Banning
-
చైనా పేమెంట్ యాప్‌లకు ట్రంప్ చెక్
వాషింగ్టన్: తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. చైనాకు చెందిన 8 పేమెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌పై నిషేధాన్ని విధించారు. వీటి ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. నిషేధం విధించిన జాబితాలో అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్ గ్రూప్‌నకు చెందిన అలీ పే, టెన్సెంట్కు చెందిన వియ్‌చాట్ పే సైతం చోటు చేసుకోవడం గమనార్హం! ఈ నెలలో కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే ట్రంప్ యాప్‌లపై నిషేధ బాణాన్ని ఎక్కుపెట్టారు. తద్వారా బీజింగ్‌తో నెలకొన్న వివాదాలు మరింత ముదిరే వీలున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. (మ్యూజిక్ బిజినెస్‌కు అలీబాబా టాటా) 45 రోజుల్లో చైనా యాప్‌లపై ట్రంప్ నిషేధ ఆజ్ణలను మంగళవారం జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ అయిన 45 రోజుల తరువాత నిషేధం అమల్లోకి వస్తుందని వాషింగ్టన్ ప్రభుత్వం పేర్కొంది. తాజా ఆదేశాల ప్రకారం 8 చైనా యాప్‌ల ద్వారా వ్యక్తులు లేదా సంస్థలు లావాదేవీలు నిర్వహిస్తే ఆర్థిక శాఖ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేసింది. నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో అలీపే, కామ్‌స్కానర్, క్యూక్యూ వాలెట్, షేర్ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమేట్, వియ్‌చాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ చోటు చేసుకున్నాయి. యాప్‌ల ద్వారా చైనా బల్క్ డేటా కలెక్షన్ చేపడుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. యూజర్లకు చెందిన ప్రయివేట్ సమాచారాన్ని యాప్స్ సంగ్రహిస్తాయని, దీనివల్ల అమెరికన్లకు రిస్కులు ఎదురుకానున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి నిషేధం అమల్లోకి రానున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) యూజర్లు.. యూఎస్‌లో యాంట్ గ్రూప్‌నకు చెందిన పేమెంట్, లైఫ్‌స్టైల్ యాప్ అలీపే గతేడాది 2.07 లక్షల డౌన్లోడ్స్ను సాధించినట్లు తెలుస్తోంది. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే యాప్‌స్టోర్ నుంచి డౌన్లోడ్స్ నమోదయ్యాయి. ఇక గతేడాది టెక్ దిగ్గజం టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన వియ్‌చాట్ పేతో కూడిన వియ్‌చాట్ 1.6 మిలియన్ డౌన్లోడ్స్ను సాధించినట్లు సెన్సర్ టవర్ ఇంక్ పేర్కొంది. వీటితోపాటు టెన్సెంట్కు చెందిన క్యూక్యూ వాలెట్, టెన్సెంట్ క్యూక్యూ సైతం నిషేధాన్ని ఎదుర్కోనున్న జాబితాలో చేరాయి. మరోవైపు గతేడాది కామ్‌స్కానర్ యాప్‌ను సైతం 4.4 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు సెన్సర్ టవర్ తెలియజేసింది. -
పాఠశాలల్లో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం
దేశ రాజధాని ఢిల్లీ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండే జంక్ ఫుడ్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. శరీరంలో కొవ్వును పెంచే ఆహార పదార్థాలపై నిబంధనలు విధించింది. విద్యార్థులకు అనారోగ్యాన్ని కలిగించే అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే పదార్థాలను పాఠశాల క్యాంటీన్లలో అమ్మరాదంటూ రాజధాని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగించే దుష్ఫలితాలపై ఉదయం అసెంబ్లీ, పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్, పేరెంట్ టీచర్ సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థానిక పాఠశాలలకు ఓ సర్క్యులర్ పంపింది. అటువంటి ఆహార పదార్థాలను క్యాంటీన్లలో అమ్మే పద్ధతిని పాఠశాల యాజమాన్యాలు కూడా నివారించాలని తెలిపింది. కొవ్వు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన ఆహారం అందేలా ప్రోత్సహించాలని సూచించింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన హెచ్ఎఫ్ఎస్ఎస్ ఆహార పదార్థాల జాబితాను నోటీసుబోర్డులో అతికించాలని, ప్రభుత్వ సూచనల మేరకు డ్రాయింగ్, పెయింటింగ్, స్లోగన్లు, డిబేట్ల వంటి కార్యక్రమాలతో ప్రతి విద్యార్థికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలపై అవగాహన కలిగించడంలో పాఠశాల యాజమాన్యం శ్రద్ధ వహించాలని తెలిపింది. ఆరోగ్యకర ప్రపంచాన్ని సృష్టించేదుకు కూరగాయలతో తయారయ్యే శాండ్విచ్, పళ్ళు, పనీర్ కట్లెట్లు, ఖాండ్వీ, పోహా, తక్కువ కొవ్వు కలిగిన పాల లాంటి ఆరోగ్యకర ఆహారాన్ని విద్యార్థులు తీసుకునేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల పిల్లల్లో జంక్ ఫుడ్ నింయంత్రణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలోనూ, చుట్టుపక్కల చిప్స్, వేయించిన ఆహారాలు, శీతల పానీయాలు, కొవ్వు, ఉప్పు , చక్కెర కలిగిన పదార్థాల అమ్మకంపై నియంత్రణ విధించారు. -
సీఎం సిద్ధుకు పొగాకు పొట్లాలు!
రాష్ట్ర విద్యార్థుల గాంధీగిరి బెంగళూరు : రాష్ట్రంలో పొగాకు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ విద్యార్థి లోకం గాంధీమార్గాన్ని అనుసరిస్తోంది. రెండు నెలలుగా సీఎం సిద్ధరామయ్య క్యాంపు కార్యాలయానికి పొగాకు పొట్లాలను పోస్టు ద్వారా పంపిస్తోంది.ద రాష్ట్రంలో పొగాకు, సిగరెట్, బీడీ, పాన్‌పరాగ్ వంటి ఉత్పత్తులను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టులో రాష్ట్రానికి లేఖ రాసింది. ఇందుకు సమ్మతిస్తూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తిరుగు టపా కూడా పంపింది. అయితే పొగాకు ఉత్పత్తుల విక్రయాల నిషేధం మాత్రం ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ముఖ్యంగా విద్యాసంస్థలకు దగ్గర్లోని ఎన్నో కిరాణా దుకాణాల్లో యధేచ్ఛగా వీటి విక్రయం జరుగుతోంది. దీని వల్ల విద్యార్థులు చిన్నవయసులోనే క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థిసంఘాలు నిరసనకు దిగాయి. అందులో భాగంగానే రోజుకు పది పొగాకు పొట్లాలను సీఎం క్యాంప్ కార్యాలయానికి పోస్టులో పంపించడమే కాకుండా పొగాకును రాష్ట్రంలో నిషేధిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలు కూడా రాస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 5వేల పొగాకు పొట్లాలు, 20 వేల లేఖలు రాసినట్లు ఏబీవీపీ రాష్ట్రశాఖ సభ్యుడు కొట్రేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు క్రయ, విక్రయాలపై నిషేధం విధించే వరకు తమ ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. -
తెల్లకోటుల వల్లే రోగాలు విస్తరిస్తున్నాయి
బెంగళూరు: భారతీయ వైద్యులు,వైద్య విద్యార్థులు, ఇతర వైద్య సిబ్బంది ధరించే పొడుగు చేతుల తెల్లగౌనులవల్లే ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నా యంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థి. అందుకే వీటిని నిషేధించాలని స్థానిక వైద్య కళాశాలకు చెందిన ఎడ్మండ్ ఫెర్నాండెజ్ వాదిస్తున్నారు. వారు వేసుకొనే తెల్లగౌనుల వల్ల ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తున్నాయని ఇటీవల ఒక సర్వే తేల్చిందంటున్నారు. దీని వల్లే రోగులకు అనివార్యమైన హాని కలుగుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసిందంటున్నారు. దీనికి సంబంధించి అన్ని ఆస్పత్రులలోను ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటచేయాలని ఫెర్నాండెజ్ కోరుతున్నారు. 19వ శతాబ్దం నుంచి సాంప్రదాయకంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ తెల్లకోటులను ధరిస్తున్నారని తెలిపారు. వైద్యులు, నర్సులు ధరించే యాప్రాన్లు వ్యాధులను విస్తరింపచేసే వాహకాలుగా పనిచేస్తాయనే విషయాన్ని భారతీయులు గమనించాలని కోరారు. తెల్లగౌనులను నిషేధించాలంటూ 2007లో అమెరికా ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని, దీన్ని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఆమోదించిందన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అమలుచేయడానికి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాలు నిరాకరించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యులు ధరిస్తున్నతెల్ల గౌనుల కంటే చూడచక్కని దుస్తులు, ముఖంపైన చిరునవ్వు ముఖ్యమని ఆయనంటున్నారు. దీంతో పాటు వైద్యుడి పేరు తెలిపేలా బ్యాడ్జ్ కూడా ధరించాలని ఆయన సూచిస్తున్నారు. ఇప్పటికైనా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని ఫెర్నాండెజ్ కోరుతున్నారు. -
ప్రేమికుల రోజు నిషేధానికి సహకరించండి
కలెక్టరేట్: ప్రేమికుల రోజును నిషేధించడంలో తమ కార్యకర్తలకు ప్రభుత్వం సహకరించాలని, దీనివల్ల భారతదేశ సంస్కృతిని కాపాడినట్లవుతుందని బజరంగ్దళ్ హిందీనగర్ జిల్లా ప్రముఖ్ వీరేందర్ కోరారు. గురువారం నాంపల్లిలోని కాశీ విశ్వనాథ దేవాలయంలోబజరంగ్దళ్, వీహెచ్‌పీ నాయకులు సంయుక్తంగా ‘బ్యాన్ వాలెంటైన్స్‌డే-సేవ్ భారత్’ పేరుతో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రేమకు ప్రతి రూపమైన భారతదేశ సంస్కృతిని ఇటువంటి కార్యక్రమాలతో విదేశీ శక్తులు కలుషితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి గిరిధర్, కిరణ్, రాకేష్, లక్ష్మణ్, సాయి, శంకర్ పాల్గొన్నారు. వీహెచ్‌పీని అడ్డుకోవాలని సీపీఐ వినతి హిమాయత్‌నగర్: ప్రేమికుల దినోత్సవం రోజున ‘జంటలు బహిరంగంగా కనిపిస్తే పెళ్లి చేస్తామ’ంటూ హెచ్చరిస్తున్న విశ్వహిందూ పరిషత్, శివసేనల ఆగడాలను అడ్డుకోవాలని సీపీఐ నార్త్ జోన్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్, తదితరులు గురువారం అదనపు సీపీ అంజనీ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అసాంఘిక కార్యకలాపాల పేరుతో ఆ సంస్థలు ఈనెల 14న యువతీ యువకులపై తమ ప్రతాపం చూపుతామంటూ కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో ప్రచారం చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి వారి నుంచి కాపాడాలని ఏసీపీని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వేణు, యువజన నాయకురాలు ఉషారాణి, సీపీఐ నాయకులు రాకేష్‌సింగ్, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. నీతి బాహ్య చర్యకు అడ్డుకట్ట వేయండి సిటీబ్యూరో: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి నీతి బాహ్యమైన చర్యలు జరుగకుండా కట్టడి చేయాలని మెరాజ్ ఖాన్ ఉమెన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మెరాజ్ ఖాన్ రాష్ర్ట గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రేమికుల దినోత్సవం పేరుతో జరిగే చర్యలతో శాంతికి భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార ని తెలిపారు. -
అంజలికి దర్శకుల సంఘం నోటీసు
సమస్యల్లేవ్ మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సమయం ఆసన్నమయ్యింది అంటూ నటి అంజలి ఇటీవలే ప్రకటించారు. అయితే ఆమెను దర్శకుడు కళైంజియం రూపంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈయన చిత్రం ఊర్ చుట్ట్రి పురాణంలో కొన్ని రోజులు నటించిన అంజలి ఆ తరువాత పిన్నితో మనస్పర్థలు వచ్చి తమిళ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. దీంతో దర్శకుడు కళైంజియం చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అంజలి తెలుగు చిత్రాలపై దృష్టి సారించి తాజాగా మళ్లీ తమిళంలో రీఎంట్రీకి సిద్ధం అవుతున్నారు. దీంతో దర్శకుడు కళైంజియం తమిళ దర్శకుల సం ఘంలో అంజలిపై ఫిర్యాదు చేశారు. అంజలి మళ్లీ తమిళ చిత్రాల్లో నటిస్తున్నందున, ముందుగా తన ఊరి చుట్రి పురాణం చిత్రాన్ని పూర్తి చేసే వరకు ఇతర తమిళ చిత్రాల్లో నటించడాన్ని నిషేధించాలని కోరారు. ఆయన ఫిర్యాదుపై తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ స్పందిస్తూ దర్శకుడు కళైంజియం చిత్రం ఊరి చుట్ట్రి పురాణంను నటి అంజలి పూర్తి చేయూలని, ఈ విషయమై ఆమె మేనేజర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. అంజలి మేనేజర్‌ను సంఘ కార్యాలయానికి రావలసిందిగా నోటీసు పంపినట్లు చెప్పారు. అయితే, అంజలిపై నిషేధం విధించాలన్న విషయం గురించి నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు. దర్శకుడు కలైంజియం చిత్రంలో నటించడానికి అంజలి నిరాకరిస్తే ఆమెపై నిషేధం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంజలి తన పిన్నితో కలిసి దర్శకుడు కళైంజియం తనను చిత్ర హింసలకు గురి చేశారని గతంలోనే ఫిర్యాదు చేయడం గమనార్హం. మరి ఈ వ్యవహారం ముందుముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.