Directors association
-
Directors Day 2024: డైరెక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తాం
దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని మే 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దాసరి జయంతి అయిన మే 4న ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ– ‘‘దాసరి నారాయణరావుగారి జయంతిని ఈ ఏడాది మే 4న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం, మిడ్ డే మీల్స్, అసోసియేషన్‌కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కల్చరల్ కమిటీలో డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల ఉంటారు’’ అన్నారు. -
టీఎఫ్‌డీఏ నూతన అధ్యక్షుడిగా వీరశంకర్
తెలుగు సినీ దర్శకుల సంఘం (టీఎఫ్‌డీఏ) సంఘం నూతన అధ్యక్షుడిగా దర్శకుడు బి. వీరశంకర శ్రీనివాస్ (వీరశంకర్) గెలుపొందారు. 2024–2026 సంవత్సరాలకు గాను ఆదివారం హైదరాబాద్‌లో టీఎఫ్‌డీఏ ఎన్నికలు జరిగాయి. దర్శకుల సంఘంలో దాదాపు 2000 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి బి. వీరశంకర శ్రీనివాస్, వి. సముద్రరావు, జి. రామ్‌ప్రసాద్, ఏఎస్ రవికుమార్ చౌదరి, పానుగంటి రాజారెడ్డి పోటీ చేశారు. ఈ పోటీలో 536 ఓట్లతో వీరశంకర్ విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా నీలం సాయిరాజేశ్, ఎమ్వీఎన్ రెడ్డి (వశిష్ఠ), జనరల్ సెక్రటరీగా సీహెచ్ సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా వద్దానం రమేశ్, కస్తూరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పీఎస్ ప్రియదర్శి, డి. వంశీకృష్ణ జయకేతనం ఎగురవేశారు. ట్రెజరర్‌గా పీవీ రామారావు గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎ. కృష్ణమోహన్, అల్లా భక్స్, రాజా వన్నెంరెడ్డి, శైలేష్ కొలను, శ్రీరామ్ ఆదిత్య తుర్లపాటి, కూరపాటి రామారావు, లక్ష్మణరావు చాపర్ల, ప్రవీణ మడిపల్లి, రమణ మొగిలి, కొండా విజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ– ‘‘తెలుగు దర్శకుల సంఘం స్థాయిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకుని వెళ్లేందుకు అందరం కలిసి కృషి చేస్తాం. ఇప్పుడు ఉన్న టీఎఫ్డీఏను ‘టీఎఫ్‌డీఏ 2.ఓ’ అన్నట్లుగా వర్క్ చేస్తాం. హైదరాబాద్‌కు ఎవరైనా పర్యాటకులు వస్తే టీఎఫ్‌డీఏ బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలన్నట్లుగా చేస్తాం. మంచి ఆలోచనలుంటే ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది’’ అన్నారు. -
వ్యూస్ కోసం అలాంటి థంబ్‌నైల్స్ పెట్టడం కరెక్ట్ కాదు
‘‘డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో తంబ్‌నైల్స్, పైరసీ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. అంతేకానీ కొందరు లైక్‌లు, వ్యూయర్స్ కోసం నిర్మాతలు, నటులు, దర్శకులపై తంబ్‌నైల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం తగదు. యూట్యూబ్ తంబ్‌నైల్స్, పైరసీ చేసేవారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చర్చిస్తాం.. పైరసీ సెల్‌ను యాక్టివ్ చేస్తాం’’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినీ ఇండస్ట్రీవారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, పైరసీ వంటి విషయాలపై చర్చించేందుకు 24క్రాఫ్ట్స్ అధక్షులు, సెక్రటరీలు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు. నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘ఓటీటీలపైనా సెన్సార్ ఉండాలి. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రానికల్లా సినిమా పైరసీ అవుతోంది. ఫిలిం చాంబర్ యాంటీ పైరసీ విభాగం డబ్బున్న వాళ్లకే పని చేస్తోంది.. పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్ పాత్ర శూన్యం’’ అన్నారు. ‘‘యూట్యూబ్‌కి కూడా సెన్సార్ విధానం తీసుకురావాలి’’ అని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ అన్నారు. ‘‘మా కుటుంబంపై వచ్చే అసత్య వార్తల వల్ల 25ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాను. మా కష్టాలను అర్థం చేసుకోండి’’ అని నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ అన్నారు. ‘‘సోషల్ మీడియాలో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉండదు.. వారికి ఇష్టమైంది రాసుకుంటున్నారు.. దీన్ని అరికట్టాలి’’ అన్నారు దర్శకుడు ఎన్. శంకర్. -
దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్
తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన అధ్యక్షునిగా దర్శకుడు– రచయిత – నటుడు యనమదల కాశీ విశ్వనాథ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నవంబర్ 14న (ఆదివారం) జరిగిన ఎన్నికల్లో కాశీ విశ్వనాథ్ ప్యానల్ జయకేతనం ఎగురవేసింది. సముద్ర, చంద్రమహేశ్ ప్యానల్స్ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎన్నికల్లో గెలుపొందారు. అధ్యక్షునిగా కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్శదర్శిగా వీఎన్ ఆదిత్య, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మేర్లపాక గాంధీ, జీ.ఎస్.రావు, సంయుక్త కార్యదర్శులుగా కృష్ణమోహన్ అనుమోలు, పెండ్యాల రామారావు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ కృష్ణ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గుంటూరు అంజిబాబు, అల్లాభ„Š , పీవీ రమేశ్ రెడ్డి, కాటూరి రాఘవ, ఇ. ప్రేమ్ రాజ్, నీలం సాయిరాజేశ్, ఎం. సాయి సురేంద్ర బాబు, కూరపాటి రామారావు ఎన్నికయ్యారు. మహిళల రిజర్వేషన్ కోటాలో సౌజన్య, ప్రవీణలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
కొత్తవారి కోసం వేదిక ఏర్పాటు చేస్తున్నా!
‘‘దివంగత నటుడు, దర్శక–నిర్మాత ఎం. ప్రభాకర రెడ్డిగారిది మా పక్క ఊరు. ఆ పరిచయం వల్ల ఆయన నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఆయన తీసుకుని రాకుంటే నాకు ఇండస్ట్రీలో ఓ వేదిక దొరికేది కాదు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అని దర్శకుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఎన్కౌంటర్’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. రెండో చిత్రం ‘శ్రీరాములయ్య’ 1998 ఆగస్టు 14న విడుదలైంది. దర్శకునిగా నేటితో ఆయన ప్రయాణం 23ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో శంకర్ చెప్పిన విశేషాలు. ► ఈ 23 ఏళ్ల ప్రయాణం ఎలా అనిపిస్తోంది? ఇండస్ట్రీలో నా ప్రయాణం 36 ఏళ్లు. అయితే దర్శకునిగా మాత్రం 23 ఏళ్లు. నా మొదటి చిత్రం ‘ఎన్కౌంటర్’, రెండో సినిమా’ శ్రీరాములయ్య’ ఏడాది గ్యాప్‌లో ఒకే రోజు విడుదలయ్యాయి. ఇది అనుకోకుండా జరిగింది. ప్రతి సినిమాని ఓ కమిట్మెంట్తో చేశా. సినిమా అనేది నాకు ఇష్టమైన వృత్తి కావడంతో 100శాతం సంతృప్తిగా ఉంది. ► ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీరు సినిమాలు తీయడం తగ్గించినట్టున్నారే? అలాంటిదేం లేదు. ఓ వైపు సేవ చేస్తున్నాను. మరోవైపు కథలు రాసుకుంటున్నాను. నాకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయి స్టూడియో కట్టేందుకు భారతదేశంలోని వివిధ స్టూడియోలతో పాటు విదేశాల్లోని వాటిని కూడా పరిశీలిస్తున్నా. వాటి డిజైన్స్ తీసుకుంటున్నా. ► కేసీఆర్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారట? 2001 నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆయన, నేను కలిసి ‘బతుకమ్మ’ సినిమా చేద్దామనుకున్నాం. తెలంగాణ ఎందుకు రావాలి? అని కేసీఆర్‌గారి వద్ద మంచి కథ ఉండేది. నా దర్శకత్వంలోనే ఆ సినిమా చేద్దామనుకున్నాం. అప్పటికి నాకు వరుస హిట్స్ ఉన్నాయి. బాగా వర్కవుట్ అయ్యేది? కానీ చేయలేకపోయాం. ‘జై బోలో తెలంగాణ’ సినిమాకి నాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. దానిపైనా కొందరు కోర్టుకు వెళితే ‘ఎందుకివ్వకూడదు? ఆయన ఆ అవార్డుకు అర్హుడే’ అంటూ ఆ కేసు కొట్టేశారు. ఆ సినిమా విడుదల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇవ్వడంలో తప్పేం లేదని ఆంధ్రలోనూ చాలామంది అనుకున్నారు. ► దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? 2008 నుంచి 2010 వరకూ తొలిసారి అధ్యక్షుడిగా చేశా. 2018న మళ్లీ ఎన్నికై కొనసాగుతున్నా. డైరెక్టర్స్ వెల్ఫేర్‌కి సంబంధించి చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాం. ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దానికి అధ్యక్షుడిగా రాఘవేంద్రరావుగారు, మేనేజింగ్ ట్రస్టీగా నేను ఉన్నాను. కరోనా సమయంలో సభ్యులకు 5వేల రూపాయల చొప్పున ఇచ్చాం. చిరంజీవిగారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఇప్పటికే రెండు విడతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. వినాయక చవితికి మూడో విడత ఇవ్వబోతున్నాం. ► కొత్త ప్రాజెక్టులు ఏమైనా? రెండు సినిమాలకు కథలు రెడీ చేశా. వాటికి నేనే దర్శకత్వం వహిస్తా. ► కొత్తవారికి అవకాశాలు కల్పించడానికి ఓ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని విన్నాం... అవును. నాకు సినిమా నేపథ్యం లేదు. చాలా కష్టాలు ఎదుర్కొన్నా..మెట్టు మెట్టు ఎక్కుతూ వచ్చా.. డా. ఎన్ ప్రభాకర్ రెడ్డిగారు అవకాశం ఇవ్వడం వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ‘ఆయుధం’ సినిమా ద్వారా ఐదు మంది పాటల రచయితలను పరిచయం చేశా. ఆ తర్వాత చాలా మంది అవకాశాల కోసం నన్ను సంప్రదించారు. కానీ నేను అందరికీ ఇవ్వలేను కదా? అందుకే ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఓ వేదిక ఉంటే బాగుంటుందనిపించింది. ‘వేదిక’ అనే ఓ సంస్థని ఏర్పాటు చేస్తున్నా. దీని ద్వారా నూతన నటీనటులు, రచయితలు, దర్శకులు, సింగర్స్, సంగీతం... ఇలా అన్నివర్గాల వారిని ప్రోత్సహిస్తాం. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం.. ఇప్పటికే ఐదు వెబ్ సిరీస్‌కి కథలు రెడీ చేయించాం. కొత్తవారికి ఓ ‘వేదిక’ ఉందనేలా చేస్తాం. ► హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో కట్టబోతున్నానన్నారు.. ఆ ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చాయి? 1984 తర్వాత ప్రభుత్వాలు స్టూడియోలు కట్టుకునేందుకు ఎవరికీ స్థలాలు ఇవ్వలేదు. 2003లో స్టూడియో కోసం ఓసారి దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు. 2012లో మళ్లీ దరఖాస్తు చేయగా పరిశీలనలోకి వెళ్లింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్‌గారు సీఎం అయ్యారు. స్టూడియో కోసం 15 ఎకరాల స్థలం కావాలని ఆయన్ని కోరగా 2019 జూన్‌లో 5 ఎకరాలు నాకు కేటాయించారు. ఏ స్టూడియోకి అయినా 10 నుంచి 15 ఎకరాలుండాలి. కానీ 5 ఎకరాల్లోనే చాలెంజింగ్‌గా తీసుకుని అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. – దేరంగుల జగన్ -
నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బే
సంచలన హీరోయిన్ నయనతారపై వ్యతిరేకత ఎక్కువ అవుతోందా? ఆమెపై చర్యలకు నిర్మాతల సంఘం సిద్ధం అవుతోందా? అసలు ఇంతకీ నయనతార ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏమిటి? ఈ విషయాలు చర్చించే ముందు నయనతార స్థాయి ఏమిటో చూద్దాం. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ బ్యూటీ నయనతార.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లామరస్ ఇమేజ్ నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల నటి స్థాయికి ఎదిగింది. అంతే కాదు దక్షిణాదిలోనే నంబర్‌వన్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అలా తన ఇమేజ్‌తో పాటు పారితోషికాన్ని పెంచుకుంటూపోయింది. అది ఎంత అంటే నిర్మాతలకు తడిసి మోపెడు అయ్యేంతగా. నయనతార ప్రస్తుతం రూ.6 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: టీవీ యాంకర్ ఇంట్లో పేలిన కుక్కర్ ఇది కూడా పర్వాలేదు. ఎందుకంటే నిర్మాతలు అందుకు అంగీకరించే అంత భారీ పారితోషికాన్ని ముట్టజెపుతున్నారు. అయితే దానితో పాటు ఆమె ఇతర అవసరాల ఖర్చులే భారంగా మారాయంటున్నారు. నయనతారకు ప్రత్యేక కేరవాన్, బాడీగార్డ్స్ వేతనాలు, ఆమె ప్రత్యేక మేకప్‌మన్, హెయిర్డ్రస్సెర్, వ్యక్తిగత అసిస్టెంట్, కారు డ్రైవర్ వారందరికీ నిర్మాతనే వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి. వీటికి మాత్రమే రోజుకు రూ. 60 నుంచి 70 వేలు అవుతుంది. ఇవికాక నయనతార సొంత ఖర్చులకు కూడా నిర్మాతలపై మోపుతున్నట్లు, చివరికి తన వెంట వచ్చే ఆమె ప్రియుడు సరదాల ఖర్చు నిర్మాతలే భరించాల్సివస్తోందనే ఆరోపణలపై నిర్మాతల మండలిలో చర్చ జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇదే విషయాన్ని ఇటీవల నిర్మాత రాజన్ ఒక వేదికపై నటి నయనతార పారితషికం గురించి మాట్లాడారు. దీంతో ఇకపై నయనతార వంటి స్టార్ హీరోయిన్లకు కేరవాన్ల వసతి, ఇతర ఖర్చులను వారి పారితోషికాల నుంచే పెట్టుకోవాలనే నిబంధనను విధించాలని ఒత్తిడి నిర్మాతల మండలిపై పెరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఇతర నటీమణులు దిగ్బ్రాంతికి గురవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బేనంటున్నారు సినీ వర్గాలు. ఇప్పుటికే అవకాశాలు తగ్గాయని, ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయని, కొత్త అవకాశాలు లేకపోవడంతో నిజంగా ఆమెపై వస్తున్న ఆరోపణలపై నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటే కెరీర్ ఇంకా దారుణంగా తయారవుతుందని సినీ వర్గాల మాట. మరి దీని గురించి నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఎస్.పి. రాజారామ్‌కు దర్శకుల సంఘం నివాళి
‘సమాజానికి సవాల్’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టారు ఎస్.పి రాజారామ్. ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించారు. ఆ తర్వాత తెలుగులో ‘వదినగారి గాజులు’, ‘ముద్దాయి ముద్దుగుమ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో ఘర్వాలీ–బాహర్ వాలి, అభీ అభీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అక్టోబరు 24న ఎస్.పి రాజారామ్ తుది శ్వాస విడిచారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎస్.పి రాజారామ్‌కు నివాళులు అర్పిస్తూ, అసోసియేషన్ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఒక సీనియర్ అండ్ సిన్సియర్ డైరెక్టర్‌ను తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయింది. ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. దర్శకుల సంఘానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అధ్యక్ష పదవికి భారతీ రాజా రాజీనామా
సాక్షి, చెన్నై: దర్శకుల సంఘం అధ్యక్ష పదవికి సీనియర్ దర్శకుడు భారతీరాజా రాజీనామా చేశారు. ఇందుకు తగ్గ ప్రకటనను సోమవారం ఆయన చేశారు. దర్శకుల సంఘానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. గత నెల ఈ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ సమయంలో అధ్యక్ష పదవికి భారతీరాజా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆయన్ను అందరూ ముక్తకంఠంతో అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. మిగిలిన పదవులకు ఈనెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక కావడం ద్వారా ఎదురయ్యే సమస్యలను తాను బాగానే గుర్తెరిగి ఉన్నట్టు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొంటూ భారతీరాజా ఓ ప్రకటన చేశారు. ఈ దృష్ట్యా, తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈనెల 14న ఇతర పదవులకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, అధ్యక్ష పదవికి అదే రోజున ఎన్నికలు జరిగేనా లేదా, ఈ పదవి కోసం మరోమారు ఎన్నికల ప్రక్రియ సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. -
దర్శకుల సంఘం అధ్యక్షుడిగా భారతీరాజా
పెరంబూరు: తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ దర్శకుడు భారతీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సినీ దర్శకుల కోసం తమిళ దర్శకుల సంఘంను నెలకొల్పిన విషయం తెలిసందే. ఈ సంఘానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా దర్శకుడు విక్రమన్, కార్యదర్శిగా ఆర్కే.సెల్వమణి, కోశాధికారిగా పేరరసు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా వీరి కాల పరిమితి పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఈ సంఘ కార్యవర్గ సమావేశాన్ని సోమవారం స్థానిక వడపళిలోని ఒక ప్రైవేట్ సినీ థియేటర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు విక్రమన్ ఆరు సార్లు అధ్యక్ష పదవిలో కొనసాగడంతో ఈ సారి తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. దీంతో ఈ పదవికి సీనియర్ దర్శకుడు భారతీరాజాను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇక మిగిలిని పదవులకు త్వరలోనే ఎన్నికలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
‘త్వరలో దాసరి విగ్రహాన్ని తిరిగి నెలకొల్పుతాం’
సాక్షి, విశాఖపట్నం: స్థానిక బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ వారు తొలిగించటం అన్యాయమనీ ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం నిరసన చేపట్టింది. ఒకవేళ అనుమతులు లేకపోతే విగ్రహాలు నెలకొల్పి సుమారు ఆరు నెలల కావొస్తోంది జివిఎమ్‌సి వారు ఇన్నాళ్లు ఏం చేస్తున్నారనీ, ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు , దర్శకుడు యాదకుమార్ ప్రశ్నించారు. సినీ రంగానికి వన్నె తెచ్చిన దర్శకుడు దాసరి గారి విగ్రహం తొలగించడం అంటే తెలుగు కళా రంగాన్ని అవమానించడమే అని సంఘ కార్యదర్శి, దర్శకుడు కారెం వినయ్ ప్రకాష్ అన్నారు. నాటక రంగ ప్రముఖుడు, రంగసాయి, నాటక సంఘం అధ్యక్షుడు ‘బాదంగీర్’ సాయి మాట్లాడుతూ...‘అత్యంత చిన్న స్థాయి నుండి ఎంతో ఉన్నత స్థాయికి వచ్చి, తెలుగు సినీ రంగంలో ఎంతో ఉన్నతమైన చిత్రాలు దర్శకత్వం వహించిన దాసరి గారి విగ్రహాన్ని ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం ఆధ్వర్యంలో అన్ని అనుమతులతో త్వరలో నెలకొల్పుతామని’ తెలిపారు. ఉత్తరాంధ్ర దర్శకులు రమేష్, శివశ్రీ, గీతాలయ ప్రసాద్, రాకేష్ రెడ్డి, లోలుగు రాజశేఖర్ లతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన సినీ, టీవీ నటీనటులు, దర్శకులు ధర్నాలో పాల్గొన్నారు. -
తిత్లీ బాధితులకు ‘సినీ’ సాయం
తిత్లీ తుఫాన్‌తో శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం కలిగిన సంగతి తెలిసిందే. బాధితులకు తమవంతుగా సాయం అందించేందుకు మంగళవారం హైదరాబాద్‌లో దర్శకుల సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు యన్.శంకర్, ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ దర్శకుల సంఘం తరఫున తిత్లీ తుఫాన్ బాధితులకు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మరికొంత మంది దర్శకుల సంఘం సభ్యులు కూడా వ్యక్తిగతంగా విరాళాలు ప్రకటించారు. వీటన్నిటినీ త్వరలోనే వసూలు చేసి ఏక మొత్తంగా తుఫాన్ బాధితుల సహాయనిధికి అందిస్తామని వారు తెలిపారు. ఎటువంటి ప్రకృతి విపత్తు జరిగినా సినిమా పరిశ్రమ స్పందించటం పరిపాటి. ఈ కోవలోనే ‘తిత్లీ’ బాధితుల కోసం హీరో జూనియర్ ఎన్టీఆర్ 15 లక్షలు, కల్యాణ్ రామ్ 5 లక్షలు, హీరో కార్తికేయ 2లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి అందించారు. మరో హీరో నిఖిల్ కూడా 25 క్వింటాళ్ల బియ్యం, 500 దుప్పట్లను బాధితులకు స్వయంగా అందజేశారు. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా తనవంతుగా రెండు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. -
మే 4న డైరెక్టర్స్ డే
మే 4... దర్శకరత్న డా. దాసరి నారాయణరావు పుట్టినరోజు. నూట యాభైకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. దాసరి భౌతికంగా దూరమైనా తాను అందించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. మే 4న ఆయన జయంతిని పురస్కరించుకుని ఆ రోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించింది తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం. ‘‘స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతి సందర్భంగా మే 4న ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో వేడుక నిర్వహించనున్నాం. తెలుగు దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ తెలిపారు. -
తెలుగు చలనచిత్ర దర్శకుల మండలి అధ్యక్షునిగా ఎన్. శంకర్
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర దర్శకుల మండలి ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో ఎన్.శంకర్ గెలుపొందారు. ఎన్.శంకర్‌తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా జి. రాం ప్రసాద్, కోశాధికారిగా కాశీ విశ్వనాద్, ఉపాధ్యక్షులుగా ఏ.యస్.రవి కుమార్ చౌదరి, ఎస్.వి.భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కట్టా రంగారావు, ఎమ్.ఎస్.శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా డీవీ రాజు(కళింగ), ఎన్ గోపీచంద్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్ అడ్డాల, అనిల్ రావిపుడి, ప్రియదర్శిని, గంగాధర్, అంజిబాబు, మధుసూదన్ రెడ్డి, కృష్ణ మోహన్, కృష్ణ బాబు, చంద్రకాంత్ రెడ్డి విజయం సాధించారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతుంది. -
అంజలికి దర్శకుల సంఘం నోటీసు
సమస్యల్లేవ్ మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సమయం ఆసన్నమయ్యింది అంటూ నటి అంజలి ఇటీవలే ప్రకటించారు. అయితే ఆమెను దర్శకుడు కళైంజియం రూపంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈయన చిత్రం ఊర్ చుట్ట్రి పురాణంలో కొన్ని రోజులు నటించిన అంజలి ఆ తరువాత పిన్నితో మనస్పర్థలు వచ్చి తమిళ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. దీంతో దర్శకుడు కళైంజియం చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అంజలి తెలుగు చిత్రాలపై దృష్టి సారించి తాజాగా మళ్లీ తమిళంలో రీఎంట్రీకి సిద్ధం అవుతున్నారు. దీంతో దర్శకుడు కళైంజియం తమిళ దర్శకుల సం ఘంలో అంజలిపై ఫిర్యాదు చేశారు. అంజలి మళ్లీ తమిళ చిత్రాల్లో నటిస్తున్నందున, ముందుగా తన ఊరి చుట్రి పురాణం చిత్రాన్ని పూర్తి చేసే వరకు ఇతర తమిళ చిత్రాల్లో నటించడాన్ని నిషేధించాలని కోరారు. ఆయన ఫిర్యాదుపై తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ స్పందిస్తూ దర్శకుడు కళైంజియం చిత్రం ఊరి చుట్ట్రి పురాణంను నటి అంజలి పూర్తి చేయూలని, ఈ విషయమై ఆమె మేనేజర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. అంజలి మేనేజర్‌ను సంఘ కార్యాలయానికి రావలసిందిగా నోటీసు పంపినట్లు చెప్పారు. అయితే, అంజలిపై నిషేధం విధించాలన్న విషయం గురించి నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు. దర్శకుడు కలైంజియం చిత్రంలో నటించడానికి అంజలి నిరాకరిస్తే ఆమెపై నిషేధం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంజలి తన పిన్నితో కలిసి దర్శకుడు కళైంజియం తనను చిత్ర హింసలకు గురి చేశారని గతంలోనే ఫిర్యాదు చేయడం గమనార్హం. మరి ఈ వ్యవహారం ముందుముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. -
దర్శకుల సంఘం అధ్యక్షునిగా వీరశంకర్
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. సంఘం అధ్యక్షునిగా వీరశంకర్ ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా కాశీవిశ్వనాథ్, చంద్రమహేశ్, ప్రధాన కార్యదర్శిగా మద్దినేని రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సాయివెంకట్, కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బాలాజీ, మధుర శ్రీధర్, కోశాధికారిగా కాదంబరి కిరణ్ గెలుపొందారు. మొత్తం 860 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు. అంతేకాదు మొదటిసారిగా ఓ దర్శకురాలు ప్రియదర్శిని ఈసీ మెంబర్‌గా పోటీచేసి ఘన విజయం సాధించారు. కార్యనిర్వాహక సభ్యులుగా కె.రంగారావు, కోటేశ్వరరావు, అనిల్, సి.హెచ్. లక్ష్మణ్, చెవిపోగు శ్రీనివాస్, అజయ్, పప్పు, సి. గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం రెండేళ్లపాటు కొనసాగుతుంది.