రాష్ట్ర విద్యార్థుల గాంధీగిరి
బెంగళూరు : రాష్ట్రంలో పొగాకు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ విద్యార్థి లోకం గాంధీమార్గాన్ని అనుసరిస్తోంది. రెండు నెలలుగా సీఎం సిద్ధరామయ్య క్యాంపు కార్యాలయానికి పొగాకు పొట్లాలను పోస్టు ద్వారా పంపిస్తోంది.ద రాష్ట్రంలో పొగాకు, సిగరెట్, బీడీ, పాన్‌పరాగ్ వంటి ఉత్పత్తులను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టులో రాష్ట్రానికి లేఖ రాసింది. ఇందుకు సమ్మతిస్తూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తిరుగు టపా కూడా పంపింది. అయితే పొగాకు ఉత్పత్తుల విక్రయాల నిషేధం మాత్రం ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ముఖ్యంగా విద్యాసంస్థలకు దగ్గర్లోని ఎన్నో కిరాణా దుకాణాల్లో యధేచ్ఛగా వీటి విక్రయం జరుగుతోంది. దీని వల్ల విద్యార్థులు చిన్నవయసులోనే క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థిసంఘాలు నిరసనకు దిగాయి. అందులో భాగంగానే రోజుకు పది పొగాకు పొట్లాలను సీఎం క్యాంప్ కార్యాలయానికి పోస్టులో పంపించడమే కాకుండా పొగాకును రాష్ట్రంలో నిషేధిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలు కూడా రాస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 5వేల పొగాకు పొట్లాలు, 20 వేల లేఖలు రాసినట్లు ఏబీవీపీ రాష్ట్రశాఖ సభ్యుడు కొట్రేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు క్రయ, విక్రయాలపై నిషేధం విధించే వరకు తమ ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
సీఎం సిద్ధుకు పొగాకు పొట్లాలు!
Published Sat, Aug 29 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM
Advertisement
Advertisement