తెలుగు సినీ దర్శకుల సంఘం (టీఎఫ్‌డీఏ) సంఘం నూతన అధ్యక్షుడిగా దర్శకుడు బి. వీరశంకర శ్రీనివాస్ (వీరశంకర్) గెలుపొందారు. 2024–2026 సంవత్సరాలకు గాను ఆదివారం హైదరాబాద్‌లో టీఎఫ్‌డీఏ ఎన్నికలు జరిగాయి. దర్శకుల సంఘంలో దాదాపు 2000 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి బి. వీరశంకర శ్రీనివాస్, వి. సముద్రరావు, జి. రామ్‌ప్రసాద్, ఏఎస్ రవికుమార్ చౌదరి, పానుగంటి రాజారెడ్డి పోటీ చేశారు.
ఈ పోటీలో 536 ఓట్లతో వీరశంకర్ విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా నీలం సాయిరాజేశ్, ఎమ్‌వీఎన్ రెడ్డి (వశిష్ఠ), జనరల్ సెక్రటరీగా సీహెచ్ సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా వద్దానం రమేశ్, కస్తూరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పీఎస్ ప్రియదర్శి, డి. వంశీకృష్ణ జయకేతనం ఎగురవేశారు. ట్రెజరర్‌గా పీవీ రామారావు గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎ. కృష్ణమోహన్, అల్లా భక్స్, రాజా వన్నెంరెడ్డి, శైలేష్ కొలను, శ్రీరామ్ ఆదిత్య తుర్లపాటి, కూరపాటి రామారావు, లక్ష్మణరావు చాపర్ల, ప్రవీణ మడిపల్లి, రమణ మొగిలి, కొండా విజయ్‌కుమార్ ఎన్నికయ్యారు.
ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ– ‘‘తెలుగు దర్శకుల సంఘం స్థాయిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకుని వెళ్లేందుకు అందరం కలిసి కృషి చేస్తాం. ఇప్పుడు ఉన్న టీఎఫ్‌డీఏను ‘టీఎఫ్‌డీఏ 2.ఓ’ అన్నట్లుగా వర్క్ చేస్తాం. హైదరాబాద్‌కు ఎవరైనా పర్యాటకులు వస్తే టీఎఫ్‌డీఏ బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలన్నట్లుగా చేస్తాం. మంచి ఆలోచనలుంటే ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment