అంజలికి దర్శకుల సంఘం నోటీసు
సమస్యల్లేవ్ మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సమయం ఆసన్నమయ్యింది అంటూ నటి అంజలి ఇటీవలే ప్రకటించారు. అయితే ఆమెను దర్శకుడు కళైంజియం రూపంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈయన చిత్రం ఊర్ చుట్ట్రి పురాణంలో కొన్ని రోజులు నటించిన అంజలి ఆ తరువాత పిన్నితో మనస్పర్థలు వచ్చి తమిళ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. దీంతో దర్శకుడు కళైంజియం చిత్రం షూటింగ్ ఆగిపోయింది.
అంజలి తెలుగు చిత్రాలపై దృష్టి సారించి తాజాగా మళ్లీ తమిళంలో రీఎంట్రీకి సిద్ధం అవుతున్నారు. దీంతో దర్శకుడు కళైంజియం తమిళ దర్శకుల సం ఘంలో అంజలిపై ఫిర్యాదు చేశారు. అంజలి మళ్లీ తమిళ చిత్రాల్లో నటిస్తున్నందున, ముందుగా తన ఊరి చుట్రి పురాణం చిత్రాన్ని పూర్తి చేసే వరకు ఇతర తమిళ చిత్రాల్లో నటించడాన్ని నిషేధించాలని కోరారు. ఆయన ఫిర్యాదుపై తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ స్పందిస్తూ దర్శకుడు కళైంజియం చిత్రం ఊరి చుట్ట్రి పురాణంను నటి అంజలి పూర్తి చేయూలని, ఈ విషయమై ఆమె మేనేజర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు.
అంజలి మేనేజర్‌ను సంఘ కార్యాలయానికి రావలసిందిగా నోటీసు పంపినట్లు చెప్పారు. అయితే, అంజలిపై నిషేధం విధించాలన్న విషయం గురించి నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు. దర్శకుడు కలైంజియం చిత్రంలో నటించడానికి అంజలి నిరాకరిస్తే ఆమెపై నిషేధం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంజలి తన పిన్నితో కలిసి దర్శకుడు కళైంజియం తనను చిత్ర హింసలకు గురి చేశారని గతంలోనే ఫిర్యాదు చేయడం గమనార్హం. మరి ఈ వ్యవహారం ముందుముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.