తెల్లకోటుల వల్లే రోగాలు విస్తరిస్తున్నాయి
బెంగళూరు: భారతీయ వైద్యులు,వైద్య విద్యార్థులు, ఇతర వైద్య సిబ్బంది ధరించే పొడుగు చేతుల తెల్లగౌనులవల్లే ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నా యంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థి. అందుకే వీటిని నిషేధించాలని స్థానిక వైద్య కళాశాలకు చెందిన ఎడ్మండ్ ఫెర్నాండెజ్ వాదిస్తున్నారు. వారు వేసుకొనే తెల్లగౌనుల వల్ల ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తున్నాయని ఇటీవల ఒక సర్వే తేల్చిందంటున్నారు. దీని వల్లే రోగులకు అనివార్యమైన హాని కలుగుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసిందంటున్నారు.
దీనికి సంబంధించి అన్ని ఆస్పత్రులలోను ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటచేయాలని ఫెర్నాండెజ్ కోరుతున్నారు. 19వ శతాబ్దం నుంచి సాంప్రదాయకంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ తెల్లకోటులను ధరిస్తున్నారని తెలిపారు. వైద్యులు, నర్సులు ధరించే యాప్రాన్లు వ్యాధులను విస్తరింపచేసే వాహకాలుగా పనిచేస్తాయనే విషయాన్ని భారతీయులు గమనించాలని కోరారు.
తెల్లగౌనులను నిషేధించాలంటూ 2007లో అమెరికా ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని, దీన్ని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఆమోదించిందన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అమలుచేయడానికి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాలు నిరాకరించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యులు ధరిస్తున్నతెల్ల గౌనుల కంటే చూడచక్కని దుస్తులు, ముఖంపైన చిరునవ్వు ముఖ్యమని ఆయనంటున్నారు. దీంతో పాటు వైద్యుడి పేరు తెలిపేలా బ్యాడ్జ్ కూడా ధరించాలని ఆయన సూచిస్తున్నారు. ఇప్పటికైనా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని ఫెర్నాండెజ్ కోరుతున్నారు.