ప్రేమికుల రోజు నిషేధానికి సహకరించండి
కలెక్టరేట్: ప్రేమికుల రోజును నిషేధించడంలో తమ కార్యకర్తలకు ప్రభుత్వం సహకరించాలని, దీనివల్ల భారతదేశ సంస్కృతిని కాపాడినట్లవుతుందని బజరంగ్‌దళ్ హిందీనగర్ జిల్లా ప్రముఖ్ వీరేందర్ కోరారు. గురువారం నాంపల్లిలోని కాశీ విశ్వనాథ దేవాలయంలోబజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నాయకులు సంయుక్తంగా ‘బ్యాన్ వాలెంటైన్స్‌డే-సేవ్ భారత్’ పేరుతో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రేమకు ప్రతి రూపమైన భారతదేశ సంస్కృతిని ఇటువంటి కార్యక్రమాలతో విదేశీ శక్తులు కలుషితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి గిరిధర్, కిరణ్, రాకేష్, లక్ష్మణ్, సాయి, శంకర్ పాల్గొన్నారు.
వీహెచ్‌పీని అడ్డుకోవాలని సీపీఐ వినతి
హిమాయత్‌నగర్: ప్రేమికుల దినోత్సవం రోజున ‘జంటలు బహిరంగంగా కనిపిస్తే పెళ్లి చేస్తామ’ంటూ హెచ్చరిస్తున్న విశ్వహిందూ పరిషత్, శివసేనల ఆగడాలను అడ్డుకోవాలని సీపీఐ నార్త్ జోన్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్, తదితరులు గురువారం అదనపు సీపీ అంజనీ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అసాంఘిక కార్యకలాపాల పేరుతో ఆ సంస్థలు ఈనెల 14న యువతీ యువకులపై తమ ప్రతాపం చూపుతామంటూ కరపత్రాలు, వాల్‌పోస్టర్‌లతో ప్రచారం చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి వారి నుంచి కాపాడాలని ఏసీపీని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వేణు, యువజన నాయకురాలు ఉషారాణి, సీపీఐ నాయకులు రాకేష్‌సింగ్, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.
నీతి బాహ్య చర్యకు అడ్డుకట్ట వేయండి
సిటీబ్యూరో: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి నీతి బాహ్యమైన చర్యలు జరుగకుండా కట్టడి చేయాలని మెరాజ్ ఖాన్ ఉమెన్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు మెరాజ్ ఖాన్ రాష్ర్ట గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రేమికుల దినోత్సవం పేరుతో జరిగే చర్యలతో శాంతికి భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార ని తెలిపారు.