పాఠశాలల్లో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం
దేశ రాజధాని ఢిల్లీ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండే జంక్ ఫుడ్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. శరీరంలో కొవ్వును పెంచే ఆహార పదార్థాలపై నిబంధనలు విధించింది. విద్యార్థులకు అనారోగ్యాన్ని కలిగించే అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే పదార్థాలను పాఠశాల క్యాంటీన్లలో అమ్మరాదంటూ రాజధాని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగించే దుష్ఫలితాలపై ఉదయం అసెంబ్లీ, పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్, పేరెంట్ టీచర్ సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థానిక పాఠశాలలకు ఓ సర్క్యులర్ పంపింది. అటువంటి ఆహార పదార్థాలను క్యాంటీన్లలో అమ్మే పద్ధతిని పాఠశాల యాజమాన్యాలు కూడా నివారించాలని తెలిపింది. కొవ్వు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన ఆహారం అందేలా ప్రోత్సహించాలని సూచించింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన హెచ్ఎఫ్ఎస్ఎస్ ఆహార పదార్థాల జాబితాను నోటీసుబోర్డులో అతికించాలని, ప్రభుత్వ సూచనల మేరకు డ్రాయింగ్, పెయింటింగ్, స్లోగన్లు, డిబేట్ల వంటి కార్యక్రమాలతో ప్రతి విద్యార్థికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలపై అవగాహన కలిగించడంలో పాఠశాల యాజమాన్యం శ్రద్ధ వహించాలని తెలిపింది.
ఆరోగ్యకర ప్రపంచాన్ని సృష్టించేదుకు కూరగాయలతో తయారయ్యే శాండ్‌విచ్, పళ్ళు, పనీర్ కట్లెట్లు, ఖాండ్వీ, పోహా, తక్కువ కొవ్వు కలిగిన పాల లాంటి ఆరోగ్యకర ఆహారాన్ని విద్యార్థులు తీసుకునేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల పిల్లల్లో జంక్ ఫుడ్ నింయంత్రణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలోనూ, చుట్టుపక్కల చిప్స్, వేయించిన ఆహారాలు, శీతల పానీయాలు, కొవ్వు, ఉప్పు , చక్కెర కలిగిన పదార్థాల అమ్మకంపై నియంత్రణ విధించారు.